- ఎన్నికల కమిషన్ అధికారుల లీలలు
- సీనియర్ ఐఏఎస్ అధికారుల అక్రమాలు
- రాజ్యాంగ పలుకులు… అడ్డమైన దారులు
- దొంగ ఓట్లతో అనేక రాష్ట్రాల్లో రాజ్యాధికారం
- రాహుల్ దెబ్బకు ఈసీకి మైండ్ బ్లాక్
- వాస్తవాలకు దూరంగా ఎన్నికల ఫలితాలు
సహనం వందే, న్యూఢిల్లీ:
కేంద్ర ఎన్నికల కమిషన్ లో వాళ్లంతా సీనియర్ ఐఏఎస్ అధికారులు. సూటు బూటు వేసుకొని టై కట్టుకుని గొప్ప ఇంగ్లీషులో మాట్లాడతారు. గొప్ప చదువులు చదివారు కాబట్టి గొప్ప సూక్తులు కూడా చెప్తారు. దేశానికి తామే నిజమైన సేవకులు అన్నట్లు ఫోజులు కొడతారు. కానీ తెర వెనక మాత్రం చీకటి వ్యవహారాలు నడుపుతారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి డబ్బుకు అమ్ముడుపోతారు. స్వయం ప్రతిపత్తితో నడవాల్సిన ఎన్నికల కమిషన్ ను కొందరు రాజకీయ నేతల వద్ద తాకట్టు పెడతారు. రాజ్యాధికారం కోసం జరుగుతున్న కుట్రల్లో వారూ భాగస్వామ్యం అవుతారు. కొందరు నేతల ఆదేశాల మేరకు ఓట్లను తీసేస్తున్నారు. అలాగే దొంగ ఓట్లను కలుపుతారు. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారు.
దొంగ ఓట్లపై రాహుల్ ధ్వజం...
గత లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో ఎన్నికల ప్రక్రియపై కొత్త సందేహాలు మొదలయ్యాయి. ఇటీవల కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసిందని ఆయన ఆరోపించారు. ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ మండిపడ్డారు. ఈ ఆరోపణల వల్ల ఈసీ విశ్వసనీయతపై ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. రాహుల్ గాంధీ తన ఆరోపణలను ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణతో మొదలుపెట్టారు. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నా, ఎన్నికల ఫలితాలు మాత్రం బీజేపీ వైపు మొగ్గాయని అన్నారు. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఇలాగే ఆశ్చర్యకరంగా ఉన్నాయని గుర్తుచేశారు. ఇది కేవలం యాదృచ్చికం కాదని, ప్రజాస్వామ్య వ్యతిరేక కుట్ర అని ఆయన విమర్శించారు.
రాహుల్ లేవనెత్తిన పది ప్రశ్నలు…
1) ఎన్నికల షెడ్యూల్‌పై సందేహాలు: ఎన్నికల ప్రక్రియ నెలల తరబడి ఎందుకు జరుగుతోంది? ఒకప్పుడు ఒకే రోజులో పోలింగ్ జరిగేది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ తరచుగా ఎందుకు మారుతోంది? ఇది ఎన్నికలను నియంత్రించడానికే చేశారు.
2) ఓటర్ల జాబితాలో లోపాలు: మహారాష్ట్రలో కేవలం ఐదు నెలల్లోనే కొత్త ఓటర్ల సంఖ్య గత ఐదేళ్లలో నమోదైన ఓటర్ల కంటే ఎక్కువగా ఎలా పెరిగింది? పోలింగ్ రోజు సాయంత్రం ఓటింగ్ శాతం అకస్మాత్తుగా ఎందుకు పెరిగింది?
3) రికార్డులను నాశనం చేయడం: ఓటింగ్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వంటి ఆధారాలను ఈసీ ఎందుకు నాశనం చేస్తోంది? పోలింగ్ ముగిసిన 45 రోజుల తర్వాత ఈ డేటాను ఎందుకు తొలగిస్తోంది? డిజిటల్ ఓటర్ల జాబితాను అందించడానికి ఎందుకు నిరాకరిస్తోంది?
4) ఓట్ల చోరీ: కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఓట్లను దొంగిలించారు. నకిలీ ఓటర్లు, తప్పుడు చిరునామాలు, ఒకే చిరునామాలో అనేక మంది ఓటర్లు, చెల్లని ఫోటోలు, ఫారం 6 దుర్వినియోగం ద్వారా ఈ ఓట్ల చోరీ జరిగింది.
5) నకిలీ ఓటర్ల నమోదు: ఒకే ఓటరు వేర్వేరు రాష్ట్రాలు, నియోజకవర్గాల్లో ఎలా నమోదు అయ్యారు? నకిలీ ఓటర్ల ఎంట్రీలతో ఓట్ల సంఖ్య ఎలా పెరిగింది?
6) నకిలీ చిరునామాలు: చిరునామా కాలమ్‌లో కేవలం చిహ్నాలు మాత్రమే ఉన్న ఓటర్లు, అడ్రస్ లేని ఓటర్ల వివరాలు ఎలా నమోదయ్యాయి? మహదేవపుర నియోజకవర్గంలో ఇలాంటివి 40,009 ఓట్లు ఉన్నాయి.
7) ఒకే అడ్రస్‌లో వందలాది మంది: ఒక చిన్న ఇంట్లో 80 మంది, ఒక లిక్కర్ షాపులో 68 మంది ఓటర్లు ఎలా నమోదయ్యారు? ఇలాంటి కేసులను ఈసీ ఎందుకు పట్టించుకోవడం లేదు?
8) చెల్లని ఫోటోలు: చాలా చిన్నగా లేదా అస్సలు ఫోటోలు లేని ఓటరు కార్డులతో ఓట్లు ఎలా నమోదయ్యాయి?
9) ఫామ్ 6 దుర్వినియోగం: కొత్త ఓటర్ల కోసం ఉద్దేశించిన ఫామ్ 6ను 70 ఏళ్ల మహిళ రెండుసార్లు ఎలా ఉపయోగించగలిగారు? ఆమె రెండుసార్లు ఓటు ఎలా వేశారు?
10) బీజేపీ గెలుపులో ఓట్ల చోరీ పాత్ర: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 25 నియోజకవర్గాల్లో కేవలం 33 వేల ఓట్ల ఆధిక్యతతో గెలిచింది. ఇది ఓట్ల చోరీ ద్వారానే సాధ్యమైంది.
ఈసీ మౌనంపై విమర్శలు
రాహుల్ గాంధీ చేసిన ఈ తీవ్ర ఆరోపణలపై ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించకుండా, కేవలం ఒక ప్రకటన విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ న్యాయ నిపుణులు మాట్లాడుతూ, ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవి. రాహుల్ గాంధీ చెప్పిన లోపాలు నిజమే అయితే వాటిని సరిచేయడం ఈసీ బాధ్యత. ఈసీ దీనిని ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేద’ని ప్రశ్నించారు.