- సామాజిక సంబంధాలే వారి జీవన రహస్యం
- కళా క్రీడా వినోదాలతో జాయ్ ఫుల్ లైఫ్
- నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధనా నివేదిక
సహనం వందే, అమెరికా:
ఎనభై తొంభై ఏళ్లు వచ్చినా యువకుల్లా మంచి జ్ఞాపకశక్తితో ఉత్సాహంగా జీవిస్తున్న సూపర్ ఏజర్స్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? సుమారు పాతికేళ్లుగా నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అసాధారణ వృద్ధులపై అనేక అధ్యయనాలు చేశారు. వాళ్ళ తాజా పరిశోధనలో మనసుకు హత్తుకునే నిజాలు వెలుగుచూశాయి. సామాజిక సంబంధాలు, ఉల్లాసమైన మనస్తత్వమే ఈ సూపర్ ఏజర్ల వెనుక ఉన్న రహస్యమని పరిశోధకులు చెబుతున్నారు. వృద్ధాప్యాన్ని ఎలా ఉల్లాసంగా గడపాలో ఈ సూపర్ ఏజర్ల జీవితాలు మనకు చక్కగా వివరిస్తున్నాయి.

మలి సంధ్యలో జీవనరాగం…
వారెన్ బఫెట్… ప్రస్తుతం ఆయన వయసు 94 ఏళ్ళు. ప్రపంచ కుబేరుడు. లక్షల కోట్ల ఆస్తులు ఆయన సొంతం. ఇప్పటికీ ఆయన హుషారుగా పనిచేస్తుంటారు. సొంతంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆఫీసుకి వెళ్తారు. తన వ్యాపారంలో నిత్యం బిజీగా ఉండే ఈయన… సామాజిక సంబంధాల కారణంగానే అత్యంత ఉల్లాసంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక 91 ఏళ్ల రాల్ఫ్ రెహ్‌బాక్ ఒక జర్మనీ హిట్లర్ మారణకాండ బాధితుడు. నాజీల అరాచకం నుంచి బయటపడిన ఈయనలో ఇంకా యువకుడి ఉత్సాహం ఉరకలేస్తోంది.
చికాగోలోని తన సినగాగ్‌లో ప్రతి నెల మొదటి శుక్రవారం జరిగే సమావేశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. అలాగే ప్రతి శుక్రవారం మధ్యాహ్నం ‘మెల్‌టోన్స్’ అనే సంగీత బృందంతో కలిసి 1930-40 ల నాటి పాటలను ఆలపిస్తుంటారు. నాజీ జర్మనీ నుంచి తాను ఎలా తప్పించుకున్నాడో వేలాది మంది స్కూలు విద్యార్థులకు చెప్పారు. రాల్ఫ్ జీవితం మొత్తం ఇలాంటి సామాజిక కార్యక్రమాలతో నిండిపోయింది. ఈ జీవన ఉత్సాహమే ఆయన జ్ఞాపకశక్తిని యవ్వనంగా ఉంచుతోంది.
కళా క్రీడా వినోదాలతో యవ్వన మనసు
82 ఏళ్ల లీ స్టీన్‌మన్ కు కళలంటే చాలా ఇష్టం. చికాగోలో ఉండే ఈయన తన ఇంటి చుట్టుపక్కల పిల్లలతో కలిసి ఎన్నో కళా ప్రాజెక్టుల్లో మునిగితేలారు. ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసినా, వ్రిగ్లీ ఫీల్డ్‌లో జరిగే బేస్ బాల్ ఆటలు చూడటం, పాత స్నేహితులతో మాట్లాడటం అలవాటుగా మార్చుకున్నారు. గతంలో ప్రకటనల రచయితగా, ఆ తర్వాత స్టేడియం సెక్యూరిటీ గార్డుగా పని చేసిన లీ, ఇప్పటికీ వారానికి మూడు నాలుగు సార్లు స్టేడియంకు వెళ్లి స్నేహితులతో సమయం గడుపుతారు. స్నేహితులతో మాట్లాడే అలవాటు, ఈ సామాజిక జీవనమే లీ మనసును యవ్వనంగా ఉంచుతోంది.
సామాజిక బంధాలతో మెదడు చురుకుదనం
నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ 2000వ సంవత్సరం నుంచి సూపర్ ఏజర్ల గురించి లోతుగా అధ్యయనం చేస్తోంది. ఎనభై ఏళ్లు దాటినా యువకుల్లాంటి జ్ఞాపకశక్తితో ఉండే ఈ వృద్ధులు అల్జీమర్స్ లాంటి వ్యాధులకు దూరంగా ఉంటున్నారు. విచిత్రమేమిటంటే ఈ సూపర్ ఏజర్లలో ఒకే రకమైన ఆహారం, వ్యాయామం, ఔషధాలు లేవు. కానీ వారందరిలో ఉన్న ఒకే ఒక్క సారూప్యత సామాజిక బంధాలకు ప్రాధాన్యత ఇవ్వడమే. నార్త్‌వెస్టర్న్ ఫీన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లోని సైకియాట్రీ ప్రొఫెసర్ సాండ్రా వైన్‌ట్రాబ్ ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు. సామాజిక సంబంధాలు, ఉల్లాసభరితమైన మనస్తత్వమే సూపర్ ఏజర్ల ప్రత్యేకత అని ఆమె స్పష్టం చేశారు.
స్నేహమే జీవన ఔషధం…
న్యూరో సైంటిస్ట్ బెన్ రీన్ ‘వై బ్రెయిన్స్ నీడ్ ఫ్రెండ్స్’ అనే తన రాబోయే పుస్తకంలో సామాజిక సంబంధాల ప్రాముఖ్యతను వివరిస్తారు. ఎక్కువగా సామాజికంగా ఉండే వ్యక్తులు వృద్ధాప్యంలో మెదడు క్షీణతను సమర్ధవంతంగా ఎదుర్కుంటారని, వారి మెదడు పరిమాణం కూడా సాధారణంగా పెద్దదిగా ఉంటుందని ఆయన చెప్పారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం మెదడును చురుకుగా ఉంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సూపర్ ఏజర్లు మనందరికీ ఒక స్ఫూర్తిని ఇస్తున్నారు. సామాజిక బంధాలతో, ఉల్లాసమైన మనసుతో మనం కూడా మన జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవచ్చు.