ఏడు అడుగులకు… అరవై లక్షలు – అబ్బాయిలకు మ్యారేజ్ బ్యూరో కండీషన్

  • 60 లక్షల ప్యాకేజీ ఉంటేనే పెళ్లి సంబంధం
  • అమ్మాయిలకు జీరో బ్యాంక్ బ్యాలెన్స్ షరతు
  • ఒక శాతం ఉన్న క్రీం అబ్బాయిలకు మాత్రమే
  • పెళ్లి మార్కెట్ ప్రారంభించినట్లు విమర్శలు
  • వివాహ వ్యవస్థలో విలువల పతనం!

సహనం వందే, హైదరాబాద్:
పెళ్లి అనేది రెండు మనసుల కలయిక అని మన సంప్రదాయం చెబుతోంది. కానీ‌ ఏఐ యుగంలో పెళ్లి సంబంధాలు కూడా పక్కా వ్యాపారంగా మారిపోయాయని ఒక కొత్త పరిణామం రుజువు చేస్తోంది. దేశంలో పెళ్లి సంబంధాల కోసం ఏర్పాటు అయిన నాట్(Knot) డేటింగ్ యాప్… అబ్బాయిల వార్షిక ఆదాయం కనీసం రూ. 60 లక్షలు ఉండాలని కఠిన షరతు విధించింది. అమ్మాయిలకు మాత్రం ఎలాంటి ఆదాయ పరిమితి పెట్టకుండా వివాదానికి కేంద్రంగా మారింది. సంప్రదాయ భారతీయ వివాహ వ్యవస్థలో అప్పుడప్పుడూ వినిపించే కట్నం, కారు, బంగళా వంటి డిమాండ్లను ఈ యాప్ మరింత ధైర్యంగా డిజిటల్ రూపంలో తెరపైకి తెచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని కేవలం టాప్ ఒక శాతం సంపన్నులనే లక్ష్యంగా చేసుకున్నామని ఈ యాప్ ప్రకటించింది. ఇది మనుషుల కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తుందని తేటతెల్లం చేస్తోంది.

పురుషుల ఆదాయ పరీక్ష…
ఈ వివాదాస్పద యాప్‌ను ఇద్దరు మగవారే స్థాపించడం విచిత్రం. వివాహానికి సిద్ధంగా ఉన్న వారికోసమే తమ ప్రయత్నమని వ్యవస్థాపకులు చెబుతున్నా… పురుషులు తమ సంపాదన 60 లక్షలకు తగ్గకుండా ఉందని నిరూపించుకోవాలనే నిబంధన వారిని ఆదాయ పరీక్షకు నిలబెట్టినట్టే ఉంది. ఈ సంఖ్య కేవలం ఒక మార్గదర్శక రేఖ అని… భవిష్యత్తుపై అతనికున్న దృష్టిని తెలియజేస్తుందని దాని వ్యవస్థాపకుడు సమర్థించుకోవడం హాస్యాస్పదం. సంపాదనను బట్టి మనిషి దృష్టి, స్వభావం, ఆలోచనా విధానం ఎలా నిర్ధారిస్తారనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. కేవలం ధనవంతులైన భర్తలను వెతికేందుకు మహిలకు ఈ యాప్ ఎటువంటి షరతులు లేకుండా ఉచిత ప్రవేశం కల్పించడం విశేషం. భారతీయ పెళ్లి సంప్రదాయాన్ని అపహాస్యం పాలు చేస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.

ధనవంతుడు కొనుగోలు వస్తువు…
సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ న్యాయవాది ఒకరు ఈ యాప్ నిబంధనలపై విమర్శలు గుప్పిస్తున్నారు. నాట్ యాప్‌ను ఆమె ఏకంగా గోల్డ్ డిగ్గర్ల షాపింగ్ మాల్‌గా అభివర్ణించింది. ధనవంతుడైన భర్తను కొనుగోలు చేసుకునే విధంగా ఈ వేదిక తయారైందని సూటిగా విమర్శించింది. మహిళల ఆదాయానికి ఎటువంటి షరతులు లేకపోవడం… పురుషులు మాత్రం తమ సంపదను నిరూపించుకోవాలని డిమాండ్ చేయడం… ఒకరకంగా లింగ వివక్షకు పరాకాష్ట. సంప్రదాయ వివాహ వ్యవస్థలో దొంగచాటుగా జరిగే ఆర్థిక లావాదేవీలను ఈ యాప్ బహిరంగ మార్కెట్‌లో పెట్టినట్టయింది.

సమానత్వం సంగతి ఏంటి?
ఈ యాప్ వివాదం సామాజిక మాధ్యమాల్లో అగ్గి రాజేసింది. కొంతమంది ఆర్థిక, మేధో భద్రతతో పెళ్లి చేసుకోవడం మంచిదేనని సమర్థిస్తున్నా… మెజారిటీ ప్రజల వాదన దీనికి విరుద్ధంగా ఉంది. డబ్బు, విద్య ఒక మనిషికి మంచి మనసు, మానవత్వం ఇవ్వలేవని అనుభవంతో చెబుతున్నారు. మహిళలకు కూడా 60 లక్షల ఆదాయ షరతు పెట్టాలని కొందరు సూటిగా ప్రశ్నించారు. పెళ్లిని కేవలం ఆదాయం ప్రామాణికంగా చేసుకోవడం మూర్ఖత్వమని… ఇది లింగ వివక్షకు పరాకాష్ట అని పలువురు విమర్శించారు. నేటి తరంలో పెళ్లి బంధం కూడా కేవలం డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి‌. మానవ విలువలకు, సంప్రదాయాలకు ఈ యాప్ ఏ విధంగా పరీక్ష పెడుతుందోనని ఆందోళన కలిగిస్తున్నాయి.

వివాహ వ్యవస్థలో విలువల పతనం!
భారతీయ వివాహ వ్యవస్థలో సున్నితమైన అంశాలైన సమానత్వం, మానసిక అనుబంధం వంటి వాటిని పక్కన పెట్టి కేవలం ఆర్థిక స్థితినే ప్రామాణికంగా చేసుకునే ఈ నాట్ తరహా యాప్‌లు… భవిష్యత్తులో మన సాంఘిక వ్యవస్థను ఎటు తీసుకెళ్తాయో చూడాలి. కేవలం డబ్బును ప్రాతిపదికగా చేసుకుని పెళ్లిని నిర్వచించడం మహిళలకు ఒక రకంగా, పురుషులకు మరో రకంగా షరతులు పెట్టడం… భారతీయ సంప్రదాయ విలువలకు ద్రోహం చేస్తున్నట్టే అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ పరిణామం పెళ్లి బంధంలోని ప్రేమ, నమ్మకం వంటి ముఖ్యమైన అంశాలను పక్కన పెట్టి ఆర్థిక బంధాన్ని మాత్రమే పెనవేసే ప్రమాదాన్ని సూచిస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *