- డాక్టర్ ‘తుది’వరకు సేవే ‘శ్వాస’… పేదలే ధ్యాస
- రెండు రూపాయల డాక్టర్ గోపాల్ కన్నుమూత
- ఉదయం 4 నుంచి 4 గంటల వరకు ప్రాక్టీస్
- కేరళ కన్నీటి వీడ్కోలు… సీఎం సంతాపం
- నేటి తరానికి ఆయన ఒక రోల్ మోడల్
సహనం వందే, కన్నూర్:
500 రూపాయల ఫీజు… 5 వేల రూపాయల వైద్య పరీక్షలు… వేల రూపాయల మందులు… ఇలా రోగులను దోచుకుంటున్న కొందరు డాక్టర్లను… కార్పొరేట్ ఆసుపత్రులను నేడు మనం చూస్తున్నాం. కానీ కేరళ రాష్ట్రం కన్నూర్ కు చెందిన డాక్టర్ ఎ.కె. రైరు గోపాల్ కేవలం రెండు రూపాయల ఫీజుతోనే రోగులకు వైద్యం చేయడం ఎంతో విశేషం. 50 ఏళ్లుగా ఆయన అదే ఫీజు వసూలు చేస్తున్నట్టు ఆశ్చర్యకరం. రెండు రూపాయల డాక్టర్ గా పేరొందిన గోపాల్ ఆదివారం కన్నుమూయడంతో కేరళ సమాజం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా మీడియా దీన్ని హైలెట్ చేయడం గమనార్హం.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఉచిత మందులు…
డాక్టర్ గోపాల్ 50 ఏళ్లకు పైగా సాధారణ ప్రజలకు ఆశాదీపంగా నిలిచారు. కేవలం రెండు రూపాయల కన్సల్టేషన్ ఫీజు తీసుకుని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి తరచుగా ఉచితంగా మందులు కూడా ఇచ్చేవారు. ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయన ప్రాక్టీస్ ఉండేది. ఆ తర్వాత సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అలసట లేకుండా రోగులను పరీక్షించారు. తన ప్రాక్టీస్ ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు రోజుకు 300 మందికి పైగా రోగులను చూసేవారు.
తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ…
పేరుపొందిన వైద్యుడు దాత అయిన డాక్టర్ ఎ.జి. నంబియార్, ఎ.కె. లక్ష్మీకుట్టిఅమ్మల కుమారుడైన డాక్టర్ రైరు గోపాల్ తన తండ్రి సూత్రాలను తు.చ. తప్పకుండా పాటించారు. డబ్బు సంపాదించాలనుకుంటే వైద్య వృత్తిని దుర్వినియోగం చేయకూడదని తన కుమారులైన రైరు గోపాల్, వేణుగోపాల్, కృష్ణగోపాల్, రాజగోపాల్‌లకు నంబియార్ ఒకసారి చెప్పారు.
ఉదయం 2.15 గంటలకే దినచర్య ప్రారంభం…
డాక్టర్ గోపాల్ ఇంటి వాతావరణం కూడా ఆయన సిద్ధాంతాలకు అద్దం పడుతుంది. ఆయన దినచర్య ఉదయం 2.15 గంటలకు పశువుల పాకలో పనులతో ప్రారంభమయ్యేది. ఆయన గోశాల నుంచి కొందరికి క్రమం తప్పకుండా పాలు అందించేవారు. ఆ తర్వాత స్నానం, ప్రార్థనలు పూర్తిచేసి ఉదయం 5.30 గంటలకు వార్తాపత్రికలు చదివేవారు. ఉదయం 6 గంటలకు రోగులు రావడం మొదలయ్యేది. తన వద్దకు వచ్చేవారి సమయాన్ని, ఆత్మాభిమానాన్ని గౌరవించే డాక్టర్‌గా ఆయన పేరు తెచ్చుకున్నారు.
ఫార్మా కంపెనీలకు దూరంగా…
ఆధునిక వైద్యంలో వాణిజ్య ధోరణులకు భిన్నంగా డాక్టర్ గోపాల్ ఫార్మా కంపెనీలతో సంబంధాలను కావాలనే నివారించారు. అందుకే ఆయన ఎప్పుడూ ఖరీదైన మందులు కాకుండా, తక్కువ ధరకు లభించే వాటినే రాసేవారు. బహుమతులు, కమీషన్లు, విలాసవంతమైన ప్రయాణాల పట్ల ఆయన ఆసక్తి చూపేవారు కాదు. ఆయన పద్ధతి తెలిసిన కంపెనీ ప్రతినిధులు ఎవరూ ఆయన ఇంటికి వచ్చేవారు కాదు.
ఇప్పటివరకు 18 లక్షల రోగులకు వైద్యం…
కన్సల్టేషన్లకే వందలు, వేలు ఖర్చు పెట్టాల్సిన ఈ రోజుల్లో డాక్టర్ రైరు గోపాల్ అసాధారణంగా నిలిచిపోయారు. కార్పొరేట్ ఆసుపత్రులు, స్పెషలిస్ట్‌లను కాదని ఆయన వద్దకు చాలా దూరం నుంచి రోగులు వచ్చేవారు. ఎందుకంటే ఆయన కేవలం వైద్యపరమైన సలహాలు మాత్రమే కాకుండా మానసికమైన, నైతికమైన ధైర్యాన్ని కూడా అందించేవారు. 18 లక్షల మందికి పైగా రోగులను చూసినప్పటికీ ఆయన ఒదిగి ఉండేవారు. నామమాత్రపు ఫీజుతో ఆయన చేసిన సేవలు పేద రోగులకు గొప్ప ఊరటనిచ్చాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు.