- శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణం అద్భుతం
- 18 రోజులు… కోటి కిలోమీటర్లు
- 60 కీలక అంశాలపై లోతైన ప్రయోగాలు
- మధుమేహం, క్యాన్సర్ చికిత్సలపై పరిశోధన
- వ్యవసాయంలో జన్యుపర అంశాలపై కూడా
- అక్కడ కటింగ్ చేయించుకున్న మొదటి వ్యక్తి
సహనం వందే, ఫ్లోరిడా:
భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా నేతృత్వంలోని బృందం అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 60 శాస్త్రీయ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకుని మంగళవారం భూమిపైకి సురక్షితంగా చేరుకుంది. 28 గంటల సుదీర్ఘ ప్రయాణం అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన ఈ బృందం… 18 రోజుల్లో దాదాపు 1.22 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి, 288 భూ ప్రదక్షిణలు పూర్తి చేసింది. శుభాంశు ఒక్కరే ఇస్రో తరఫున ఏడు కీలక ప్రయోగాలను చేపట్టారు. ఈ ప్రయోగాలు మానవ ఆరోగ్యం, జీవనాధార వ్యవస్థలు, వ్యవసాయం, సాంకేతికతల అభివృద్ధికి విశేషంగా దోహదపడతాయి.
మైక్రోగ్రావిటీలో పరిశోధనలు…
శుభాంశు శుక్లా బృందం చేపట్టిన 60 ప్రయోగాల్లో కీలకమైనది మానవ ఆరోగ్యం, అంతరిక్ష వైద్యానికి సంబంధించినది. భారరహిత స్థితిలో మానవ కండరాలు, ఎముకలు, గుండె, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థలపై సున్నా గురుత్వాకర్షణ ప్రభావాన్ని అధ్యయనం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. మానవ జీర్ణవ్యవస్థ పనితీరును అంతరిక్షంలో పరిశీలించారు. దీనిపై భారతీయ విద్యార్థుల కోసం ఒక వీడియోను కూడా రూపొందించారు. అంతరిక్షంలో మధుమేహం, క్యాన్సర్ వంటి రోగాల చికిత్స కోసం కొత్త మార్గాలను అన్వేషించే పరిశోధనలు కూడా ఇందులో ఉన్నాయి. గ్లూకోజ్ పర్యవేక్షణ, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అంతరిక్ష ప్రయాణాన్ని సురక్షితం చేసేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించారు. వ్యోమగాముల మానసిక ఆరోగ్యంపై మైక్రోగ్రావిటీ ప్రభావాన్ని అధ్యయనం చేసే క్రమంలో, తేలియాడే నీటి బుడగను సృష్టించి, అందులో సమయం గడిపిన అనుభవాన్ని శుభాంశు అద్భుతంగా అభివర్ణించారు.

వ్యవసాయంలో విప్లవం
వ్యవసాయ రంగంలోనూ శుక్లా బృందం కీలక ప్రయోగాలు చేసింది. ఇస్రో అభివృద్ధి చేసిన ఆరు రకాల పంట గింజలపై మైక్రోగ్రావిటీ ప్రభావాన్ని అధ్యయనం చేశారు. విత్తనాలు మొలకెత్తడం, జన్యు లక్షణాలు, సూక్ష్మజీవుల పరస్పర చర్యలు, పోషక విలువలను పరిశీలించారు. సున్నా గురుత్వాకర్షణలో మైక్రోఆల్గీని సాగు చేసి ఆక్సిజన్, ఆహారం, బయోఫ్యూయల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పరీక్షించారు. టార్డిగ్రేడ్‌లు అంటే కఠిన పరిస్థితుల్లో జీవించగల సూక్ష్మజీవులపై అంతరిక్షంలో ప్రయోగాలు జరిపి, వాటి జీవన సామర్థ్యాన్ని అధ్యయనం చేశారు.
అంతరిక్షంలోనే ప్రయోగాలు ఎందుకు?
శుభాంశు శుక్లా బృందం నిర్వహించిన ఈ ప్రయోగాలు అంతరిక్షంలోనే సాధ్యమయ్యాయి. భూమిపై ఇవి అసాధ్యం. పైగా పరిమిత ఫలితాలను మాత్రమే ఇస్తాయి. దీనికి ముఖ్య కారణం అంతరిక్షంలోని సున్నా గురుత్వాకర్షణ (మైక్రోగ్రావిటీ), శూన్య వాతావరణం. భూమిపై ఇలాంటి పరిస్థితులు ఉండవు. భూమిపై గురుత్వాకర్షణ శక్తి అన్ని పదార్థాలపై నిరంతరం ప్రభావం చూపుతుంది. కానీ అంతరిక్షంలో ఈ శక్తి దాదాపు లేనట్టే. దీని వల్ల ప్రయోగాలు భూమిపై కంటే భిన్నమైన, ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయి. ఉదాహరణకు… భూమిపై గురుత్వాకర్షణ కారణంగా ప్రోటీన్ క్రిస్టల్స్ అసమానంగా ఏర్పడతాయి. కానీ అంతరిక్షంలో అవి అత్యంత స్వచ్ఛమైన నిర్మాణాలను ఏర్పరుస్తాయి. ఇవి మందుల తయారీలో కీలకమైనవి.
అంతరిక్షంలో హెయిర్‌కట్…
ఈ మిషన్‌లో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా చోటు చేసుకున్నాయి. శుభాంశు శుక్లా అంతరిక్షంలో హెయిర్‌కట్ చేయించుకున్న తొలి భారతీయ వ్యోమగామిగా రికార్డు సృష్టించారు. అమెరికా వ్యోమగామి నికోల్ అయర్స్ ఆయనకు హెయిర్‌కట్ చేయగా, ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అలాగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా పాఠశాల విద్యార్థులతో మాట్లాడటం, యువతలో అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తిని మరింత పెంచింది.