- దేశంలో పెరుగుతున్న నయా బిజినెస్
- మ్యూజిక్… డాన్స్… రీల్స్… గుడ్ ఫుడ్
- పెళ్లి వేడుక ఒక సరదా పార్టీ మాత్రమే
- ఆకర్షితులవుతున్న జెన్-జెడ్ యూత్
- ఈవెంట్ మేనేజర్లకు లక్షల్లో ఆదాయం
సహనం వందే, హైదరాబాద్:
పెళ్లంటే పంతులు లేని… పీటలు లేని… పన్నీరు చిలకరించని పసందైన విందు అని ఈ తరం యువత కొత్త భాష్యం చెబుతోంది. బంధువుల చుట్టూ తిరగడం… వారి యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పడం… వధూవరుల మొహాలు చూడటం వంటివేవీ లేకుండా కేవలం రుచికరమైన భోజనం, మ్యూజిక్, డాన్స్ మాత్రమే కావాలనుకునే వారి కోసం ఉత్తుత్తి పెళ్లిళ్ల కొత్త ట్రెండ్ మొదలైంది. ఈ వింత పార్టీలలో వధూవరులే ఉండరు! అవును మీరు విన్నది నిజమే. అసలు పెళ్లే జరగని పెళ్లి పార్టీలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. సాంప్రదాయ వివాహాల ఒత్తిళ్లు లేకుండా కేవలం సరదా, సందడి మాత్రమే కావాలని కోరుకునే జెన్-జెడ్ యువత దీనికి బ్రహ్మరథం పడుతోంది.

ఎంజాయ్ పార్టీల కొత్త నిర్వచనం…
నకిలీ వివాహాలు అనేవి అచ్చం సాధారణ పెళ్లి వేడుకలాగే కనిపిస్తాయి. కానీ ఇందులోవివాహ తంతు మాత్రం ఉండదు. వివాహానికి అవసరమైన మ్యూజిక్, డాన్స్, సాంప్రదాయ దుస్తులు, రుచికరమైన ఆహారం, అందమైన అలంకరణలు – అన్నీ ఉంటాయి. ఒక్క వధూవరులు తప్ప! ఈ వింత పార్టీలకు హాజరయ్యేందుకు ముందుగా టికెట్లు కొనుగోలు చేయాలి. ఈవెంట్ ప్లానర్లకు, వివిధ బ్రాండ్‌లకు, కంటెంట్ క్రియేటర్‌లకు ఇది ఇప్పుడు లక్షల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టే లాభదాయక వ్యాపారంగా మారిందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
ఎందుకీ కొత్త ఆలోచనలు?
సాధారణ వివాహాల్లో హాజరయ్యే వారికి తరచూ ఎదురయ్యే ఇబ్బందులు ఈ నకిలీ వివాహ ఈవెంట్లలో ఉండవు. బంధువులతో అనవసర సంభాషణలు, అంతులేని వరుసల్లో నిలబడి ఆహారం కోసం ఎదురుచూపులు, వివాహ వేడుకల ఒత్తిడితో కూడిన షెడ్యూల్ వంటివి ఈ పార్టీలలో కనిపించవు. ఒక రిలాక్స్‌డ్ వాతావరణంలో పెళ్లి సందడిని ఆస్వాదించే అవకాశాన్ని ఇవి అందిస్తాయి. యువత సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై, ఫొటోలు తీసుకుంటూ, వైరల్ రీల్స్ చేస్తూ, కడుపు నిండా తింటూ, సంగీతం, నృత్యాలతో సరదాగా గడపడం కోసం ఈ ఈవెంట్‌లకు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. పెళ్లి వేడుకలను ఒక సరదా పార్టీగా మార్చేసి, బాధ్యతలు లేకుండా కేవలం ఆనందం మాత్రమే కావాలని కోరుకునే ఈ తరం కోరికలకు ఇది అద్దం పడుతోంది.
వ్యాపారంలో కొత్త ఒరవడి…
ఈ నకిలీ వివాహ ఈవెంట్‌లు కేవలం సరదా కోసం మాత్రమే కాదు… ఇప్పుడవి ఒక లాభదాయక వ్యాపారంగా మారిపోయాయి. ఈవెంట్ ప్లానర్లు, డిజైనర్లు, క్యాటరింగ్ సంస్థలు, కంటెంట్ క్రియేటర్‌లు ఈ ట్రెండ్‌ను చక్కగా సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో ఈవెంట్‌కు టికెట్ ధరల ద్వారా లక్షల రూపాయల ఆదాయం సమకూరుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే రీల్స్, ఫొటోల కోసం యువత పోటీపడి ఈ ఈవెంట్లకు వస్తున్నారు.
సాంప్రదాయాలకు సవాల్?
ఇలాంటి ఈవెంట్‌లు యువతలో వివాహ వేడుకలపై ఒక కొత్త దృక్పథాన్ని తీసుకొస్తున్నాయి. కొందరు ఈ ట్రెండ్‌ను వివాహ సంప్రదాయాలను తేలికగా తీసుకోవడంగా… సాంప్రదాయ విలువలను కాలరాస్తున్నట్లుగా భావిస్తున్నారు. కేవలం వినోదం, సోషల్ మీడియా కంటెంట్ కోసం ఇలాంటివి నిర్వహిస్తున్నారని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇది సాంప్రదాయాలకు దూరంగా వెళ్లే కొత్తతరం ఆలోచన అనుకోవాలా? లేక కేవలం తాత్కాలిక వినోదమా? అనేది కాలమే చెప్పాలి. అసలు వధూవరులు లేకుండానే వివాహ విందులు చేసుకునే రోజులు వచ్చాయంటే సమాజం ఎటువైపు వెళ్తోంది?