సీక్రెట్ రొమాన్స్… కార్పొరేట్ క్రాష్ – రహస్య ప్రేమాయణాలపై ఉక్కుపాదం

  • బాస్ ఉద్యోగుల మధ్య సంబంధాలకు చెక్
  • అదే కారణంతో నెస్లే సీఈవో లారెంట్ పై వేటు
  • కార్పొరేట్ సంస్థల్లో నైతికతకు ప్రాధాన్యం
  • అంతర్జాతీయ సంస్థల్లో నియమావళి కఠినం
  • ఇటువంటి సంబంధాలు పతనానికి దారులు

సహనం వందే, హైదరాబాద్:
కార్పొరేట్ ప్రపంచంలో నైతిక ప్రవర్తనకు ఉన్న ప్రాధాన్యం మరోసారి రుజువైంది. నెస్లే వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలో ఒక సీఈవో వ్యక్తిగత వ్యవహారం కారణంగా తన పదవిని కోల్పోయారు. సంస్థాగత నియమాలకు వ్యతిరేకంగా ఒక సబార్డినేట్‌తో రహస్య సంబంధం పెట్టుకోవడమే ఆయన పతనానికి కారణమైంది. ఈ ఘటన ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా సంస్థ నిబంధనలను పాటించాలన్న కఠిన సందేశాన్ని ఇచ్చింది.

సీక్రెట్ రొమాన్స్ తో ఏడాదిలోనే వేటు…
39 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగించిన లారెంట్ ఫ్రీక్స్… నెస్లే సీఈవో పదవిలోకి వచ్చాక కేవలం ఒక సంవత్సరంలోపే దాన్ని కోల్పోవాల్సి వచ్చింది. తన కింద పనిచేసే ఒక మహిళా ఉద్యోగితో ఆయన రహస్య సంబంధం పెట్టుకోవడం, ఈ విషయాన్ని సంస్థకు చెప్పకుండా దాచిపెట్టడం నెస్లే వ్యాపార నియమావళిని ఉల్లంఘించినట్లుగా దర్యాప్తులో తేలింది. ఫలితంగా ఆయనకు ఎలాంటి సెవరెన్స్ ప్యాకేజీ లేకుండానే పదవి నుంచి తొలగించారు.

నియమాల ఉల్లంఘనకు ఆర్థిక మూల్యం…
ఈ వివాదం నెస్లే సంస్థ ప్రతిష్టను, ఆర్థిక స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఫ్రీక్స్ రాజీనామా వార్త బయటకు రాగానే నెస్లే షేర్లు 17 శాతం వరకు పడిపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లి సంస్థ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. కార్పొరేట్ ప్రపంచంలో ఇలాంటి నైతిక ఉల్లంఘనలు ఎంత పెద్ద మూల్యం చెల్లిస్తాయో ఈ ఘటన స్పష్టం చేసింది. గతంలో ఇలాగే బీపీ సీఈవో బెర్నార్డ్ లూనీ, మెక్‌డొనాల్డ్స్ సీఈవో స్టీవ్ ఈస్టర్‌బ్రూక్ సైతం రహస్య సంబంధాల కారణంగా తమ ఉన్నత పదవులను కోల్పోయారు. ఈ ఉదంతాలు ఒక వ్యక్తిగత తప్పిదం సంస్థకు ఎంత నష్టం చేస్తుందో చూపిస్తున్నాయి.

కార్పొరేట్ నైతికత వెనుక బలమైన కారణాలు…
వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులు ముఖ్యంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవారి ప్రవర్తనపై కఠినమైన నియమాలు ఎందుకు పెట్టుకుంటాయో నెస్లే ఉదంతం మరోసారి రుజువు చేసింది. ఒక సీనియర్ అధికారి తన కింద పనిచేసే ఉద్యోగితో సంబంధం పెట్టుకోవడం పలు సమస్యలకు దారి తీస్తుంది. మొదటిది సంఘర్షణకు ఆస్కారం. ఇలాంటి సంబంధాలు పక్షపాత నిర్ణయాలకు, ఫేవరిటిజంకి దారితీస్తాయి. రెండోది విశ్వాసం కోల్పోవడం. ఒక సీనియర్ అధికారి ఇలాంటి సంబంధాన్ని రహస్యంగా కొనసాగిస్తే మిగిలిన ఉద్యోగుల్లో నమ్మకం దెబ్బతింటుంది. మూడోది సంస్థ ప్రతిష్టకు నష్టం. బయటకు ఈ విషయం తెలిస్తే సంస్థ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే నెస్లే వంటి సంస్థలు తమ నియమావళిలో ఇలాంటి సంబంధాలను నిషిద్ధం చేస్తాయి.

80 శాతం బడా కంపెనీల్లో కఠిన నియమాలు…
కార్పొరేట్ నీతి నియమాల అమలులో నెస్లే కఠినంగా వ్యవహరించింది. ఈ నియమాలు సంస్థను రక్షించే కవచంలా పనిచేస్తాయి. హెచ్‌ఆర్ విభాగం, స్వతంత్ర దర్యాప్తు కమిటీల ద్వారా ఈ నియమాలు పకడ్బందీగా అమలవుతాయి. అమెరికాలోని దాదాపు 80 శాతం (ఫార్చ్యూన్ 500) కంపెనీలు ఇలాంటి కఠిన విధానాలను అమలు చేస్తున్నాయి. కార్పొరేట్ ప్రపంచంలో ఇప్పుడు నైతికత, పారదర్శకతలకు అత్యధిక ప్రాధాన్యత ఉంది!

కార్పొరేట్ నైతికతలో ముఖ్యాంశాలు…

బహిర్గతం తప్పనిసరి: ఒకవేళ ఉద్యోగుల మధ్య సంబంధం ఉంటే దాన్ని సంస్థకు వెల్లడించాలి.

డైరెక్ట్ సంబంధాలు నిషిద్ధం: సూపర్‌వైజర్, సబార్డినేట్ మధ్య ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడానికి వీలులేదు. ఒకవేళ ఉంటే ఒకరిని బదిలీ చేయడం లేదా తొలగించడం చేస్తారు.

స్వతంత్ర దర్యాప్తు: ఆరోపణలు వస్తే స్వతంత్ర కమిటీ దర్యాప్తు చేసి అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *