- ఆవు పాలు తల్లిపాలతో సమానం
- సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ సంచలనం
- చవకగా దొరుకుతుందని ముస్లింలు తింటారు
- తాము గోమాంసం తినబోమని స్పష్ఠీకరణ
సహనం వందే, ముంబై:
బాలీవుడ్ లెజెండరీ రైటర్, సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెను దుమారం రేపుతున్నాయి. తమ కుటుంబం ఎప్పుడూ గోమాంసం తినలేదని, తమ ఇంట్లో గోమాంసం వంటకం ఎప్పుడూ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ్టి వరకు తమ ఇంట్లో గోమాంసం వండలేదని, చాలా మంది ముస్లింలు అది చవకగా దొరుకుతుందని తింటారని ఆయన అన్నారు. ప్రవక్త మహమ్మద్ బోధనల ప్రకారం ఆవు పాలు తల్లిపాలకు సమానమని, అందువల్ల గోవధ నిషిద్ధమని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
మతాంతర వివాహం…
సలీం ఖాన్ తన మతాంతర వివాహం గురించి కూడా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సల్మా ఖాన్ (సుశీలా చరక్)తో తన వివాహం ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిందని ఆయన తెలిపారు. హిందూ సంప్రదాయాలను చిన్నప్పటి నుంచి ఆచరించిన తాను, గణపతి పూజ వంటి హిందూ పండుగలను జరుపుకునేవాడినని చెప్పారు. సల్మా కుటుంబం మొదట్లో అభ్యంతరం చెప్పినప్పటికీ తన విద్య, మంచి నడవడిక చూసి వారు పెళ్ళికి అంగీకరించారని ఆయన వివరించారు. ఈ వివాహం 60 ఏళ్లుగా సాఫీగా సాగుతోందని, మతం ఎప్పుడూ తమ బంధానికి అడ్డు రాలేదని సలీం ఖాన్ స్పష్టం చేశారు.
రెండు సంప్రదాయాలతో ఒకే వివాహం
సలీం ఖాన్, సల్మా ఖాన్ వివాహం రెండు మతాల సంప్రదాయాలను అనుసరించి జరిగింది. సల్మాకు సప్తపది ఆచారం ఇష్టమని తెలుసుకున్న సలీం స్వయంగా ఒక పండితుడిని సంప్రదించి హిందూ ఆచారం ప్రకారం ఏడు అడుగులు నడిచారు. అదే సమయంలో ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం నికాహ్ కూడా జరిగింది. రెండు ఆచారాలు ఒకే వివాహంలో సమన్వయం చేయడం ఆ రోజుల్లో చాలా చర్చనీయాంశమైంది.
బాలీవుడ్ లెజెండ్ సలీం ఖాన్…
సలీం ఖాన్, జావేద్ అఖ్తర్‌తో కలిసి సలీం-జావేద్ జోడీగా బాలీవుడ్‌లో ఒక చెరగని ముద్ర వేశారు. షోలే, జంజీర్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో హిందీ సినిమా స్వరూపాన్నే మార్చిన ఈ రచయితల జంట ఎంతో పేరు సంపాదించింది. సలీం ఖాన్ కుమారుడు సల్మాన్ ఖాన్ సూపర్‌స్టార్‌గా ఎదిగినప్పటికీ… సలీం ఎప్పుడూ తన సొంత గుర్తింపుతోనే నిలిచిపోయారు. కుటుంబం, సంస్కృతి, జీవన విలువలకు సంబంధించిన విషయాలపై ఆయన చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ ఆలోచింపజేస్తుంటాయి.