తురకపాలెం… మరణ మృదంగం – 60 రోజుల్లో 30 మంది మృతి

  • ఆసుపత్రులకు వెళ్తున్నారు, శవాలై వస్తున్నారు
  • కొందరు క్షేమంగా వచ్చినా తర్వాత మరణమే
  • అన్ని వైద్య పరీక్షల్లో నార్మల్ గానే రిపోర్టులు
  • దుష్టశక్తులొచ్చాయ్… గ్రామస్తుల్లో మూఢత్వం
  • సీఎం చంద్రబాబు ఆదేశాలతో వైద్య బృందాలు
  • అంతుపట్టక తలపట్టుకుంటున్న డాక్టర్లు

సహనం వందే, గుంటూరు:
గుంటూరు సమీపంలోని తురకపాలెం గ్రామంలో గత రెండు నెలలుగా కారణం తెలియని మరణాలు జనాన్ని వణికిస్తున్నాయి. ఆరోగ్యంగా కనిపించే వారు ఒక్కసారిగా సాధారణ జ్వరంతో చతికిలబడుతున్నారు. ఆసుపత్రికి వెళితే శవమై తిరిగొస్తున్నారు. కొందరు క్షేమంగా ఇంటికి వచ్చినా, కొన్ని రోజులకే పరలోకాలకు చేరుతున్నారు. 60 రోజుల్లో 30 మంది మరణించడంతో గ్రామం నిర్మానుష్యంగా మారింది. రోజూ ఎవరో ఒకరు చనిపోతున్న ఈ దుస్థితి ఊరిని భయంతో కమ్మేసింది.

వైద్య పరీక్షల్లో నార్మల్ గానే రిపోర్టులు…
విచిత్రం ఏంటంటే మరణించిన వారి వైద్య పరీక్షల రిపోర్టులన్నీ సాధారణంగానే ఉంటున్నాయి. ఎటువంటి తీవ్ర వ్యాధి లక్షణాలూ కనిపించడం లేదు. జ్వరం, ఒళ్లు నొప్పులతో ఆసుపత్రికి వెళ్లిన వారు కొన్ని గంటల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్యులు ఎన్ని పరీక్షలు చేసినా సమస్యకు మూలం కనుగొనలేక తలలు పట్టుకుంటున్నారు. మెలియాయిడోసిస్ అనే బాక్టీరియా కారణమని మొదట అనుమానించినా తర్వాత అది కాదని తేలింది. ఈ మిస్టరీ మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది.

బొడ్రాయిపై గ్రామస్తుల అనుమానం…
ఈ దారుణాలకు కారణం దుష్టశక్తులని, బొడ్రాయి పక్కకు ఒరిగినందునే అరిష్టం వచ్చిందని గ్రామస్తులు నమ్ముతున్నారు. దక్షిణ దిశలో ఉన్న రాయి కదలడంతో దుష్టశక్తులు ఊరిని పీడిస్తున్నాయని చెబుతున్నారు. శాంతి పూజలు, హోమాలు చేయాలని కొందరు… పొరమేరల్లో దయ్యాలు కాచుకుని ఉన్నాయని మరికొందరు అంటున్నారు. ఈ మూఢనమ్మకాలతో గ్రామం భయాందోళనలో మునిగిపోయింది. రాత్రివేళల్లో ఆరుబయట మనిషి జాడ లేకుండా ఊరు శ్మశానంలా మారిపోయింది.

మంత్రి జోక్యంతో కొత్త కోణం…
ఈ మరణాల మిస్టరీని ఛేదించేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తురకపాలెంలో పర్యటించారు. వైద్యులతో సమీక్షలు చేసి నిపుణులతో సంప్రదింపులు జరిపారు. ఈ మరణాలకు బొడ్రాయో, మెలియాయిడోసిస్ బాక్టీరియా కారణం కాదని తేల్చారు. ఓ కొత్త బాక్టీరియా ఈ విపత్తుకు కారణమని, అధికారుల నిర్లక్ష్యం కూడా వ్యాధి వ్యాప్తికి దోహదపడిందని నిర్ధారించారు. ఈ నిర్లక్ష్యాన్ని విచారించేందుకు ప్రత్యేక కమిటీని నియమించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హామీ…
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా గ్రామంలో పర్యటించి జనంలో ధైర్యం నింపారు. ఈ మరణాలు అరుదైన వ్యాధి కారణంగా జరుగుతున్నాయని అపోహలు పట్టించుకోవద్దని సూచించారు. అధికారులను అప్రమత్తం చేస్తూ త్వరలోనే మరణాలకు ఖచ్చితమైన కారణం కనుగొంటామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వైద్య బృందాలు గ్రామంలో మకాం వేసి చికిత్సలు అందిస్తున్నాయి. ఇళ్లిళ్లూ తిరిగి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం, వైద్యులు కలిసి శ్రమిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *