వైద్య అనుబంధ వృత్తుల కౌన్సిల్ ఏర్పాటుకు డిమాండ్

  • కేంద్రం సూచనలు, సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా ఆలస్యం

సహనం వందే, హైదరాబాద్:
వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మినహా వైద్య రంగానికి చెందిన 57 రకాల అనుబంధ వృత్తులను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2021 మార్చిలో వైద్య అనుబంధ వృత్తుల జాతీయ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర కౌన్సిల్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. చివరికి సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర కౌన్సిల్స్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. దేశంలో 11 రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలు కౌన్సిల్స్‌ను ఏర్పాటు చేశాయి.

తెలంగాణలో నామమాత్రపు ఏర్పాటు…
తెలంగాణ ప్రభుత్వం 2022లో రాష్ట్ర కౌన్సిల్‌ను ఏర్పాటు చేసినప్పటికీ అది నామమాత్రంగానే ఉంది. కౌన్సిల్‌కు చైర్మన్, ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులను నియమించినా ఇతర ప్రొఫెషనల్ సభ్యులను, కార్యాలయాన్ని కేటాయించలేదు. నిమ్స్‌కు చెందిన డాక్టర్ విజయ్ కుమార్‌ను చైర్మన్‌గా నియమించారు. అయితే ఇతర సభ్యుల నియామకం జరగకుండానే ఆయన పదవీకాలం ముగిసింది.

కొత్త ప్రభుత్వంపై ఆశలు‌…
కొత్త ప్రభుత్వం వచ్చాక కౌన్సిల్ ఏర్పాటు అవుతుందని ఆశించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై వైద్య అనుబంధ వృత్తుల జాయింట్ ఫోరం ప్రధాన కార్యదర్శి మంచాల రవీందర్, సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్ సంయుక్తంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ దామోదర రాజ నరసింహ, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, అదనపు కార్యదర్శి అయేషాకు వినతిపత్రాలు సమర్పించారు. కౌన్సిల్ ప్రాముఖ్యతను వారు ప్రభుత్వానికి వివరించారు.

సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన నిమ్స్ వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాల ప్రిన్సిపాల్, జాతీయ కమిషన్ సభ్యుడు శిరందాస్ శ్రీనివాస్, పూర్వ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ విజయ్ కుమార్, సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్ తెలంగాణ అధ్యక్షులు దామోదరనాయుడు, వైద్య అనుబంధ వృత్తుల జాయింట్ ఫోరం ప్రధాన కార్యదర్శి మంచాల రవీందర్, కోశాధికారి ఎం.ఎ. వారిస్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్ అనితా రెగోలు పాల్గొన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *