ఎంబీబీఎస్ కు డబ్బా కాలేజీల దెబ్బ – నాలుగేళ్లలో నిండని 11,966 సీట్లు

  • మంచి కాలేజీల వైపే విద్యార్థుల మొగ్గు
  • కాలేజీలు పెంచారు… వసతులు మరిచారు
  • డబ్బా కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతులు
  • ముడుపులు పుచ్చుకొని ప్రైవేట్లకు ఊడిగం

సహనం వందే, ఢిల్లీ: ఒకప్పుడు ఎంబీబీఎస్ లో సీటు రావడం చాలా కష్టమైన విషయం. ఇప్పుడు అవకాశాలు మరింత పెరిగాయి. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయి. కానీ అనేక కాలేజీలలో ఎంబీబీఎస్ సీట్లు మిగిలిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. సీట్ల కోసం విద్యార్థులు ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు… అయినప్పటికీ ఎంబీబీఎస్ సీట్లు మిగిలి పోవడానికి కారణం ఏంటనేది చర్చనీయాంశం అయింది. 2024-25 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 2,849 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత నాలుగేళ్లలో వైద్య సీట్ల సంఖ్య 39 శాతం పెరిగినా, నాణ్యత, వసతుల లేమితో విద్యార్థులు ఆ సీట్లను ఎంచుకోవడం లేదు. తెలంగాణలోని కొన్ని వైద్య కళాశాలల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. తాజాగా వరంగల్‌లోని ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు కావడమే ఇందుకు నిదర్శనం. మహావీర్ మెడికల్ కాలేజీ వంటి వాటిలో ఫ్యాకల్టీ, రోగుల కొరత తీవ్రంగా ఉంది.

నాలుగేళ్లలో 11,966 సీట్లు మిగులు…
2020-21లో దేశంలో 83,275 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, 2024-25 నాటికి ఈ సంఖ్య 1,15,900కు చేరింది. గణనీయమైన పెరుగుదల ఆశావహంగా కనిపించినా, అన్ని సీట్లు భర్తీ కాకపోవడం వ్యవస్థలోని లోపాలను స్పష్టం చేస్తోంది. 2021-22లో 2,012 సీట్లు ఖాళీగా ఉండగా… 2022-23లో ఏకంగా 4,146 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 2023-24లో 2,959 సీట్లు, 2024-25లో 2,849 సీట్లు మిగిలిపోయాయి. కొన్ని వైద్య కళాశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు, అర్హత కలిగిన బోధనా సిబ్బంది లేకపోవడం ఈ ఖాళీలకు ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. ఎంబీబీఎస్ చదివే విద్యార్థులు కేవలం డిగ్రీ కోసం కాకుండా, నాణ్యమైన శిక్షణ కోసం చూస్తారు. సరైన వసతులు లేని చోట విద్యార్థులు చేరడానికి ఇష్టపడడం లేదు.

నిబంధనలు భేష్… అమలు తుస్
వైద్య విద్య నాణ్యతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. 2023లో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తీసుకొచ్చిన నిబంధనలు వైద్య కళాశాలలకు అవసరమైన వసతులు, క్లినికల్ సామగ్రి, సిబ్బందిపై స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చాయి. ఈ నిబంధనలు మంచివే అయినా వాటిని కచ్చితంగా అమలు చేయడంలో లోపాలు కనిపిస్తున్నాయి.

కొత్త కళాశాలలకు అనుమతులు ఇచ్చేటప్పుడు నాణ్యతా ప్రమాణాలను కఠినంగా పరిశీలించడం లేదనే విమర్శలు ఉన్నాయి. పెద్ద ఎత్తున లంచాలు తీసుకొని కాలేజీలకు అనుమతులు ఇస్తున్నట్టు సీబీఐ గుర్తించిన సంగతి తెలిసిందే. వరంగల్‌ ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు కావడం ఈ నాణ్యతా లోపాలకు ఒక నిదర్శనం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *