- రణ్‌వీర్ సింగ్, బాబీ డియోల్ కూడా
సహనం వందే, ముంబై:
సాధారణంగా పెద్ద సినిమాలకు వందల కోట్లు ఖర్చు పెట్టడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందడం సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ‘చింగ్స్ దేశీ చైనీస్’ బ్రాండ్ కోసం ప్రముఖ దర్శకుడు అట్లీ ఈ ప్రకటనను తెరకెక్కిస్తున్నారు. ఈ యాడ్ కోసం ఏకంగా సినిమా బడ్జెట్‌ను మించిన మొత్తాన్ని వెచ్చించడం విస్మయపరుస్తోంది. ఈ అడ్వర్టైజ్‌మెంట్‌కు బాలీవుడ్ అగ్ర హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన ఆకర్షణ కాగా, దక్షిణాదిలో భారీ క్రేజ్ ఉన్న యువ నటి శ్రీలీల కూడా నటిస్తోంది. వీరితో పాటు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ ప్రకటన భారత్‌లో ఇప్పటివరకు వచ్చిన అత్యంత ఖరీదైన యాడ్ గా రికార్డు సృష్టించనుంది.
విజువల్ వండర్ కు పెట్టుబడి…
ఈ రూ. 150 కోట్ల బడ్జెట్‌లో నటీనటుల పారితోషికాలు, భారీ సెట్టింగులు, అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్ పనులు కీలక పాత్ర పోషించాయి. ఒక ప్రకటన కోసం ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయడం చూస్తే అట్లీ దీన్ని ఒక విజువల్ వండర్‌గా రూపొందిస్తున్నారని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 10 చిన్నపాటి సినిమా బడ్జెట్లను మించిపోయిన ఈ అసాధారణ పెట్టుబడి యాడ్ కంటెంట్‌పై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ ప్రకటనలో ఎలాంటి కథాంశాన్ని చూపించబోతున్నారు… ముఖ్యంగా యువతలో మాస్ ఫాలోయింగ్ ఉన్న శ్రీలీల పాత్ర ఎంత ప్రత్యేకంగా ఉండబోతుందనే ఉత్కంఠ నెలకొంది.
సినిమా స్థాయిలో క్రేజ్…
భారీ బడ్జెట్, అగ్ర తారలు, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్‌తో వస్తున్న ఈ యాడ్ కోసం ఇప్పుడు సినిమా స్థాయిలో క్రేజ్ నెలకొంది. ఈ ప్రకటన విడుదలయ్యే వరకు దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వేచి చూడక తప్పదు. ఇదిలా ఉంటే అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రానున్న ఏఏ22ఏ6 చిత్రం 2027లో విడుదల కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ భారీ యాడ్ వార్త అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రకటన విజయం, వాణిజ్య ప్రకటనల చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతుంది అనడంలో సందేహం లేదు.