- ఆయుష్ వైద్యానికి అల్లోపతి లైసెన్సులు
- మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఐఎంఏ ఫైర్
- వైద్య మండలిలో నమోదుకు సర్కారు జీవో
- దీంతో ప్రమాదంలో ప్రజారోగ్య వ్యవస్థ
- ఉత్తర్వు వెనక్కు తీసుకోవాలని డిమాండ్
- లేకుంటే 18న సమ్మె చేస్తామని హెచ్చరిక
సహనం వందే, మహారాష్ట్ర:
మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు వైద్య సమాజంలో తీవ్ర కలకలం రేపుతోంది. హోమియోపతి వైద్యులను వైద్య మండలిలో నమోదు చేయాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయం ప్రజారోగ్యానికి పెను ప్రమాదమని, ఇది వైద్య వ్యవస్థలో అవినీతికి దారితీస్తుందని ఐఎంఏ హెచ్చరిస్తోంది. ప్రభుత్వం హోమియోపతి వైద్యుల లాబీయింగ్‌కు తలొగ్గి ఈ నిర్ణయం తీసుకుందని వైద్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై బొంబే హైకోర్టులో కేసు కూడా విచారణలో ఉంది. కోర్టు తుది తీర్పు వచ్చేవరకు ఈ ఉత్తర్వును అమలు చేయవద్దని ఐఎంఏ కోరుతోంది.
ఈ నిర్ణయంతో ప్రమాదంలో రోగుల జీవితాలు…
అల్లోపతి వైద్య విధానంలో ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే ఐదున్నర సంవత్సరాల కోర్సు, 19 సబ్జెక్టులు, క్లినికల్ అనుభవం, ఇంటర్న్‌షిప్‌తో కూడిన సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. కానీ హోమియోపతి వైద్యులకు కేవలం ఒక సంవత్సరం వ్యవధిగల మోడ్రన్ ఫార్మకాలజీ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేస్తే చాలని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. వారానికి కేవలం రెండు రోజులు మాత్రమే బోధన ఉండే ఈ కోర్సుతో అల్లోపతి మందులు రాయడం వల్ల తప్పుడు ప్రిస్క్రిప్షన్లు, దుష్ప్రభావాలు, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరగడం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వ్యవస్థలో అవినీతికి ఆస్కారం…
హోమియోపతి ప్రాక్టీషనర్ల చట్టంలో 2014లోనే సవరణలు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం… తాజా ఉత్తర్వుతో ఈ విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది. ఇలాగే ఇతర ఆయుర్వేద, సిద్ధ, యునానీ వైద్యులకూ అల్లోపతి మందులు రాసే అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వస్తాయని… ఇది దేశ వైద్య వ్యవస్థలో గందరగోళానికి దారితీస్తుందని ఐఎంఏ అంటోంది. జాతీయ వైద్య కమిషన్ నియమాలను ఈ ఉత్తర్వు ఉల్లంఘిస్తోందని… దీనివల్ల వైద్య విద్య వ్యవస్థ గౌరవం క్షీణిస్తుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని… దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వానికి ఐఎంఏ హెచ్చరిక…
ఈ ఉత్తర్వును వెంటనే ఉపసంహరించుకోకపోతే ఈ నెల 18న రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు దిగుతామని ఐఎంఏ హెచ్చరించింది. 24 గంటల పాటు అన్ని ఆరోగ్య సేవలు నిలిపివేస్తామని, ప్రభుత్వం తమ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని లేఖలో పేర్కొంది. పౌరుల ఆరోగ్యానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ తప్పును సరిదిద్దాలని ఐఎంఏ కోరుతోంది. ఈ హెచ్చరికలతోనైనా ప్రభుత్వం మేల్కొంటుందని వైద్య సమాజం ఆశిస్తోంది. లేకపోతే ఈ వివాదం మరింత పెద్దదయ్యే అవకాశం ఉంది.