- పుష్పకు జైలు… మన్మధుడికి కాళరాత్రి
- వార్-2 మోజులో సీఎంను మరిచిన ఎన్టీఆర్
- జ్ఞానోదయమై క్షమాపణ వీడియో రిలీజ్
- శిరస్సు వంచి పాదాభివందనాలంటూ వ్యాఖ్య
సహనం వందే, హైదరాబాద్:
ఎక్కడా లేని విధంగా మన దగ్గర సినిమా హీరోల ఫోజులు మామూలుగా ఉండవు. తాము కేవలం నటులు మాత్రమే అన్న భావన నుంచి… దైవాంశ సంభూతులమన్న భ్రమల్లో బతుకుతుంటారు. జనం ఆదరణ చూసి తల పొగరు పెంచుకుంటారు. పైపెచ్చు జనం కొన్న టికెట్ల డబ్బుతోనే వందల కోట్లు కూడబెట్టుకొని తమకు ఎదురేలేదన్న భావనతో ఉంటారు. అలాంటి తల పొగరు సినీ నటులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిగ్గానే తలంటారు. దీంతో రేవంత్ రెడ్డి అంటే తెలుగు సినీ నటులు గజగజ వణికి పోతున్నారు. అల్లు అర్జున్… నాగార్జునలకు ఎలాంటి గతి పట్టిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ శిరస్సు వంచి దండాలు పెట్టాల్సిన దుస్థితికి చేరుకున్నాడు.
వార్-2 ఫ్రీ రిలీజ్ వేడుకలో సీఎంపై నిర్లక్ష్యం…
బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం వార్ 2. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్ర బృందం, హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఆదివారం ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హృతిక్ రోషన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి ప్రముఖులతో పాటు ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ వేడుక ముగిసిన తర్వాత ఎన్టీఆర్ చేసిన ఒక పని ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రస్తావన తీసుకురాకపోవడంపై విమర్శలు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ ఒక వీడియో ద్వారా రేవంత్ రెడ్డికి క్షమాపణలు తెలిపారు.
వేడుక ముగిశాక జ్ఞానోదయం…
ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. అందులో ఆయన, ‘అందరికీ నమస్కారం. ఈ ఈవెంట్‌లో ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మరిచిపోయాను. నన్ను క్షమించాలి. నా అభిమానులతో పాతికేళ్ల జర్నీని పంచుకునే ఆనందంలో ఒక చిన్న తప్పిదం జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు, యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ సహాయ సహకారాలు మాకు అందించినందుకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాన’ని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
సీఎం అంటే టాలీవుడ్‌లో భయం…
కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. గతంలో పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో అల్లు అర్జున్ తెలంగాణ సీఎం పేరును మర్చిపోయారు. ఆ తర్వాత పుష్ప 2 విడుదల రోజున జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం, అల్లు అర్జున్‌పై కేసు నమోదు కావడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంలో ఆయన ఒక రోజు జైలులో కూడా ఉండాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి పేరు గుర్తుకు రాకపోవడం నుంచి నిద్దట్లో కూడా రేవంత్ పేరు తలుచుకునే పరిస్థితి అల్లు అర్జున్ కు ఎదురైంది. ఇక అంతకుముందు సినీ నటుడు నాగార్జున కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేయడం టాలీవుడ్ ప్రముఖులకు గట్టి సందేశాన్ని ఇచ్చాయి. ఇలా తెలుగు ఇండస్ట్రీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గ్రిప్ పెంచుకున్నారు. తోక జాడిస్తే వేటు వేసే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో టాలీవుడ్ నటులు రేవంత్ రెడ్డి అంటే వణికి పోతున్నారు.
చంద్రబాబుతో జూ.ఎన్టీఆర్ కు విభేదాలు…
జూనియర్ ఎన్టీఆర్ కు తన మామ చంద్రబాబు నాయుడికి మధ్య సత్సంబంధాలు లేవన్న సంగతి తెలిసిందే. మరోవైపు చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి మధ్య గురు శిష్యుల సంబంధం చాలా పటిష్టంగా ఉంది. ఇలాంటి సున్నితమైన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. అందుకే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఆయన వెంటనే వీడియో ద్వారా క్షమాపణలు చెప్పారు.