- ఆందోళన చేస్తున్న సినిమా కార్మికులు
- నిర్మాతల ముందు డిమాండ్లు!
- టాలీవుడ్ లో ముదురుతున్న వ్యవహారం
సహనం వందే, హైదరాబాద్:
వేతనాలు పెంపు విషయంలో తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం మరింత తీవ్రమైంది. రోజుల తరబడి నిరసనలు చేస్తున్న సినీ కార్మికులు, తాజాగా హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు తమ నిరసనను ఉధృతం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి సానుకూల స్పందన రాకపోతే సోమవారం నుంచి అన్ని షూటింగులు బంద్ చేయాలని ఫిల్మ్ ఫెడరేషన్ హెచ్చరించింది.

నిర్మాతల నిర్ణయంపై ఆగ్రహం
సినీ కార్మికులు తమ వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తుండగా, నిర్మాతలు మూడు కేటగిరీలుగా విభజించి వేతనాలు పెంచాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కొందరికి మాత్రమే వేతనాలు పెంచడం అన్యాయమని, 13 యూనియన్లకు చెందిన రోజువారీ వేతనం తీసుకునే కార్మికులకు ఒకే విధంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశాయి. ఈ విభజన తమ ఐక్యతను దెబ్బతీసేలా ఉందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నోటీసులపై కార్మికుల మండిపాటు…
తాజా వివాదంలోకి ప్రముఖ నిర్మాత విశ్వప్రసాద్ రావడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. విశ్వప్రసాద్ తమకు నోటీసులు పంపడంపై కార్మికులు రగిలిపోతున్నారు. నోటీసులకు భయపడటానికి తాము ఆయన ఇంట్లో పనిచేసేవారు కాదని, తమ శక్తిని అడ్డుకోవాలని చూస్తే ఎంత దూరమైనా వెళ్తామని ప్రొడక్షన్ యూనియన్ అధ్యక్షుడు బాసాటి కృష్ణ హెచ్చరించారు. విశ్వప్రసాద్ వెంటనే నోటీసులు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆయన సినిమాలకు షూటింగ్‌కు హాజరుకామని స్పష్టం చేశారు. అలాగే పీపుల్స్ మీడియా సంస్థ తమకు రూ.90 లక్షల బకాయిలు ఉందని కూడా ఆరోపించారు.
సమస్య పరిష్కారానికి పెద్దల జోక్యం…
ఈ వివాదంపై మెగాస్టార్ చిరంజీవి తమతో సంప్రదింపుల్లో ఉన్నారని ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు తెలిపారు. సమస్య శాంతియుతంగా పరిష్కారం కావాలని చిరంజీవి కోరుకుంటున్నారని చెప్పారు. అలాగే రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్మికులకు మద్దతుగా నిలిచారని, ఆయన్ని కలవనున్నట్లు అనిల్ తెలిపారు. ఈ పరిణామాలు సమస్య పరిష్కారానికి సానుకూల సూచనలుగా కనిపిస్తున్నాయి.