మా దేశం… మా కోసం – టూరిస్ట్ గోబ్యాక్ – యూరోపియన్ల నినాదం

  • పర్యాటకులపై దాడులు… ఉద్రిక్త పరిస్థితులు
  • విదేశస్థులను వ్యతిరేకిస్తున్న అక్కడి ప్రజలు
  • స్థానికుల ఆగ్రహంతో ఆయా దేశాల్లో అలజడి!
  • టూరిస్టుల ఒత్తిడిలో రోమ్, ఫ్లోరెన్స్, నేపుల్స్
  • పర్యాటకులకు అనుకూలంగా వ్యాపారాలు
  • దీంతో బతకలేని పరిస్థితి… పెరిగిన వలసలు

సహనం వందే, యూరప్:
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో స్థానిక ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ‘మా దేశం మా కోసమే’నని అక్కడి ప్రజలు నినదిస్తున్నారు. టూరిస్టుల పేరుతో తమ అందమైన నగరాలను నాశనం చేస్తున్నారని… తమ జీవనశైలిని, సంస్కృతిని, ఉనికిని ధ్వంసం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఆదాయ వనరుగా భావించిన పర్యాటకం ఇప్పుడు యూరప్‌లోని అనేక నగరాలకు సమస్యగా మారింది. పర్యాటకుల తాకిడి పెరిగి స్థానిక సంస్కృతి, జీవనశైలి దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ బార్సిలోనా నుంచి వెనిస్ వరకు స్థానికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. లౌవ్రే మ్యూజియం సిబ్బంది సమ్మెకు దిగడం… పర్యాటకులపై దాడి చేయడం వంటి సంఘటనలు ఈ అలజడికి నిదర్శనంగా నిలిచాయి.

బార్సిలోనాలో ప్రశాంతత కరువు…
కోవిడ్ సమయంలో ప్రశాంతంగా ఉన్న బార్సిలోనా వీధులు ఇప్పుడు పర్యాటకుల గందరగోళంతో నిండిపోయాయి. గత పది పదిహేనేళ్లలో పర్యాటకం ఏడాది పొడవునా కొనసాగుతుండటంతో ఈ నగరం తన అసలు గుర్తింపును కోల్పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు అన్నీ పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా మారిపోయాయి. ఇళ్ల అద్దెలు పెరిగి స్థానికులు తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. దీనికి తోడు కరోనా మహమ్మారి తర్వాత వచ్చిన విదేశీ ఉద్యోగులు స్థానిక సంస్కృతిని పట్టించుకోకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది.

వెనిస్‌లో అన్యగ్రహవాసులుగా స్థానికులు…
వెనిస్‌లో పర్యాటకుల సమస్య మరింత దారుణంగా ఉంది. పర్యాటకుల మధ్య తన సొంత నగరంలోనే తాను అన్యగ్రహవాసిలా ఉన్నానని ఒక స్థానిక గాయకుడు ఒర్నెల్లో బాధపడ్డారు. వెనిస్‌లో ఒకప్పుడు అధికంగా ఉన్న జనాభా ఇప్పుడు కేవలం 48,000 మందికి పడిపోయింది. ఇందులో ఎక్కువమంది వృద్ధులే. ఇదే పరిస్థితి కొనసాగితే మరో పదిహేనేళ్లలో వెనిస్‌లో స్థానికులు లేకుండా పోయే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య వల్ల స్థానికులు తమ సంస్కృతిని, గుర్తింపును కోల్పోతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు.

టూరిజం ఎవరికోసం?
పర్యాటకం ఎవరి కోసం అనే ప్రశ్న యూరప్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. స్థానికులు సంతోషంగా లేని ఏ నగరమైనా విఫలమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్యాటకుల ఒత్తిడితో రోమ్, ఫ్లోరెన్స్, నేపుల్స్ వంటి నగరాలు ఊపిరాడకుండా ఉన్నాయి. స్థానికులు లేకపోతే ఈ నగరాలు కేవలం బహిరంగ మ్యూజియంలుగా మారతాయని విసిట్ ఇటలీ సంస్థ సీఈఓ రూబెన్ సాంటోపియెట్రో అన్నారు. పామా నగరం ఈ సమస్యను గుర్తించి, స్థానికులను కేంద్రంగా చేసుకుని ఐదేళ్ల ప్రణాళికను రూపొందించింది. ఉచిత సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు వంటివి స్థానికులకు వారి నగరంపై గౌరవం, ఆప్యాయత పెంచుతాయని భావిస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *