- షరతులతో వేతనాల పెంపునకు తిరస్కరణ
సహనం వందే, హైదరాబాద్:
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల జీతాల పెంపు విషయంలో నెలకొన్న వివాదం సద్దుమణగలేదు. వేతనాల పెంపునకు నిర్మాతలు షరతులతో కూడిన ప్రతిపాదనలు ముందుకు తెచ్చినప్పటికీ, కార్మిక సంఘాల నాయకులు వాటిని తిరస్కరించారు. ఫలితంగా ఈ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఇకపై తమ నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని ఫెడరేషన్ నేతలు ప్రకటించారు.
నిర్మాతల షరతుల్లోని మెలికలు…
నిర్మాతలు శనివారం మీడియా సమావేశంలో వేతనాల పెంపుపై తమ నిర్ణయాలను ప్రకటించారు. రోజుకు 2 వేల రూపాయల కన్నా తక్కువ జీతం తీసుకునే కార్మికులకు మాత్రమే వేతనాలు పెంచుతామని తెలిపారు. మొదటి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంచుతామని చెప్పారు. వెయ్యి రూపాయల కన్నా తక్కువ జీతం ఉన్నవారికి మాత్రం మొదటి ఏడాది 20 శాతం పెంపు ఉంటుందని, ఆ తర్వాత మూడో ఏడాది మరో 5 శాతం పెరుగుతుందని అన్నారు. అయితే ఈ పెంపు చిన్న సినిమాలకు వర్తించదని, చిన్న సినిమా అంటే ఎంత బడ్జెట్ అనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఈ వేతనాల పెంపు అమలు కావాలంటే తాము విధించిన నాలుగు షరతులను అంగీకరించాలని నిర్మాతలు స్పష్టం చేశారు.
మాకు సమ్మతం కాదు: ఫిల్మ్ ఫెడరేషన్
నిర్మాతల ప్రతిపాదనలను ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు వెంటనే తిరస్కరించారు. ఈ నిర్ణయం తమ సంఘాల మధ్య ఐక్యతను దెబ్బతీసేలా ఉందని వారు ఆరోపించారు. రోజువారీ వేతనం తీసుకునే 13 సంఘాల కార్మికులకు ఒకే విధంగా వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. నిర్మాతల షరతులను ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. వేతనాల విషయంలో ఏకపక్ష నిర్ణయాలను అంగీకరించబోమని అన్నారు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. ఆదివారం నుంచి తమ ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని ఫెడరేషన్ నేతలు హెచ్చరించారు.