- రూ. 4,300 కోట్ల రహస్య విరాళాలు
- ఇంత భారీ దానాలు చేసింది ఎవరు?
- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిలదీత
- బీజేపీని గడగడలాడిస్తున్న రాహుల్
- ఎన్నికల సంఘానికి నిప్పుపెట్టిన అగ్రనేత
సహనం వందే, న్యూఢిల్లీ:
గుజరాత్‌లో జరిగిన భారీ అక్రమ ఆర్థిక లావాదేవీలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. 2019-24 మధ్య కాలంలో గుజరాత్‌లోని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు… సంస్థలు ఏకంగా రూ. 4,300 కోట్ల భారీ విరాళాలు స్వీకరించాయని ఒక మీడియా నివేదికను ఉటంకిస్తూ ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం ఎవరిది? ఏ ఉద్దేశంతో ఇచ్చారు? ఎవరికి చేరాయి? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ విచారణ చేస్తుందా లేక ఒక అఫిడవిట్‌తో సరిపెడుతుందా అని నిలదీశారు. రాబోయే ఎన్నికల ముందు ఈ ఆరోపణలు దేశ రాజకీయాలను మరింత వేడెక్కించాయి.
నిధుల వెనుక అసలు కథ…
4,300 కోట్ల రూపాయలు అనే భారీ మొత్తం సామాన్యమైనది కాదు. ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి… ఎవరు ఇచ్చారు… ఎందుకు ఇచ్చారు అనే వివరాలు బయటపెట్టకపోవడం, దీనిపై ఎలాంటి విచారణ జరగకపోవడం చాలా అనుమానాస్పదంగా ఉంది.

గుజరాత్‌లో ఏ సంస్థలు ఈ నిధులు అందుకున్నాయనే విషయంపై స్పష్టత లేదు. ఈ భారీ దానాల వెనుక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హస్తం ఉందని, రాజకీయ కుట్రలు, అవినీతి దాగి ఉన్నాయని రాహుల్ గాంధీ పరోక్షంగా ఆరోపించారు. ఎన్నికల నిధుల సేకరణలో పారదర్శకత లోపం ఉందని, ఈ విషయాన్ని దర్యాప్తు చేసి నిజాలను బయటపెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఈసీ మౌనంపై తీవ్ర అనుమానాలు…
ఈ సంచలన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ (ఈసీ) ఇప్పటికీ మౌనం వహించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గుజరాత్‌లో అధికార పార్టీకి లేదా ఆ పార్టీకి సంబంధించిన సంస్థలకు భారీగా నిధులు అందుతున్నాయని, వాటి మూలాలను బహిర్గతం చేయకుండా రహస్యంగా లావాదేవీలు జరుగుతున్నాయని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా లేక పాలకులకు వత్తాసు పలుకుతుందా అన్న ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో రహస్య విరాళాలు ఒక రాష్ట్రంలో కేవలం ఐదు సంవత్సరాల కాలంలో అందాయంటే దీని వెనుక పెద్ద కుంభకోణమే దాగి ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. ఈ దానాల వెనుక ఉన్న రాజకీయ లబ్ధి ఏమిటో ఈసీ తేల్చాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
రాజకీయ వేదికపై రగడ
రాహుల్ గాంధీ ఆరోపణలతో దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం మరింత రసకందాయంలో పడింది. గుజరాత్‌లో జరిగిన ఈ లావాదేవీలు రాజకీయ నిధుల సేకరణపై ఉన్న లోపాలను ఎత్తిచూపుతున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే ఇలాంటి భారీ ఆర్థిక లావాదేవీలు జరగడం, దానికి అధికార పార్టీ స్పందించకపోవడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఈ వివాదం ఒక కీలక అంశంగా మారే అవకాశం ఉంది. ఈసీ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ రహస్య దానాలపై విచారణ జరగకపోతే, ఎన్నికల కమిషన్ ప్రతిష్ఠ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.
ప్రజల మదిలో ప్రశ్నలు…
ఈ భారీ దానాల వెనుక అసలు కథ ఏమిటి? ఈ నిధులు రాజకీయ పార్టీలకు సమకూర్చేందుకు జరిగాయా? లేక ఇందులో ఇతర ఆర్థిక కుంభకోణాలు దాగి ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలు ప్రజల మదిలో మెదులుతున్నాయి. ఈసీ ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించి… ప్రజలకు నిజాలు తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ లేవనెత్తిన ఈ ఆరోపణలు రాజకీయపరంగానే కాకుండా దేశ ఆర్థిక పారదర్శకతపై తీవ్ర చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.