- ఎఫ్ఎంజీఈ పరీక్షల్లో పాసయ్యేది 30 శాతమే
- అయినా ప్రైవేట్ ఆసుపత్రుల్లో దర్జాగా డాక్టర్
- అర్హత లేకపోయినా వైద్యులుగా చలామణి
- బోర్డులు పెట్టుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా దందా
- వీటిపై దృష్టిపెట్టని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్
- ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్న దుస్థితి
- లంచాలు మేస్తూ వదిలేస్తున్న అధికారులు
సహనం వందే, హైదరాబాద్:
విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతారు… కొన్ని దేశాల్లో ఎంబీబీఎస్ నే ఎండీ అంటారు. అలా విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన వారు మన దేశంలో నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజీఈ) పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటికీ డాక్టర్లుగా చలామణి అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని అనేక ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఇటువంటి వారిని డాక్టర్లుగా నియమించుకుంటున్నాయి. నెలకు పాతిక వేలు జీతం ఇస్తే చాలని విదేశీ ఎంబీబీఎస్ అభ్యర్థులు భావిస్తుండటంతో, తక్కువ వేతనాలతోనే ఆసుపత్రులు వారిని నియమించుకుంటున్నాయి. అటువంటి డాక్టర్లను గుర్తించి పట్టుకోవడంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఘోరంగా వైఫల్యం చెందుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎఫ్‌ఎంజీఈలో 30 శాతానికి మించని పాస్…
ఎఫ్‌ఎంజీఈ అనేది విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన భారతీయ పౌరులు మన దేశంలో వైద్య వృత్తిని చేపట్టడానికి తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిన పరీక్ష. ఆ పరీక్ష పాస్ అయితేనే ఆయా రాష్ట్రాల్లో మెడికల్ కౌన్సిళ్లలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది.

అయితే ఈ పరీక్షలో పాస్ శాతం తక్కువగా ఉంటోంది. గత కొన్ని సంవత్సరాలుగా పాస్ శాతం 20 నుంచి 30 శాతం మధ్యే నమోదవుతోంది. ఉదాహరణకు 2024 డిసెంబర్ సెషన్‌లో దాదాపు 70 శాతం మంది అభ్యర్థులు ఫెయిల్ అయ్యారు. అలాగే ఈ ఏడాది (2025) నిర్వహించిన సెషన్‌లోనూ 44,390 మంది అభ్యర్థుల్లో కేవలం 13,149 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అంటే దాదాపు 29.62 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. ఈ గణాంకాలు విదేశాల్లో వైద్య విద్య నాణ్యత, భారత వైద్య ప్రమాణాల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని సూచిస్తున్నాయి. ఎఫ్‌ఎంజీఈలో ఉత్తీర్ణత సాధించడానికి అభ్యర్థులు 300 మార్కులకు కనీసం 150 మార్కులు సాధించాలి.
తక్కువ పాస్ శాతానికి కారణం?
ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో తక్కువ పాస్ శాతానికి అనేక కారణాలున్నాయి. విదేశీ వైద్య కళాశాలల పాఠ్య ప్రణాళికలు, మన దేశ వైద్య విద్యా వ్యవస్థకు పొంతన లేకపోవడం ఒక ప్రధాన కారణం. విదేశాల్లో సరైన క్లినికల్ శిక్షణ లేకపోవడం వల్ల కూడా చాలా మంది అభ్యర్థులు సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని ఆచరణలో అన్వయించలేకపోతున్నారు. కొన్ని విదేశీ వైద్య కళాశాలలు మన దేశంలోని సంస్థల స్థాయిలో కఠినమైన విద్యా ప్రమాణాలను, క్లినికల్ శిక్షణను అందించలేకపోతున్నాయి. అంతేకాదు ఎఫ్‌ఎంజీఈ పరీక్ష క్లిష్టంగా ఉండటం, సరైన మార్గదర్శకత్వం కొరవడటం కూడా తక్కువ పాస్ శాతానికి దోహదపడుతున్నాయి. దీంతో వందలాది మంది విద్యార్థులు ఎఫ్ఎంజీఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక వైద్య వృత్తిని వదిలేస్తుండటం విచారకరం. మరికొందరు అక్రమ మార్గాల్లో డాక్టర్లుగా చలామణి అవుతుండటం శోచనీయం.
అనర్హుల వైద్యం… ప్రాణసంకటం
ఆర్ఎంపీల వైద్యం ఎంత ప్రమాదకరమో, అర్హత లేని ఇలాంటి విదేశీ వైద్యుల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా కొందరు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల బోర్డులు పెట్టుకుంటూ వైద్య దందా సాగిస్తున్న వీరిపై యంత్రాంగం ఏం చేస్తుందన్న ప్రశ్న తలెత్తుతోంది. కొందరైతే ఎండీ బోర్డులు కూడా పెట్టుకుంటున్నారు. అసలు వైద్యరంగంలో లేని కొన్ని స్పెషాలిటీలను కూడా వీళ్లు తగిలించుకుంటున్నారు. ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి వారిపై రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ దృష్టి సారించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కొందరు అధికారులు లంచాలు తీసుకుంటూ వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ తక్షణమే స్పందించి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి ‘ఫెయిల్’ డాక్టర్ల దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
