జీరో యూరియా దందా… వ్యాపారుల మాయ- ఫ్యాక్టరీల నుంచి నేరుగా తెచ్చి వ్యాపారం

  • డీబీటీ మిషన్లలో నమోదు చేయకుండానే…
  • కోరలు చాస్తున్న బ్లాక్ మార్కెట్ దందా
  • కొరత సృష్టిస్తూ అన్నదాతతో చెడుగుడు
  • గంటల తరబడి క్యూలో నిలుస్తున్న రైతులు

సహనం వందే, హైదరాబాద్:
రైతుకు యూరియా కొరత నిద్రపట్టనివ్వడం లేదు. వ్యవసాయ పనులను పక్కనపెట్టి గంటల తరబడి ఎరువుల దుకాణాల ముందు క్యూలో నిల్చోవడం నిత్యకృత్యమైపోయింది. ఈ దుస్థితిని కొందరు డీలర్లు, వ్యాపారులు అవకాశంగా తీసుకుని యూరియా బ్లాక్ దందాకు తెరతీశారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ. 270 విలువ గల 45 కిలోల యూరియా బస్తాను కొన్నిచోట్ల రూ. 500 పైగా అమ్ముతున్నారు. ఒక బస్తా కావాలంటే ఇతర సరుకులను కూడా కొనాలనే షరతులు, క్యాష్ అండ్ క్యారీ వంటి నిబంధనలతో వ్యాపారులు రైతులను మరింత పీడిస్తున్నారు.

యూరియా కోసం ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో ఉదయం 4 గంటల నుండే క్యూలైన్లో రైతులు

జీరో సరుకుతో దొంగ వ్యాపారం…
కొందరు వ్యాపారులు యూరియాను ఫ్యాక్టరీల నుంచి నేరుగా జీరో సరుకు పేరుతో తీసుకొచ్చి దొంగ వ్యాపారం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. లారీలలో వస్తున్న వందలాది బస్తాలను డీబీటీ మిషన్లలో నమోదు చేయకుండానే ట్రాక్టర్లు, ఆటోలు, జీపులలోకి ఎక్కించి విక్రయిస్తున్నారు. యూరియాకు ఉన్న డిమాండ్, రైతుల అవసరాన్ని తమ అక్రమాలకు అవకాశంగా తీసుకుని దుకాణదారులు పగటి దొంగలుగా మారారు. నిబంధనల ప్రకారం ఎరువుల దుకాణంలో సరుకు దిగిన తర్వాత డీబీటీ మిషన్‌లో వివరాలు నమోదు చేసి, ఆపై రైతు ఆధార్ కార్డు, పాస్‌బుక్ జిరాక్స్‌తో పాటు వేలిముద్ర తీసుకున్న తర్వాత మాత్రమే విక్రయించాలి. కానీ ప్రస్తుతం ఈ నిబంధనలన్నీ గాలికొదిలేసి, రైతులను అధిక ధరలకు కొనుగోలు చేసేలా ఒత్తిడి తెస్తున్నారు. కొందరు వ్యవసాయ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం ఈ అక్రమాలకు పరోక్షంగా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పరపతి ఉన్న వారికే ప్రాధాన్యం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) కూడా రైతులకు సమర్థంగా యూరియాను అందించడంలో విఫలమవుతున్నాయి. ఈ సంఘాల్లో కూడా పరపతి ఉన్న రైతులకే యూరియా లభిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పేద, సన్నకారు రైతులు, పోడు రైతులు ఈ సహకార సంఘాల నుంచి ఏమాత్రం లబ్ధి పొందలేకపోతున్నారు. వారికి ప్రైవేటు డీలర్ల దుకాణాలే దిక్కుగా మారాయి. పీఏసీఎస్‌లలో ఒక రైతుకు కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇస్తుండడంతో అది వారి అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. దీంతో వారు తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ధరలైనా సరే ప్రైవేటు దుకాణాలలో యూరియా కొనుగోలు చేస్తున్నారు.

అరకొర సరఫరా… అంతులేని ఇబ్బందులు
ఈ సమస్యకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా సరఫరాలో తీవ్ర జాప్యం జరగడమే. ఈ వానాకాలానికి రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఆగస్టు 31 నాటికి 8.30 లక్షల మెట్రిక్ టన్నులు అందాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం 5.66 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయింది. ఇంకా 2.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందకపోవడంతో ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది. వరి నాట్లు ఊపందుకున్న నేపథ్యంలో రైతులు యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం సరైన సమయంలో యూరియాను అందుబాటులోకి తీసుకురాకపోతే రైతులకు ఈ కష్టాలు మరింత ఎక్కువవుతాయి. అధికారులు ఈ దందాపై చర్యలు తీసుకోకపోతే అక్రమార్కుల అంతులేని దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *