- ఐదో వంతు ప్రజాప్రతినిధులు వారసులే
- అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడి
- కాంగ్రెస్ లో అత్యధికంగా 31 శాతం వారసులే
- ఆ తర్వాత బీజేపీలో 18 శాతం వారసులు
- దీంతో కార్యకర్తలకు దక్కని పొలిటికల్ ఛాన్సెస్
- ఇది ప్రజాస్వామ్యమా? వంశ పారంపర్యమా?
- సీపీఎం ఆదర్శం… 8 శాతమే వారసత్వం
సహనం వందే, న్యూఢిల్లీ:
భారత ప్రజాస్వామ్యం ఇప్పుడు కొన్ని కుటుంబాల గుప్పెట్లో బందీగా మారిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే ఎన్నికల హక్కుల సంస్థ జరిపిన తాజా అధ్యయనం నిరూపించింది. దేశంలోని మొత్తం 5,204 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో ఐదో వంతు మంది రాజకీయ కుటుంబాల నుంచి వారసులుగా వచ్చిన వారేనని ఆ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. లోక్‌సభలో ఏకంగా 31 శాతం మంది సభ్యులు, రాజ్యసభలో 19 శాతం మంది వారసత్వ రాజకీయాల నుంచి వచ్చారు. ఈ పరిస్థితి మన ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను ప్రమాదమని, సామాన్య పౌరులకు రాజకీయాల్లో అవకాశాలను పూర్తిగా దూరం చేస్తోందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రజా సేవ లక్ష్యంగా ఉన్న రాజకీయాలు ఇప్పుడు కొన్ని కుటుంబాల వ్యాపారాలుగా మారిపోయాయి. ఎన్నికలు కేవలం వంశాల మధ్య పోరాటంగా మారడం ప్రజాస్వామ్యానికి ముప్పు.

లోక్‌సభలో వారసుల ఆధిపత్యం…
దేశవ్యాప్తంగా మొత్తం 5,204 మంది ప్రతినిధులలో 1,063 మంది వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఈ సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. అలాగే రాష్ట్రాలలోనూ ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 34 శాతం మంది, మహారాష్ట్రలో 32 శాతం మంది రాజకీయ వారసత్వంగా ఎన్నికల్లో గెలుపొందారు. ఈ పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని కుటుంబ వ్యవహారంగా మార్చేసి సాధారణ ప్రజల గళాన్ని అణచివేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికలు ఒకప్పుడు ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తే, ఇప్పుడు అవి కేవలం ఒక కుటుంబం నుంచి మరో కుటుంబానికి అధికారాన్ని బదిలీ చేసే ప్రక్రియగా మారిపోయాయి.
జాతీయ పార్టీల జాడ్యం…
దేశంలోని ప్రధాన జాతీయ పార్టీలన్నింటిలోనూ వారసత్వ రాజకీయాలు బాగా పాతుకుపోయాయి. జాతీయ పార్టీలలో 20 శాతం మంది సిట్టింగ్ ప్రతినిధులు రాజకీయ కుటుంబాల నుంచే వచ్చినవారే. ఇందులో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 32 శాతం వారసత్వ రాజకీయాలకు నిలయంగా మారింది.
గాంధీ కుటుంబం నుంచి మొదలైన ఈ ధోరణి, ఇప్పుడు పార్టీలోని చాలామంది నాయకులకు వ్యాపించింది. ఇది కాంగ్రెస్‌ను ఒక రాజకీయ పార్టీగా కాకుండా… ఒక కుటుంబ ఆస్తిగా మలిచింది. దీంతో సాధారణ కార్యకర్తలకు పైకి ఎదిగే అవకాశం దక్కడం లేదు. ఇక బీజేపీలో కూడా 18 శాతం మంది వారసులు ఉన్నారు. సామాన్యుల పార్టీ అని చెప్పుకునే బీజేపీలోనూ ఈ జాడ్యం విస్తరించడం దాని విశ్వసనీయతను దెబ్బతీస్తోంది.

సీపీఎంలో ఆశారేఖలు…
భారత్ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్)లో మాత్రం 8 శాతం మాత్రమే వంశపారంపర్యానికి చెందినవారు ఉండటం విశేషం. ఈ పార్టీలో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు వంశపారంపర్యాన్ని నిరోధిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ విధానం ఇతర పార్టీలకు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది. రాజకీయాల్లో సామాన్యులకు అవకాశం కల్పిస్తేనే ప్రజాస్వామ్యం పరిపూర్ణమవుతుంది. ఎన్నికల సంఘం దీనిపై దృష్టి సారించి కొన్ని నిబంధనలు రూపొందించడం ద్వారా సాధారణ ప్రజలు రాజకీయాల్లోకి రావడానికి మార్గం సుగమం చేయాలి. లేకపోతే మన ప్రజాస్వామ్యం కేవలం కొన్ని కుటుంబాల ఆటగా మారిపోతుంది.
మహిళా ప్రాతినిధ్యంలోనూ వారసత్వమే…
వారసత్వ రాజకీయాలు మహిళా ప్రాతినిధ్యంలోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి వచ్చే మహిళా అభ్యర్థులలో చాలామంది రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారే కావడం విచారకరం. ఇది నిజమైన సామాజిక న్యాయానికి, సమానత్వానికి పెద్ద ఆటంకం. రాజకీయ కుటుంబాలకు చెందిన మహిళలకు మాత్రమే అవకాశాలు దక్కుతున్నప్పుడు, నిజమైన అర్హత కలిగిన సామాన్య మహిళలకు అవకాశం లభించడం లేదు. ఇది రాజకీయాల్లో మహిళల పాత్రను కూడా పరిమితం చేస్తోంది.
ప్రజాస్వామ్యానికి పెను ముప్పు…
ఈ వారసత్వ రాజకీయాలు భారత ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా మారాయి. ఎన్నికలు కేవలం ఓటు వేసే ప్రక్రియగా మిగిలిపోయాయి తప్ప అది ప్రజల ఆశలను ప్రతిబింబించడం లేదు. రాజకీయ కుటుంబాలు అధికారాన్ని తమ చేతుల్లోకి లాక్కుంటున్నాయి. ఏడీఆర్ నివేదిక ప్రకారం… రాజకీయ పార్టీలు సంస్కరణలు చేపట్టకపోతే ప్రజాస్వామ్యం కేవలం పేరుకే పరిమితమవుతుంది. రాజవంశాలు దేశాన్ని రాజ్యమేల్తాయి. ఎన్నికల సంఘం దీనిపై దృష్టి సారించి, కొన్ని కఠినమైన నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉంది. సామాన్య పౌరులు రాజకీయాల్లోకి రావడానికి మార్గం సుగమం చేస్తేనే మన ప్రజాస్వామ్యం పరిపూర్ణమవుతుంది. లేకపోతే, భవిష్యత్తులో దేశ భవితవ్యం కొన్ని కుటుంబాల చేతిలోనే ఉంటుంది.