- అధికారిక లాంఛనాలతో అంతిమ వీడ్కోలు
సహనం వందే, హైదరాబాద్:
సిపిఐ అగ్రనేత, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డికి రెడ్ ఆర్మీ ఘనంగా అంతిమ వీడ్కోలు పలికింది. ఆయన భౌతికకాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో గౌరవించింది. అంతిమయాత్రలో వేలాది మంది ప్రజలు, నాయకులు పాల్గొని నివాళులర్పించారు. సుధాకర్ రెడ్డి చివరి కోరిక మేరకు ఆయన భౌతికకాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు.

అంతిమయాత్రలో ముందు పోలీసులు అధికారిక గౌరవ వందనం సమర్పించగా, ఆ తర్వాత రెడ్ ఆర్మీ కవాతు ముందుకు సాగింది. ప్రజానాట్య మండలి కళాకారులు విప్లవ గీతాలను ఆలపిస్తుండగా, సురవరం అమర్ రహే అనే నినాదాలు ఆకాశాన్ని తాకాయి. చిక్కడపల్లి, నారాయణగూడ, ముషీరాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల మీదుగా సాగిన ఈ యాత్రలో అశ్రునయనాలతో ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వైద్య విద్యార్థులకు జ్ఞాన సౌరభం
ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన సుధాకర్ రెడ్డి చివరికి తన భౌతికకాయాన్ని కూడా మానవాళికి ఉపయోగపడేలా గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు. వైద్య విద్యార్థుల పరిశోధనలకు, మానవ శరీర నిర్మాణంపై అవగాహన పెంచుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఇందిర, ఇతర ప్రొఫెసర్లు తెలిపారు. సుధాకర్ రెడ్డి కోరిక మేరకు ఆయన భార్య డాక్టర్ బి.వి.విజయలక్ష్మి, కుమారులు కపిల్, నిఖిల్ ఈ భౌతికకాయాన్ని కళాశాలకు అప్పగించారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం ఏ బేబీ, సీపీఐ జాతీయ కార్యదర్శులు కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు పలువురు సురవరానికి నివాళులర్పించారు.