‘ఓజీ’పై అంబటి క్రేజీ – హిట్ అవుతుందన్న అంబటి రాంబాబు

  • ఆయన వ్యాఖ్యలపై పార్టీ వర్గాల విస్మయం
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఓజీ కలకలం
  • మరోవైపు వైసీపీ శ్రేణుల వ్యంగ ప్రచారం
  • ‘ఓజీ’ అంటే ‘ఒంటరిగా గెలవనోడ’ని మీమ్స్

సహనం వందే, విజయవాడ:
ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యంగ్య వ్యాఖ్యలు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆ సినిమాకి హిట్ సర్టిఫికెట్ ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రెండు భిన్నమైన వైఖరులు వైసీపీలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయనే సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అంబటి రాంబాబు వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణుల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. ఒకపక్క సోషల్ మీడియాలో ఓజీ సినిమాపై పార్టీ ట్రోల్స్, మీమ్స్‌తో విరుచుకుపడుతుంటే… అంబటి మాత్రం ఆ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు.

అంబటి వ్యాఖ్యలపై దుమారం…
మాజీ మంత్రి అంబటి రాంబాబు తన సద్విమర్శలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రేమ కురిపించారు. పవన్ నటించిన ఓజీ సినిమాపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచాయి. పవన్ ఇంతకుముందు నటించిన బ్రో, హరిహర వీరమల్లు సినిమాలు ఆశించిన విజయం సాధించకపోవడం, దర్శకుడు సుజీత్, నిర్మాత డివివి దానయ్యకు కూడా హిట్ అవసరం ఉండటంతో ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ తన బాధ్యతలను కూడా పక్కనబెట్టి ఈ సినిమాలో నటించారని… కాబట్టి ఈ సినిమా కచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నానని అంబటి పేర్కొన్నారు. ‘పవన్ సినిమాలు విజయవంతం కాకూడదని కోరుకోవాల్సిన అవసరం మాకు లేదు. రాజకీయంగా ఆయన మాకు ప్రత్యర్థి కాబట్టి విమర్శిస్తుంటాం. అవి కూడా సద్విమర్శలే చేస్తాం’ అంటూ అంబటి పేర్కొన్నారు. తమ రాజకీయ ప్రత్యర్థి సినిమాల పట్ల ఇంత ఉదారంగా మాట్లాడడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమై ఉంటుందని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ శ్రేణుల గందరగోళం
అంబటి రాంబాబు ఈ సినిమాకు మద్దతుగా మాట్లాడినప్పటికీ వైసీపీ సోషల్ మీడియా విభాగం మాత్రం పవన్ కళ్యాణ్‌ను విమర్శించడంలో వెనక్కి తగ్గలేదు. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదని… ఒంటరిగా గెలవలేనోడు అని కొత్త ట్యాగ్‌లైన్‌తో మీమ్స్, ట్రోల్స్ సృష్టించి వైరల్ చేస్తున్నారు. జనసేన పార్టీ ఒంటరిగా అధికారంలోకి రాలేక టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ వ్యంగ్యాస్త్రాలను సంధిస్తున్నారు.

ఒకవైపు పార్టీలో ఒక సీనియర్ నేత సినిమా విజయం సాధించాలని కోరుకుంటూ, మరోవైపు అదే పార్టీ శ్రేణులు ఆ సినిమాను, పవన్‌ను విమర్శించడం పార్టీలో ఉన్న భిన్నమైన వైఖరులకు అద్దం పడుతోంది. ఈ అంతర్గత వైరుధ్యం పవన్ అభిమానులకు కొత్త ఆయుధాన్ని ఇచ్చినట్లైంది. ఏదేమైనా ఓజీ సినిమా విడుదల కాకముందే రాజకీయ రచ్చను ప్రారంభించింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా రాజకీయ వర్గాల్లో దీని చర్చ మాత్రం ఇంకా కొనసాగేలా ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *