‘కృష్ణయ్య’ లీలలు… కాషాయ ‘రంగులు’ – అడ్డమేసిన పార్టీ ఎంపీనే బీసీలకు అండనా?

  • ఆర్.కృష్ణయ్య విశ్వసనీయతపై అనుమానాలు
  • రేపటి బీసీ బంద్ పై రాజకీయ నీలి నీడలు
  • అందరూ అనుకూలురైతే నిరసన ఎవరిపై…?
  • అసలు ఎవరికి వ్యతిరేకంగా తెలంగాణ బంద్?
  • అన్ని పార్టీల మద్దతుతో విచిత్రమైన నిరసన
  • బీఆర్ఎస్ కూడా కార్యక్రమంలో భాగస్వామ్యం

సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు బీసీ సంఘాలు ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ రాజకీయ విచిత్రాలకు నిలయంగా మారింది. రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అని అందరికీ తెలిసినా… అదే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఆర్. ‘కృష్ణయ్య’ ఈ బంద్‌కు ప్రధానంగా నాయకత్వం వహించడం హాస్యాస్పదం. ఆయనతోపాటు మరో బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ చేతులు కలపడం… బీసీ బంధువుల్లోని శత్రువుల నాటకానికి అద్దం పడుతోంది. రిజర్వేషన్లకు కత్తెర వేస్తున్న పార్టీ నేతతో కలిసి నిరసన తెలియజేయడం బీసీ ఉద్యమ ఉద్దేశాన్ని పక్కదారి పట్టిస్తుందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

అడ్డమేసినవారిదే నాయకత్వం…
తెలంగాణ ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని కోరింది. గవర్నర్‌కు పంపినా రాష్ట్రపతి ఆమోదం తెలపకపోవడంలోనే బీజేపీ వైఖరి స్పష్టమవుతోంది. హైకోర్టు, సుప్రీంకోర్టులలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలడానికి మూల కారణం కేంద్రం సహకరించకపోవడమే. ఇలాంటి స్థితిలో రిజర్వేషన్లను అడ్డుకుంటున్న పార్టీకి చెందిన నేత ఆర్. కృష్ణయ్య ఉద్యమానికి సారథ్యం వహించడం… అన్ని పార్టీల మద్దతు కూడగట్టడం వెనుక రాజకీయ పన్నాగం ఏముందో బీసీ వర్గాలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ బంద్‌ ఎవరికి వ్యతిరేకమనే ప్రశ్నలు రాజకీయ చర్చకు తెరలేపింది. అందరూ అనుకూలమైతే నిరసన కార్యక్రమం ఎవర్ని ప్రశ్నించడానికి? కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని రకాలుగా పోరాటం చేసినప్పటికీ కేంద్రం అడ్డం వేసిన సంగతి అందరికీ తెలిసిందే.

బలిపశువులు బీసీలే…
బీసీ రిజర్వేషన్లు అగ్రవర్ణాల చేతుల్లో బందీగా ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. బీసీ నేతలు తమ ఉద్యమాన్ని అగ్రవర్ణాల చేతుల్లో పెట్టారన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించినట్టుగా… ఒకవైపు కేంద్రంలో బిల్లును, ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటూనే… మరోవైపు రాష్ట్ర బంద్‌కు బీజేపీ మద్దతు ఇవ్వడం నాటకమా? కాదా? ప్రజలను పక్కదారి పట్టిస్తున్న రాజకీయ కుట్ర కాదా? రిజర్వేషన్ల అమలు పూర్తి బాధ్యత కేంద్రానిదే అయినప్పుడు కేంద్రాన్ని ప్రశ్నించకుండా జరిగే ఈ బంద్ కేవలం కంటితుడుపు చర్య మాత్రమే అవుతుంది. బీసీ నాయకులు తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారా అనే అనుమానం కలుగుతోంది.

నేడు చలో రాజ్ భవన్ కు సీపీఎం పిలుపు
ఈ బంద్‌పై సీపీఎం నాయకులు జాన్‌వెస్లీ, తమ్మినేని వీరభద్రం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు ప్రధాన అవరోధం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేస్తూ, అడ్డుకుంటున్న పార్టీకి వ్యతిరేకంగా పోరాడకుండా వారి మద్దతుతో బంద్ నిర్వహించడంలో అర్థం లేదని నిలదీశారు. దీంతో ఒంటరిగా కేంద్రం వైఖరికి నిరసనగా శుక్రవారం చలో రాజ్‌భవన్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అఖిలపక్షం నిర్వహించి కేంద్రంపై పోరాడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ బంద్ సరైన దిశ చూపబోదని, బీసీల ఆశలను రాజకీయ పార్టీలు కేవలం ఓట్ల కోసం వాడుకుంటున్నాయనే అభిప్రాయం బలపడుతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *