మానవ హక్కుల బ్రోకర్లకు నోబెల్ – ఇజ్రాయిల్ మద్దతుదారు మచాడో ఎంపిక

  • నోబెల్ శాంతి బహుమతిపై రాజకీయ నీడలు
  • పశ్చిమ దేశాల ఎజెండానే ఆమె జెండా
  • వెనిజులా ప్రభుత్వంపై అమెరికా ఉక్కుపాదం
  • అందుకు ప్రతిపక్ష నాయకురాలుగా మద్దతు
  • నోబెల్ ప్రకటించాక ట్రంప్ కు ఆమె కృతజ్ఞతలు
  • గాంధీకి నోబెల్ తిరస్కరణ… హిట్లర్ కు సిగ్నల్
  • అంతర్జాతీయ అహింసా మూర్తికి అవమానం

సహనం వందే, హైదరాబాద్:
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి మరోసారి తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది. 2025 సంవత్సరానికి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కోరినా మచాడోకు ఈ పురస్కారం దక్కడం నోబెల్ కమిటీ పశ్చిమ దేశాల రాజకీయ అజెండాను అమలు చేస్తోందనడానికి తాజా నిదర్శనం.

అహింసా మార్గంలో ప్రపంచానికి స్వాతంత్య్ర సిద్ధాంతాన్ని చూపిన జాతిపిత మహాత్మాగాంధీకి ఐదుసార్లు నామినేషన్ వేసినా దక్కని ఈ గౌరవం… వెనెజులాలో సోషలిస్టు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడిన మచాడోకు లభించడం విస్మయం కలిగిస్తుంది. ప్రజాస్వామ్య పోరాటం పేరుతో అమెరికా విదేశాంగ విధానానికి అనుగుణంగా వెనిజులాలో పాలన మార్పును కోరుకునే శక్తులకు ఈ బహుమతి పరోక్ష మద్దతుగా నిలుస్తుందనే విమర్శలు అంతర్జాతీయ వినిపిస్తున్నాయి.

గాంధీకి అవమానం‌‌.‌.‌. పాశ్చాత్య ఒత్తిడి ఫలితం
ప్రపంచ శాంతికి అహింసా సిద్ధాంతాన్ని అందించిన గాంధీని 1937 నుంచి 1948 వరకు ఐదు సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినా ఒక్కసారి కూడా అవార్డు దక్కలేదు. అప్పటి నోబెల్ కమిటీ గాంధీని శాంతి దూతగా కాకుండా కేవలం జాతీయ నాయకుడిగా మాత్రమే పరిగణించింది. బ్రిటన్‌తో గాంధీ పోరాటం చేస్తున్న సమయంలో పాశ్చాత్య దేశాల రాజకీయాల ఒత్తిడి కమిటీ నిర్ణయాలపై పడిందని చరిత్రకారులు బలంగా నమ్ముతున్నారు. 1948లో గాంధీ హత్యకు గురైన తర్వాత జీవించి ఉన్న వారికే అవార్డు ఇవ్వాలనే నిబంధనను సాకుగా చూపి ఆ సంవత్సరం బహుమతినే రద్దు చేశారు. విచిత్రం ఏంటంటే లక్షలాదిమందిని చంపిన హిట్లర్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలని నిర్ణయించడం దారుణం. ఈ పరిణామం నోబెల్ కమిటీ నిష్పాక్షికతపై మొదటి నుంచీ ఉన్న సందేహాలకు మరింత బలం చేకూర్చింది.

నోబెల్ చరిత్రే వివాదాస్పదం…
నోబెల్ శాంతి బహుమతి చరిత్రలో శాంతి యోధులకు కంటే యుద్ధోన్మాదులకు ఎక్కువ పట్టం కట్టారన్న విమర్శలు ఎప్పుడూ ఉన్నాయి. గాంధీకి దక్కని ఈ బహుమతి ప్రపంచ యుద్ధాలకు కారణమైన వుడ్రో విల్సన్, వియత్నాంలో ఒప్పందాలు ఉల్లంఘించిన హెన్రీ కిస్సింజర్ వంటి వారికి లభించింది. ఆఫ్ఘనిస్తాన్‌కు అదనపు సైన్యాన్ని పంపిన అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా సైతం ఈ అవార్డును పొందారు. తాజా విజేత మచాడో సైతం అమెరికా సైనిక జోక్యాన్ని, వెనిజులాపై దాడిని బహిరంగంగా సమర్థించారు. అంతేకాక ఆమె ఇజ్రాయెల్‌కు మద్దతు పలకడం, యుద్ధ నేరస్థుడిగా ముద్రపడ్డ బెంజమిన్ నెతన్యాహును ఆశ్రయించడం వంటి చర్యలు ఆమె మానవ హక్కుల పోరాటంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. శాంతి సిద్ధాంతాన్ని ప్రచారం చేయాల్సిన బహుమతి ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని కోరుకునే శక్తులకు అనుకూలంగా మారుతోందని విశ్లేషకులు ధ్వజమెత్తుతున్నారు.

పుతిన్ నిప్పులు…
నోబెల్ కమిటీ నిర్ణయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. నోబెల్ బహుమతి తన ప్రతిష్ఠను కోల్పోయిందంటూ ఘాటుగా విమర్శించారు. మిడిల్ ఈస్ట్‌లో శాంతిని నెలకొల్పడానికి కృషి చేసిన డొనాల్డ్ ట్రంప్‌ను తిరస్కరించడం, కమ్యూనిస్టు వ్యతిరేకి మచాడోను ఎంపిక చేయడం కేవలం యాదృచ్చికం కాదు. పశ్చిమ దేశాల రాజకీయ వ్యూహంలో భాగమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ట్రంప్‌ నామినేషన్లు గడువు తర్వాతే అందాయంటూ నోబెల్ కమిటీ ఇచ్చిన వివరణ అసంబద్ధంగా ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎంపిక తమ రాజకీయ ఎజెండాకు మద్దతుగా ఉన్న శక్తులకు నోబెల్ కమిటీ బాసటగా నిలుస్తుందనే విమర్శలకు మరింత బలం చేకూర్చింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *