- అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
- వెలుగులోకి దేశవ్యాప్త గ్యాంగ్ లింకులు
- మొబైల్ యాప్‌లు… ఫేక్ వెబ్‌సైట్లతో మోసం
- డిజిటల్ బ్యాంకింగ్‌లో భద్రతా లోపాలే కారణం
సహనం వందే, విజయవాడ:
విజయవాడకు చెందిన యువకుడు శ్రవణ్ కుమార్ రెండు నెలల్లోనే 500 కోట్ల రూపాయల సైబర్ క్రైంకు పాల్పడడం సంచలనం అయ్యింది. అతన్ని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. శ్రవణ్ కుమార్ 500 మ్యూల్ అకౌంట్లు సృష్టించి వాటి ద్వారా 500 కోట్ల పైచిలుకు నగదు బదిలీలు చేసిన విషయం తెలిసింది. సైబర్ లింకుల ద్వారా వచ్చిన మోసపూరిత డబ్బును ఈ అకౌంట్లలోకి మార్చి, తర్వాత ఫేక్ కంపెనీలకు పంపేవాడు. ఈ వ్యవస్థలో ఆరు కంపెనీలకు ప్రత్యేక మ్యూల్ అకౌంట్లు ఏర్పాటు చేసి అక్రమ డబ్బును వేర్వేరు ఖాతాల ద్వారా తిప్పుతూ చివరికి ఆ కంపెనీలలోకి చేర్చేవాడు. ఈ ప్రక్రియలో అతను ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేసి పోలీసుల దృష్టిని పక్కదారి పట్టించాడు. ఇలాంటి మోసాలు పెరగడానికి కారణం డిజిటల్ బ్యాంకింగ్‌లో భద్రతా లోపాలు, ప్రజలకు అవగాహన లేకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు.
వెలుగులోకి దేశవ్యాప్త గ్యాంగ్ లింకులు…
శ్రవణ్ కుమార్ మోసాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాదు. అతను దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ క్రైమ్ గ్యాంగులతో సంబంధాలు పెట్టుకుని నకిలీ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు జరిపి డబ్బును కొట్టేసేవాడు. ఈ గ్యాంగులు మొబైల్ యాప్‌లు, ఫేక్ వెబ్‌సైట్లు ఉపయోగించి ప్రజలను మోసం చేసి లాభాలను పంచుకునేవారు. పోలీసులు ఈ అరెస్ట్‌తో ఈ నెట్‌వర్క్‌ను బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలాంటి గ్యాంగులు దేశంలో వేలాది సంఖ్యలో ఉన్నాయని, వాటిని పూర్తిగా ఆపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి మోసాల నుంచి తమను రక్షించుకోవడానికి బ్యాంకింగ్ లావాదేవీల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్‌లను పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.