- ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారుల స్వాధీనం
- దేశ విదేశాలకు డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తింపు
- గతంలో వసుధ ఫార్మా కంపెనీ వల్ల మరణాలు
- అమెరికాలో ఆ కంపెనీ అధికారుల అరెస్ట్
- రాజధానిలో డ్రగ్స్ మాఫియా ఇష్టారాజ్యం
సహనం వందే, హైదరాబాద్:
దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్ ఇప్పుడు డ్రగ్స్ మాఫియాకు కేంద్రంగా మారుతోంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు మేడ్చల్‌లో నిర్వహించిన ఆపరేషన్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దాదాపు రూ. 12 వేల కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంతో నగరంలో అక్రమ డ్రగ్స్ తయారీ ఏ స్థాయిలో జరుగుతుందో వెల్లడైంది. ఎక్స్‌టీసీ, మోలీ, ఎండీఎంఏ వంటి అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్‌తో పాటు, వాటి తయారీకి అవసరమైన 32,000 లీటర్ల ముడి పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. మహారాష్ట్ర పోలీసులకు అందిన సమాచారం ఆధారంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో 13 మందిని అరెస్టు చేయగా, ఇక్కడి నుంచి తయారైన డ్రగ్స్‌ను దేశ విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఉదంతం హైదరాబాద్ పేరు ప్రతిష్ఠలను దెబ్బతీస్తోంది.
వసుధ ఫార్మా కెమ్ కథ…
మేడ్చల్ ఘటనకు ముందే వసుధ ఫార్మా కెమ్ వ్యవహారం అంతర్జాతీయంగా హైదరాబాద్ పరువు తీసింది. అమెరికాతో సహా పలు దేశాలకు ప్రమాదకరమైన ఫెంటానిల్ డ్రగ్ ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలను ఈ సంస్థ సరఫరా చేసింది. దీని కారణంగా అమెరికాలో వందలాది మంది మరణించినట్లు అక్కడి ఫెడరల్ ఏజెన్సీ వెల్లడించింది. దీనిపై స్పందించిన అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఒక రహస్య ఆపరేషన్ నిర్వహించి, వసుధ ఫార్మా నుంచి ఈ డ్రగ్ వస్తున్నట్లు నిర్ధారించింది. దీంతో ఈ ఏడాది మార్చిలో ఆ సంస్థ సీఈవో, మార్కెటింగ్ డైరెక్టర్లను న్యూయార్క్‌లో అరెస్టు చేశారు. దీనిపై మన దేశంలో అంతగా దర్యాప్తు జరగలేదు. దీనికి తోడు సంస్థ డైరెక్టర్ మంతెన వెంకట సూర్య నాగవర ప్రసాదరాజు ఆత్మహత్య చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

రాజధానిలో మాదకద్రవ్యాల మాఫియా…
హైదరాబాద్ ఫార్మా కంపెనీలు ఇలాంటి అక్రమాలకు పాల్పడటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ లాభాల కోసం ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు తీసిన సంఘటనలు ఉన్నాయి. 2017లో ఒక హైదరాబాద్ సంస్థ కొకైన్, హెరాయిన్ తయారీకి అవసరమైన రసాయనాలను మెక్సికోకు ఎగుమతి చేసింది. భారత డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ దాడులు చేసి కొందరిని అరెస్టు చేసింది.
అక్రమ ఓపియాయిడ్ రసాయనాల ఎగుమతి కేసులో అమెరికాకు చెందిన సంబంధిత అధికారులను కూడా అరెస్టు చేశారు. 2020లో మరో హైదరాబాద్ ఫార్మా సంస్థ మెథాంఫెటమైన్ తయారీకి ప్రికర్సర్ రసాయనాలను ఆసియా దేశాలకు సరఫరా చేసింది. ఇలాంటి అక్రమాలు ఉన్నా, ప్రభుత్వ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది.
అక్రమాలకు కేంద్రంగా ఫార్మా హబ్
హైదరాబాద్ ఫార్మా హబ్‌లో 800కు పైగా కంపెనీలు ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్, హెటిరో, అరబిందో వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థలు ఇక్కడ ఉన్నాయి. అయితే కొన్ని అక్రమ కంపెనీల కారణంగా ఈ రంగం మొత్తంపై అనుమానాలు నెలకొంటున్నాయి. హైదరాబాద్ ఫార్మా పరిశ్రమ అంతర్జాతీయంగా ఘనత సాధించినప్పటికీ కొంతమంది వ్యక్తుల స్వార్థం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా నగరం డ్రగ్స్ మాఫియాకు, నిషేధిత పదార్థాల తయారీ కేంద్రంగా మారుతోందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ పరిస్థితిని అరికట్టకపోతే హైదరాబాద్ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది.