ప్రేమతో మీ అనుష్క… – అభిమానులకు ప్రత్యేకంగా లేఖ

  • సోషల్ మీడియాకు దూరమంటూ నిర్ణయం
  • ‘ఎక్కడ మొదలుపెట్టానో అక్కడికే’ అంటూ…
  • ఈ కామెంట్స్ పై ఫీలవుతున్న అభిమానులు

సహనం వందే, హైదరాబాద్:
సినీ తార అనుష్క శెట్టి తన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన తాజా చిత్రం ఘాటి విడుదలైన కొద్ది రోజులకే ఆమె సోషల్ మీడియాకు విరామం ప్రకటించారు. ‘ఎక్కడ మొదలు పెట్టానో మళ్ళీ అక్కడికే’ అంటూ ఆమె పెట్టిన భావోద్వేగమైన పోస్ట్ అభిమానుల మనసులను కదిలించింది. ఈ నిర్ణయం సినిమా వర్గాల్లో విస్తృతంగా చర్చకు దారితీసింది. ఆమె త్వరగా తిరిగి రావాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

ఘాటి తర్వాత ఎందుకిలా?
ఘాటి సినిమా ప్రమోషన్లలో చాలా చురుకుగా పాల్గొన్న అనుష్క… సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరం. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. రెండు దశాబ్దాల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా అనుష్క ప్రమోషన్లలో పాల్గొని తన భవిష్యత్ పాత్రల గురించి కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాకు విరామం ప్రకటించడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భావోద్వేగ లేఖ.‌‌..
అనుష్క తన సోషల్ మీడియా వేదికగా ఒక చేతిరాత లేఖను పోస్ట్ చేశారు. ‘ఈ నీలి కాంతిని దీపకాంతిగా మార్చుకుంటూ కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నాన’ని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఎప్పుడూ స్క్రోలింగ్ చేస్తూ గడిపే జీవితానికి దూరంగా ఉండి, నిజమైన ప్రపంచానికి దగ్గరగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ‘ఎక్కడ మొదలయ్యానో అక్కడికే’ అనే ఆమె మాటలు అభిమానులను ఆలోచింపజేశాయి. ‘త్వరలోనే మరిన్ని కథలతో… మరింత ప్రేమతో మీ ముందుకు వస్తాను. ఎప్పుడూ నవ్వుతూ… ప్రేమతో ఉండండ’ని అభిమానులకు సందేశం ఇచ్చారు. ప్రేమతో మీ అనుష్క శెట్టి అని ఆ లేఖను ముగించారు.

అభిమానుల్లో ఆశలు…
అనుష్క పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అభిమానులు ఆమె ఎందుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమె త్వరగా తిరిగి రావాలని కోరుతూ హ్యాష్‌ట్యాగ్‌లను ప్రారంభించారు. ఆమె వ్యక్తిగత జీవితంలో ఏమైనా మార్పులు చోటు చేసుకున్నాయేమోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే త్వరలో మరిన్ని కథలతో తిరిగి వస్తానని ఆమె ఇచ్చిన హామీ అభిమానుల్లో ఆశలు నింపింది. ప్రస్తుతం అనుష్క చేతిలో ‘కథానార్’ అనే ఒకే ఒక్క మలయాళ చిత్రం ఉంది. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ బ్రేక్ తర్వాత స్వీటీ మరింత శక్తివంతంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *