బీహార్ లో జర్నలిస్టులకు 15 వేల పెన్షన్

  • హరియాణ, ఒడిశా, కేరళల్లోనూ అందజేత
  • తెలుగు రాష్ట్రాల్లో అందని ఆర్థిక సాయం
  • పెన్షన్, ఇంటి జాగాకు డీజేహెచ్ఎస్ విన్నపం

సహనం వందే, హైదరాబాద్:
జర్నలిస్టుల బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. ఉద్యోగ భద్రత కరువైంది. పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆధారం లేకుండా నిస్సహాయ స్థితిలో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. పత్రికా యాజమాన్యాలు వీరిని పట్టించుకోకపోగా, చాలీచాలని జీతాలతో బతుకులీడుస్తున్నారు. దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రిటైర్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తుంటే, తెలుగు రాష్ట్రాలు మాత్రం ఈ విషయంలో జర్నలిస్టులను విస్మరించాయి. ఇళ్ల స్థలాలు, పెన్షన్ వంటి కీలకమైన విషయాల్లో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోంది.

బీహార్‌లో పెరిగిన పెన్షన్…
తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జర్నలిస్టులకు ప్రస్తుతం ఇస్తున్న 10 వేల రూపాయల పెన్షన్‌ను 15 వేలకు పెంచుతామని ప్రకటించారు. బీహార్ పత్రకార్ సమ్మాన్ పెన్షన్ స్కీమ్ కింద ఇస్తున్నారు. ఒకవేళ పెన్షన్ పొందుతున్న జర్నలిస్టు మరణిస్తే, అతని భార్యకు ప్రస్తుతం ఇచ్చే 3 వేల రూపాయల పెన్షన్ ను 10 వేలకు పెంచారు. కేరళ, హరియాణ, ఒడిశా ప్రభుత్వాలు కూడా జర్నలిస్టులకు పెన్షన్ అందిస్తున్నాయి. కేరళ, హరియాణలలో జర్నలిస్టులకు నెలవారీ 10 వేల రూపాయల పెన్షన్ లభిస్తోంది. ఒడిశాలో 4 వేల రూపాయల వరకు అందిస్తున్నారు.

రిటైర్మెంట్ తర్వాత…
బీహార్ రాష్ట్రంలో గుర్తింపు పొందిన మీడియా సంస్థల్లో పనిచేసిన వారు, రిటైర్మెంట్ లేదా వృద్ధాప్యంలో ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస అర్హత ప్రమాణాలు (వయసు, సేవా కాలం) అక్కడి సమాచార శాఖ నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. హరియాణలో గుర్తింపు పొందిన మీడియా సంస్థల్లో కొంత కాలం పనిచేసిన జర్నలిస్టులు, వృద్ధాప్యంలో ఆర్థిక సాయం అవసరమైన వారు అర్హులు. అర్హత నిబంధనలు హర్యానా సమాచార శాఖ మార్గదర్శకాలను అనుసరించి ఉంటాయి. ఒడిశాలో కనీస సేవా కాలం, రాష్ట్ర నివాసం వంటి నిబంధనలు వర్తిస్తాయి.

డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ విన్నపం…
ఆ రాష్ట్రాలు పెన్షన్ పథకాలను అమలు చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అమలు కావడం లేదు. ఆరోగ్య బీమా వంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నప్పటికీ, ప్రత్యేక పెన్షన్ పథకం లేదు. జర్నలిస్టులకు రూ. 25 వేల పెన్షన్, ఇంటి స్థలం ఇవ్వాలని డెక్కన్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) కార్యదర్శి అమృత దిద్యాల, వైస్ ప్రెసిడెంట్ మరిపాల శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, సలహాదారులు మల్లికార్జున్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, డైరెక్టర్లు ప్రతాప్ రెడ్డి, నాగరాజు, రామకృష్ణ, డేగ కుమార్, స్వామి రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *