యాపిల్ ‘ఎయిర్’… క్వాలిటీ ఫెయిల్ – అందమైన ఐఫోన్… కొన్నారో పరేషాన్

  • పూర్తిగా నిరాశపరిచిన బ్యాటరీ పనితీరు
  • ఫోన్ వేడెక్కడం మరో పెద్ద సమస్య
  • దీనివల్ల వీడియోలు, ఎడిటింగ్ లు చేయలేం
  • ఒక్క స్పీకర్‌ వల్ల ఆడియో నాణ్యత అంతంతే
  • ‘న్యూయార్క్ టైమ్స్’ టెక్నికల్ విశ్లేషణ

సహనం వందే, హైదరాబాద్:
యాపిల్ సంస్థ ప్రతీ ఏటా కొత్త ఐఫోన్లను విడుదల చేస్తూ ఉంటుంది. అంతకుముందు వెర్షన్లలో కొన్ని మార్పులు, కెమెరా అప్డేట్స్ వంటి వాటితోనే చాలావరకు సరిపెడుతుంది. కానీ ఈసారి అలా కాకుండా అత్యంత సన్నని డిజైన్‌తో కూడిన ఐఫోన్ ఎయిర్ మోడల్‌ను తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం 5.6 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంది. ఇంత సన్నగా ఉండడం వల్లే ఎయిర్ మోడల్ గురించి చాలామంది ఆసక్తిగా అడుగుతున్నారు. మెరిసే టైటానియం ఫ్రేమ్, ఫ్రాస్టెడ్-మ్యాట్టే గ్లాస్ బ్యాక్‌తో దీని డిజైన్ నిజంగా అద్భుతంగా ఉంది. కానీ కేవలం అందం మాత్రమే సరిపోదు కదా!

దిగజారిన బ్యాటరీ పనితీరు…
ఐఫోన్ ఎయిర్ బ్యాటరీ పనితీరు పూర్తిగా నిరాశపరిచింది. సంస్థ 27 గంటల వీడియో ప్లేబ్యాక్ సమయం ఉంటుందని చెప్పినా సాధారణ వాడకంలో ఒక రోజు కూడా కష్టంగానే గడుస్తుంది. ఒక ప్రయత్నం చేసి చూడగా సోషల్ మీడియా, వీడియోలు, కొన్ని కాల్స్‌తో కేవలం 10 గంటల్లో బ్యాటరీ 6 శాతానికి పడిపోయింది. మరో ప్రయత్నంలో అడాప్టివ్ పవర్ మోడ్ ఆన్ చేసినప్పటికీ 12 గంటల్లో 2 శాతానికి దిగజారింది. నిరంతరం ఫోన్ వాడే వారికి ఇది సరిపోదు. దీనికోసం అదనంగా రూ. 8,200 విలువైన మ్యాగ్‌సేఫ్ బ్యాటరీ ప్యాక్‌ను కొనుక్కోవాలి. ఇది ఈ ఫోన్ సన్నని డిజైన్ ఉద్దేశాన్నే దెబ్బతీస్తుంది. ఫోన్ వేడెక్కడం మరో పెద్ద సమస్య. మామూలుగా వాడినప్పటికీ ఫోన్ వేడెక్కుతుంది. భారీ గేమింగ్ లేదా వీడియో ఎడిటింగ్‌కు ఇది అస్సలు పనికిరాదు. ఒకే ఒక్క స్పీకర్‌ ఉండటం వల్ల ఆడియో నాణ్యత కూడా చాలా పరిమితంగా ఉంటుంది.

ధర ఎక్కువ… ప్రయోజనం తక్కువ!
ఐఫోన్ ఎయిర్ 256 జీబీ మోడల్‌ ధర రూ. 82,000 కాగా, 1 టీబీ మోడల్ ధర రూ. 1,15,000. దీనితో పోలిస్తే కేవలం రూ. 65,600 ధర ఉన్న ఐఫోన్ 17లో రెండు కెమెరాలు, రెండు రోజుల బ్యాటరీ లైఫ్, అదే ప్రోమోషన్ డిస్‌ప్లే ఉన్నాయి. అలాగే రూ. 90,200 ధర ఉన్న ఐఫోన్ 17 ప్రో మరింత అధునాతన కెమెరా, పెద్ద బ్యాటరీ, మెరుగైన థర్మల్ సిస్టమ్‌ను అందిస్తుంది. అంటే కేవలం సన్నని డిజైన్ కోసం అధిక ధర వెచ్చించడం తెలివైన పని కాదు.

ఇది అందరి కోసం కాదు!
ఐఫోన్ ఎయిర్ సాంకేతిక ప్రపంచంలో ఒక అద్భుతమైన ప్రయోగం. ఇది భవిష్యత్తులో రాబోయే ఫోల్డబుల్ ఫోన్లకు ఒక మార్గదర్శి కావచ్చు. కానీ ప్రస్తుతానికి దాని లోపాలను బట్టి చూస్తే ఇది కేవలం డిజైన్‌ను ఇష్టపడే వారి కోసం మాత్రమే. నిజమైన వినియోగదారులు ఐఫోన్ 17 లేదా 17 ప్రో వైపు మొగ్గు చూపడం మంచిది. ఎందుకంటే అవి మరింత ప్రయోజనాలను అందిస్తాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *