సహనం వందే, హైదరాబాద్:
మెగా అభిమానుల ఆశలకు అడ్డుపడుతూ ‘ఓజీ’ సినిమా విడుదలకు ముందే బ్లాక్ టిక్కెట్ల మాఫియా ప్రబలుతోంది. సినిమాపై ఉన్న భారీ అంచనాలను, పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహాన్ని అస్త్రంగా వాడుకొని కొందరు తమ జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో కీలకమైన పదవిలో ఉన్న ఒక సినీ నిర్మాత ఈ దందా వెనుక ఉన్నారని, ఈయన ఒక బ్లాక్ టిక్కెట్ల నిర్మాతగా మారి వ్యవస్థను పక్కనపెట్టి కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారని పవన్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. కేవలం బ్లాక్ టిక్కెట్ల అమ్మకంతో కోట్లు ఆర్జించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని, ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోట్లు కొల్లగొట్టే ప్రణాళిక…
ఓజీ సినిమా ప్రీమియర్ షో టిక్కెట్లు భారీ ఎత్తున బ్లాక్‌లో అమ్ముతున్నారు. మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్లు రూ.800కు అమ్మవలసి వస్తుందని ముందుగానే వ్యూహరచన చేసి సింగిల్ స్క్రీన్ థియేటర్ల టిక్కెట్లను బ్లాక్‌లో అమ్మేలా ఈ మాఫియా ప్లాన్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం రూ.800కు మించి టిక్కెట్లు అమ్మకూడదని జీవో జారీ చేసినప్పటికీ దానిని పూర్తిగా తుంగలో తొక్కి, రూ.2000 కంటే ఎక్కువ ధరకు టిక్కెట్లు అమ్ముకుంటున్నారు. ఓ నిర్మాత కూడా సుదర్శన్ 35ఎంఎం, దేవి, విశ్వనాథ్, శ్రీరాములు లాంటి థియేటర్ల టిక్కెట్లను బ్లాక్‌లో దాదాపు రూ.2000 మార్జిన్‌తో అమ్మినట్లు, దాని ద్వారా రూ.కోటికి పైగా ఆర్జించినట్లు సమాచారం. ఇది బ్లాక్ టిక్కెట్ల మాఫియా ఎంత పకడ్బందీగా పనిచేస్తుందో తెలియజేస్తోంది.
అభిమానుల ఆశలపై బ్లాక్ టిక్కెట్ల దెబ్బ…
బ్లాక్ టిక్కెట్ల మాఫియా అరాచకం ఇక్కడితో ఆగలేదు. బయ్యర్లు టిక్కెట్లను బ్లాక్ చేసి ధరలను రూ. 3000-4000 వరకు పెంచి అమ్ముతున్నారు. ఈ ఆఫ్ లైన్ అమ్మకాలను చూసి ఆన్ లైన్ టిక్కెట్లను కూడా అదే ధరకు అమ్ముకుంటున్నారు. మొదట సింగిల్ స్క్రీన్ టిక్కెట్లు బ్లాక్‌లో అమ్మకం పూర్తయ్యాకే మల్టీప్లెక్స్‌ల టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఉంచుతామని చెబుతున్నారు. దీంతో నిజమైన అభిమానులు తమ అభిమాన హీరో సినిమా మొదటి రోజు మొదటి షో చూసే అవకాశం కోల్పోతున్నారు. ఈ పరిస్థితి పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. బ్లాక్ టిక్కెట్ల దందాపై, నిర్మాత వ్యవహారంపై వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఈ అక్రమాలను అడ్డుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.