ఇండియా కూటమి బీసీ నినాదం – ముఖ్యమంత్రి రేవంత్ చొరవ

  • ఆయా పార్టీల ఎంపీలతో భేటీకి సన్నాహాలు
  • ఈనెల 21వ తేదీన సమావేశానికి ఏర్పాట్లు
  • బీసీ బిల్లు ప్రాముఖ్యత చెప్పే అవకాశం

సహనం వందే, హైదరాబాద్:
ఇండియా కూటమి పార్టీలలో బీసీ చర్చను లేవనెత్తేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేశారు. కూటమి పార్టీల ఎంపీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లును ఆమోదింప చేసుకోవాలని సీఎం పట్టుదలతో ఉన్నారు. ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ పార్టీ అయినందున… దాని అధినేత రాహుల్ గాంధీ అనుమతి తీసుకుని సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున సన్నాహాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న మరోసారి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. అదేరోజు బీసీ రిజర్వేషన్ పై బిల్లుపై ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిసింది.

ప్రధాని అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం…
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దాన్ని అమలు చేయడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి… పార్లమెంటు ఆమోదం తప్పనిసరి అని అంటున్నారు. బీసీల రిజర్వేషన్లు పెంచటం… దాని ఆవశ్యకత… దేశంపై బీసీల ప్రభావం వంటివన్నీ ఇండియా కూటమి ఎంపీలకు రేవంత్ రెడ్డి వివరించనున్నారు. దీంతో పాటు తెలంగాణలో పూర్తి చేసిన కులగణన వంటి అంశాలపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది.

ఇక ఈ నెల 21 నుండి కూటమి ఎంపీల సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు సీఎంవో వర్గాలు తెలిపాయి. అందులో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించి పార్లమెంట్ వేదికగా పోరాటం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేగాక ఇండియా కూటమి ఎంపీలతో ప్రధానమంత్రిని కలిసే విధంగా అపాయింట్ మెంట్ కోరారు. ఉభయసభలలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదంతో పాటు 9వ షెడ్యూల్ లో చేర్చాలని సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల నినాదం దేశ వ్యాప్తంగా వినిపించే దిశగా జాతీయ కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుండగా, బీసీ రిజర్వేషన్లపై ఇతర పార్టీలు ఏం నిర్ణయం తీసుకున్నా తమకే కలిసి వచ్చేలా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తున్నది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *