- పక్షవాతం, అంధత్వం కూడా నిర్మూలన
- వైద్య రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణలు
- చికిత్సా పద్ధతులు చివరి దశలో ఉన్నాయి
సహనం వందే, హైదరాబాద్:
వైద్యశాస్త్రం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు అసాధ్యమనుకున్న అనేక వ్యాధులకు ఇప్పుడు చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. సరికొత్త సాంకేతికత, అధునాతన చికిత్సా విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో 2030 నాటికి కొన్ని ప్రాణాంతక వ్యాధులు క్యాన్సర్, అంధత్వం, పక్షవాతం పూర్తిగా నిర్మూలించవచ్చని ఒక వైద్య విద్యార్థి చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వాదనపై తీవ్ర చర్చ జరుగుతోంది.
క్రిస్ క్రిసాంథౌ అద్భుతమైన వాదన…
బుడాపెస్ట్‌కు చెందిన క్రిస్ క్రిసాంథౌ అనే వైద్య విద్యార్థి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, 2030 నాటికి ప్రపంచం నుంచి మూడు ప్రమాదకరమైన వ్యాధులు మాయమవుతాయని పేర్కొన్నారు. అవి క్యాన్సర్, అంధత్వం, పక్షవాతం. ఈ వ్యాధులకు శాస్త్రవేత్తలు ఇప్పటికే అధునాతన టీకాలు, చికిత్సలు, అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగిస్తున్నారని క్రిస్ తెలిపారు.
క్యాన్సర్‌కు సరికొత్త చికిత్సలు…
క్యాన్సర్‌కు కీమోథెరపీని మర్చిపోండి అని క్రిస్ పేర్కొన్నారు. పరిశోధకులు ఇప్పుడు ఎంఆర్‌ఎన్‌ఏ క్యాన్సర్ వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేస్తున్నారని, ఇవి మన రోగనిరోధక వ్యవస్థను సైన్యంలా మార్చి కణితులపై దాడి చేసేలా చేస్తాయని తెలిపారు. వ్యాక్సిన్‌లు, జన్యు మార్పిడి వంటి చికిత్సా పద్ధతులు చివరి దశ పరీక్షల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నూతన విధానాలతో క్యాన్సర్ ఇకపై ప్రాణాంతకం కాదని, చికిత్స చేసి నియంత్రించవచ్చని నిపుణులు విశ్వసిస్తున్నారని క్రిస్ తెలిపారు.
అంధత్వానికి జన్యు చికిత్సలు
అంధత్వాన్ని కూడా 2030 నాటికి నయం చేయవచ్చని క్రిస్ చెప్పారు. జన్యు మార్పిడి, మూల కణాల చికిత్సల ద్వారా రెటీనా వ్యాధులతో బాధపడుతున్న రోగులు తిరిగి చూపును పొందుతున్నారని ఆయన వివరించారు. ఇప్పటికే ఈ విధానాలు ఇద్దరు అంధ రోగులకు చూపును అందించాయని, ప్రైమ్ ఎడిటింగ్ అనే కొత్త సాంకేతికత వారసత్వ అంధత్వానికి కారణమయ్యే జన్యు లోపాలను సరిచేయగలదని క్రిస్ పేర్కొన్నారు.
పక్షవాతానికి మెదడు ఇంప్లాంట్లు…
పక్షవాతం నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని క్రిస్ ఆశాభావం వ్యక్తం చేశారు. చైనాలో ఇద్దరు పూర్తి పక్షవాతం రోగులు మెదడు ఇంప్లాంట్లు, వెన్నుపాము ఉద్దీపనల ద్వారా మళ్లీ నడవగలిగారని తెలిపారు. మెదడు నేరుగా కాళ్లకు సంకేతాలు పంపడం ద్వారా వెన్నెముక గాయాన్ని అధిగమించిందని క్రిస్ వివరించారు. ఈ ప్రయోగాలు భవిష్యత్తులో పక్షవాతం రోగులకు ఆశలు కల్పిస్తున్నాయి.
ఇంటర్నెట్‌లో మిశ్రమ స్పందనలు
క్రిస్ పోస్ట్‌పై ఇంటర్నెట్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సైన్స్ అద్భుతమని ప్రశంసిస్తే, మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఔషధ పరిశ్రమ లాభాలు ఆర్జిస్తున్నంత కాలం క్యాన్సర్‌కు పూర్తి నివారణ సాధ్యం కాదని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. మరొకరు ఈ చికిత్సలు అందరికీ అందుబాటులోకి వస్తాయా, ధర తక్కువగా ఉంటుందా? అని ప్రశ్నించారు. మరికొందరు హెచ్ఐవి, డయాబెటిస్ వంటి వ్యాధుల గురించి కూడా ప్రస్తావించారు.
భారతదేశంలో క్యాన్సర్ పరిస్థితి
లాన్సెట్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, భారతదేశంలో క్యాన్సర్ ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల్లో భారత్ మూడో స్థానంలో, మరణాల్లో రెండో స్థానంలో ఉంది. వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుందని ఈ అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతం మన దేశంలో ప్రతి ఐదుగురిలో ముగ్గురి మరణాలకు క్యాన్సర్, అంధత్వం, పక్షవాతం వంటి వ్యాధులే కారణమవుతున్నాయని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రిస్ క్రిసాంథౌ వ్యాఖ్యలు నిజమైతే, అది భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలకు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది.