- లేఖలు రాస్తే పట్టించుకునే నాథుడే ఉండడు
- రాజకీయ కోణం మాని రైతును ఆదుకోండి
- బండి, కిషన్ రెడ్డిలకు లేఖలు రాస్తే ఏమొస్తది?
- సమస్యను చెప్పడంతోనే సరిపెడుతున్నారు
- కేంద్రం ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం ఏంటి?
- యూరియా కొరతతో తల్లడిల్లుతున్న రైతులు
- అధిక ధరలకు అమ్ముతున్న దళారులు
- బ్లాక్ కు తరలిస్తున్న మార్క్ ఫెడ్ అధికారులు
సహనం వందే, హైదరాబాద్:
ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. దీంతో పంటల సాగు ఊపందుతుంది. ఇంతటి కీలక సమయంలో యూరియా అత్యవసరం. అందుకోసం అన్నదాత ఎదురుచూస్తున్నారు. కానీ యూరియా అందుబాటులో లేకుండా పోయింది. దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉండటంతో సాగు ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కేంద్రం నుంచి రావాల్సిన యూరియా పూర్తి స్థాయిలో సరఫరా కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆరోపిస్తుంది.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారు. అలాగే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కూడా రాశారు. ఇటీవల ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత కేంద్రమంత్రిని కలిసి యూరియా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా శనివారం కూడా కేంద్రానికి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. అధికారులు కూడా పలుసార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు. అయినప్పటికీ రాష్ట్రానికి యూరియా పూర్తిస్థాయిలో సరఫరా కావడం లేదు.
తుమ్మల ఢిల్లీకి ఎందుకు వెళ్లడం లేదు?
లేఖలు రాశారు… అధికారులు ఢిల్లీ వెళ్ళొచ్చారు… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పి వచ్చారు… అయినా యూరియా సరఫరా కావడం లేదు. ఇలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చాం అంటూ చెప్పుకుంటూ పోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఉండదు. ప్రస్తుత అత్యంత కీలక సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వెళ్తేనే ప్రయోజనం ఉంటుందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ఈ సమయంలో ఆయన ఆధ్వర్యంలో అధికారుల బృందం ఢిల్లీ వెళ్లి ఎంపీలతో కలిసి ప్రయత్నిస్తే ఎంతో కొంత యూరియా వస్తుందని అంటున్నారు. ముఖ్యమంత్రి చెప్పి వచ్చాక ఆ అంశాన్ని ఫాలోఅప్ చేయాల్సిన బాధ్యత తుమ్మలపైనే ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఈ విషయానికి సంబంధించి తుమ్మల ఇప్పటివరకు ఢిల్లీ గడపదొక్కలేదు. సమస్య చెప్పడం కాదు… దానికి పరిష్కారం రైతులకు చూపించాలి. అది చేయకుండా సమీక్షలు… లేఖలు… ఆదేశాలతో వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.
1.93 లక్షల మెట్రిక్ టన్నుల లోటు…
ఈ ఖరీఫ్ సీజన్‌కు తెలంగాణకు కేంద్రం 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. నెలవారీ ప్రణాళికల ప్రకారం ఏప్రిల్ నుండి జూన్ వరకు మొత్తం 5 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఈ మూడు నెలల కాలంలో రాష్ట్రానికి కేవలం 3.07 లక్షల టన్నులు మాత్రమే సరఫరా అయ్యింది. దీనివల్ల 1.93 లక్షల మెట్రిక్ టన్నుల భారీ లోటు ఏర్పడింది. ఏప్రిల్‌లో 1.70 లక్షల టన్నులకు గాను 1.21 లక్షల టన్నులు మాత్రమే రాగా, 49 వేల మెట్రిక్ టన్నుల (29 శాతం) లోటు ఏర్పడింది. మే నెలలో 1.60 లక్షల టన్నులు అవసరం కాగా… 88 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అందింది. అంటే 72 వేల మెట్రిక్ టన్నుల (45 శాతం) లోటు నమోదైంది. జూన్ నెలలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ప్రణాళికకు 98 వేల టన్నులు మాత్రమే సరఫరా కావడంతో 42 శాతం లోటు వచ్చింది.
కమీషన్ల కక్కుర్తిలో మార్క్ ఫెడ్…
ఒకవైపు యూరియా కోసం వ్యవసాయ శాఖ ప్రయత్నాలు చేస్తుంటే… మరోవైపు మార్క్ ఫెడ్ లో ఉన్న ఒక కీలక అధికారి కొరతను సొమ్ము చేసుకుంటున్నారు. అనేక జిల్లాల మేనేజర్లతో కుమ్మక్కై బ్లాక్ మార్కెట్ కు తరలించడంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తద్వారా దళారులతో కలిసి లక్షల రూపాయలు దోచుకుంటున్నట్లు అందులోని ఉద్యోగులే చెప్తున్నారు. అటువంటి వారి విషయంలో ఎటువంటి చర్య తీసుకోకుండా మిన్నకుండిపోవడంపై విమర్శలు వస్తున్నాయి.