డొనేషన్ల అడ్మిషన్… నోటీసుల పరేషాన్ – ఇంజనీరింగ్ కాలేజీల ఇష్టారాజ్యంగా దందా

  • విద్యార్థుల నుంచి 25 లక్షల వరకు డొనేషన్
  • ఫిర్యాదుల వెల్లువ… కాలేజీలకు నోటీసులు
  • మెరిట్ ని పక్కనపెట్టి డబ్బిచ్చిన వారికే సీటు
  • కాలేజీలు స్టార్ట్ అయ్యాక నోటీసులతో టెన్షన్
  • కఠిన చర్యలు తీసుకుంటారా లేదా అన్న ప్రశ్న

సహనం వందే, హైదరాబాద్:
ఎప్పుడో పది ఇరవై సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ సీటు అంటే మెరిట్, ప్రవేశ పరీక్షల ర్యాంకుల మీద ఆధారపడి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అగ్రశ్రేణి కాలేజీలు విద్యను వ్యాపార వస్తువుగా మార్చేశాయి. ఈ అక్రమాలకు పరాకాష్ఠగా ఇటీవల జరిగిన అడ్డగోలు యాజమాన్య కోటా సీట్ల అమ్మకాలు నిలిచాయి. నిబంధనలకు తిలోదకాలిచ్చి విద్యార్థుల మెరిట్‌ను పక్కకు పెట్టాయి. లక్షలకు లక్షలు డొనేషన్ల రూపంలో వసూలు చేశాయి. డిమాండ్ ఉన్న సీట్లను అమ్ముకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అనేక కాలేజీలు రాజకీయ నేతల పలుకుబడిలో ఉన్నాయి. కొన్ని కాలేజీలు అయితే కీలకమైన నేతలే నడిపిస్తుండటంతో వారి ఇష్టారాజ్యానికి అంతూపంతూ లేకుండా పోతుంది.

నిబంధనలకు నిలువునా తూట్లు…
రాష్ట్రంలోని దాదాపు 20 ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేశారు. యాజమాన్య కోటా కింద 30 శాతం సీట్లను కేటాయించుకోవచ్చని ఉన్నప్పటికీ ఆ ప్రక్రియలో కనీస పారదర్శకత కూడా పాటించలేదని ఆరోపణలు రుజువు చేస్తున్నాయి. జూన్ 17న జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మొదట ప్రవాస భారతీయులకు, ఆ తర్వాత జేఈఈ ర్యాంకు ఆధారంగా, చివరగా ఎంసెట్ ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయించాలి. అంతేకాకుండా దీనికి సంబంధించిన నోటిఫికేషన్లను పత్రికల్లో ప్రకటించి ఎంపికైన విద్యార్థుల జాబితాను, వారి ర్యాంకులను బహిర్గతం చేయాలి. కానీ ఏ ఒక్క కాలేజీ కూడా ఈ నిబంధనలను పాటించలేదు.

లక్షల రూపాయల డొనేషన్ల బాగోతం…
ఇప్పుడు ఎక్కడ చూసినా కంప్యూటర్ సైన్స్, కృత్రిమ మేధ, డేటా సైన్స్ వంటి బ్రాంచ్‌లకే భారీ డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌ను అదనుగా తీసుకుని ప్రైవేటు కాలేజీలు ఏకంగా లక్షల్లో డొనేషన్లు వసూలు చేశాయన్నది తల్లిదండ్రుల ఆరోపణ. సీటు కావాలంటే రూ.10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు చెల్లించాల్సిందేనని, అది కూడా ఎలాంటి రసీదులు లేకుండానే ఈ లావాదేవీలు జరిగినట్లు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు ఉంటే చాలు ప్రతిభతో పనిలేకుండా సీటు దక్కుతుందనే విషయం విద్యార్థుల్లో పాతుకుపోతుంది. నిజంగా ప్రతిభావంతులైన విద్యార్థులు అవకాశాలు కోల్పోయి నిస్సహాయంగా ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

నిస్సహాయంగా తల్లిదండ్రులు, విద్యార్థులు…
సీట్లు దక్కని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తుండడం ఈ కాలేజీల అక్రమాలకు మరింత ఊతమిచ్చింది. తమ పిల్లల భవిష్యత్తుకు ఏమైనా నష్టం జరుగుతుందేమోనన్న భయంతో బయటపడి ఫిర్యాదు చేయలేకపోతున్నారు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని కాలేజీలు అడ్డగోలుగా ఈ దందాను కొనసాగించాయి. విద్యార్థి సంఘాలు వారి తరపున నిలబడి ఈ అక్రమాలపై గళమెత్తి ఉన్నత విద్యామండలికి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు సమర్పించాయి. ఇది కేవలం ఒక కళాశాల సమస్య కాదు… యావత్తు ప్రైవేటు విద్యా వ్యవస్థలో పాతుకుపోయిన అక్రమాలకు పరాకాష్ట.

20 కాలేజీలకు నోటీసులు…
ఫిర్యాదులపై తీవ్రంగా స్పందించిన ఉన్నత విద్యామండలి నిబంధనలు ఉల్లంఘించిన 20 కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే కాలేజీలు సమర్పించిన ఎంపిక జాబితాల పరిశీలన మొదలుపెట్టింది. ఈ జాబితాలను విద్యామండలి ఆమోదించకపోతే బి-కేటగిరీ సీట్ల ప్రవేశాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. కానీ ఈ చర్యలు ఎంతవరకు నిజంగా కఠినంగా ఉంటాయోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకాలం నిర్లక్ష్యం వహించి ఇప్పుడు కేవలం నోటీసులతో సరిపెడతారా లేక కఠిన చర్యలు తీసుకుంటారా అని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. విద్యారంగంలో పేరుకుపోయిన ఈ అవినీతి వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించి, ప్రతిభకే పట్టం కట్టేలా ఉన్నత విద్యామండలి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *