- కోట్లు కొల్లగొడుతున్నా ఆదుకుంటున్నదెవరు?
- ఒక కీలక ప్రజాప్రతినిధి… మాజీ ఎండీ అండ
- సుధాకర్, శ్రీకాంత్, ప్రవీణ్ రెడ్డీలకు భరోసా
- రైతుల వ్యతిరేకతకు టెన్షన్ పడొద్దని సూచన
- కేంద్ర బృందం వచ్చినా చేసేదేం లేదని ధైర్యం
- భయపడొద్దని కంపెనీలకు ప్రత్యేక విజ్ఞప్తులు
- దీంతో ఆగని కోట్ల రూపాయల కమీషన్ల దందా
సహనం వందే, హైదరాబాద్:
- గత ప్రభుత్వంలో ఆయిల్ ఫెడ్ అధికారులు రాష్ట్రంలో వివిధ ప్రైవేట్ కంపెనీలకు ఏరియా అలాట్మెంట్… కొత్త ప్రాంతాలలో నర్సరీల ఏర్పాటు… ఫ్యాక్టరీల నిర్మాణం… వాటికి మౌలిక సదుపాయల కల్పన… విదేశాల నుండి నాణ్యత లేని విత్తన మొలకల దిగుమతి తదితర అంశాలలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలి – ప్రజావాణిలో సీఎంకు విన్నపం.
- అధికారుల నిర్లక్ష్యం వల్ల నకిలీ మొక్కలు సరఫరా చేశారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఆయిల్ ఫెడ్ అక్రమాలపై విచారణ జరిపించి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము – సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రిని కలిసి విన్నపం.
ఆయిల్ ఫెడ్ అక్రమాలపై అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోయర్స్ సొసైటీ అధ్యక్షులు ఉమామహేశ్వర్ రెడ్డి, కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య ఆధ్వర్యంలో గత ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు సార్లు విన్నవించారు. అయినా ఆయిల్ ఫెడ్ లో అక్రమాలు తగ్గకపోగా మరింత పెరుగుతున్నాయి. కొందరు సీనియర్ అధికారులు, కొన్ని ప్రైవేట్ కంపెనీలు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై కోట్లు దోపిడీ చేస్తున్నారు. ఆ సంస్థకు చెందిన కీలక అధికారులు సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎండీ సురేందర్… వీరంతా ప్రస్తుత పరిస్థితికి కారణంగా ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి.
కోటి మొక్కలు తెప్పిస్తే అందులో నాసిరకం ఉండడం వల్ల అవి సరిగా కాపు కాయడం లేదని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు నర్సరీలలో మొక్కలు మాయం అవుతున్నాయి. అలాగే కమీషన్ల కోసం అవసరానికి అనేక రెట్లు ఎక్కువ సామర్థ్యంతో దాదాపు 300 కోట్ల రూపాయలతో నర్మెట్టలో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. ఇంకోవైపు ఆయిల్ పామ్ తోటల్లో నాసిరకం మొక్కలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో కేంద్ర బృందం క్షేత్రస్థాయి పర్యటనలు చేసింది. ఇవన్నీ ఆ కీలక అధికారుల నిర్ణయాల వల్లే జరిగినట్లు రైతు నేతలు ఆరోపిస్తున్నారు. సీఎంకు విన్నవించినా అక్రమాలు ఆగడం లేదు. రైతుల జీవితాలను చిందర వందర చేస్తున్నారు.

సీఎంకి విన్నవించిన అంశాల్లో కొన్ని…
ఆయిల్ ఫెడ్ అక్రమాలపై ఆయిల్ పామ్ గ్రోయర్స్ సొసైటీ ఆధ్వర్యంలో రెండుసార్లు సీఎంను కలిసిన సందర్భంలో పలు అంశాలను ఉమామహేశ్వర్ రెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో తెలంగాణలో 20 లక్షల ఎకరాలకు పైగా ఆయిల్ పామ్ సాగు పేరుతో అయిల్ ఫెడ్ లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. గిట్టుబాటు ధర రాక నష్టపోతున్న ఆయిల్ పామ్ రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆయిల్ ఫెడ్ ఆదాయం నుండి సీఎస్ఆర్ ఫండ్ ను ఇతరత్రా డైవర్ట్ చేశారు. ఈ ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాలలో ఖర్చు చేశారు. ఇక మీదట ఆ ఫండ్ ను ఈ ప్రాంత అభివృద్ధికి మాత్రమే కేటాయించేలా ఆదేశించాలని వేడుకున్నారు. ఒక టన్ను ఆయిల్ పామ్ గెలలకు రూ. 25,000 మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రిఫైనరీ నిర్మించాలన్నారు.
అక్రమార్కులకు భరోసా కల్పిస్తున్నది ఎవరు?
ఆయిల్ ఫెడ్ లో ప్రస్తుతం జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, డిప్యూటీ మేనేజర్ ప్రవీణ్ రెడ్డి… కీలకమైన బాధ్యతల్లో పనిచేస్తున్నారు. వారితోపాటు మిగిలిన అధికారులు కూడా ఉన్నారు. అశ్వారావుపేట ఆయిల్ పామ్ నర్సరీలలో అక్రమాలపై జరిగిన విచారణలో ప్రవీణ్ రెడ్డి పేరు వెలుగు చూసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని అప్పటి ఎండీ నిర్మల ఆదేశించారు. 40 లక్షల రూపాయలు రికవరీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. కానీ తదుపరి వచ్చిన ఎండీ వాటన్నింటినీ పక్కనపెట్టి ఆయనకు అండదండలు ఇచ్చారు.
ఇక నర్మెట్ట ఫ్యాక్టరీ విషయంలో మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఆ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ ప్రీ యూనిక్ కంపెనీకి దక్కేలా శ్రీకాంత్ రెడ్డి, అలాగే అప్పటి ఎండీ సురేందర్, జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి కృషి చేశారు. అవసరానికి మించి ఎక్కువ పెట్టుబడి పెట్టేలా నర్మెట్ట ఫ్యాక్టరీకి శ్రీకారం చుట్టడంలో వీరిదే కీలక పాత్ర. అత్యంత తక్కువ ఖర్చుతో అక్కడి అవసరాలను బట్టి చూస్తే కేవలం రూ. 100 కోట్ల లోపు పూర్తయ్యే ఫ్యాక్టరీని… రూ. 300 కోట్లు ఖర్చు చేసేలా ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించడంలో వీరి పాత్ర ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి.
ఇక ఆయిల్ పామ్ మొక్కలు నాసిరకంగా ఉండటానికి… వాటిని కొనుగోలు చేసే సందర్భంలో అవినీతి అక్రమాలు జరగడానికి ఈ అధికారులు ప్రోత్సహించారని రైతు నేతలు ఆరోపిస్తున్నారు. వీటన్నింటిపై విచారణ చేయాలని ఏకంగా ముఖ్యమంత్రికి విన్నవించినప్పటికీ… చర్యలు లేకపోగా అవినీతి అక్రమాల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. తాను అన్ని చూసుకుంటానని ఒక ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధి హామీ ఇస్తుండగా… మరో మాజీ ఎండీ ఏమీ కాదని భరోసా ఇస్తున్నారు. ‘రైతులు ఏం చేసినా… ఎన్ని ఆందోళనలు నిర్వహించినా… మీడియాలో కథనాలు వచ్చినా డోంట్ కేర్ అన్నట్లు ఉండాలని… వాటిని ఏమాత్రం పట్టించుకోవద్దని’ ఆయిల్ ఫెడ్ లోని కొందరు అక్రమార్కులకు ధైర్యం చెబుతున్నారు.
కేంద్ర బృందం వచ్చినప్పటికీ ఏమీ చేయలేదని… వాటన్నింటినీ తనకు వదిలేయాలని… మీ పని మీరు చేసుకోవాలని’ భరోసా కల్పిస్తున్నారు. ఇక కంపెనీలకు కూడా అలాగే చెప్తున్నారు. ‘టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదని… తాము అన్నీ చూసుకుంటామని… ఎక్కడ ఎంత ఇవ్వాలో అక్కడ అంత ఇస్తే సరిపోతుందని వారికి సూచిస్తున్నట్లు తెలిసింది. దీంతో అక్రమార్కులకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు అయింది. దీంతో కోట్లు కొల్లగొడుతూ రైతుల నోట్లు మట్టి కొడుతున్నారన్న విమర్శలున్నాయి.
ముఖ్యమంత్రి కేంద్రీకరిస్తే…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పట్ల సానుకూలంగా ఉన్నారు. ఆయిల్ ఫెడ్ అక్రమాలపై ముఖ్యమంత్రి దృష్టి సారిస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. అవసరమైతే సీఎంని మరోసారి కలవాలని భావిస్తున్నారు.