ఆర్ఎంపీల గుప్పిట్లో ఆసుపత్రులు

  • రోగులను ఆసుపత్రులకు తెచ్చేది ఆర్ఎంపీలే
  • ఆర్ఎంపీలే ప్రైవేటు డాక్టర్లకు జీవనాధారం
  • కార్పొరేట్ ఆసుపత్రులనూ నడిపిస్తున్నది వీరే
  • పేషంట్లను తీసుకొచ్చినందుకు కమీషన్లు
  • ఇలా అమాయక రోగుల ఆరోగ్యాలతో ఆట
  • అటువంటి దవాఖానాలపై చర్యలు లేవేంటి?
  • రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ వాటిపై ఏం చేస్తుంది?
  • ఆర్ఎంపీలను ప్రోత్సహిస్తున్నది డాక్టర్లు కాదా!

సహనం వందే, హైదరాబాద్:
ఆర్ఎంపీల పై తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చేస్తున్న దాడులు ప్రతి నిత్యం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులైన వైద్యులను పట్టుకోవడంలో మెడికల్ కౌన్సిల్ నిర్విరామంగా కృషి చేస్తోంది. ఆర్ఎంపీలను ఏరివేయడమే లక్ష్యంగా ఆ కౌన్సిల్ ఏర్పడిందా అన్న విధంగా దాడులు నిర్వహిస్తోంది. అర్హత లేకుండా వైద్యం చేయడాన్ని ఎవ్వరూ ఆమోదించరు. కానీ అదే ఆర్ఎంపీల నీడలో అనేక ఆసుపత్రులు నడుస్తున్నాయంటే అతిశయోక్తికాదు. ఇలా చేస్తున్నందువల్లే రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులు రోగులతో రోగాలతో కళకళలాడుతున్నాయి. చిన్న రోగాలకు కూడా పెద్ద వైద్యం చేస్తూ పేద రోగులను పీల్చి పిప్పిచేస్తున్న పరిస్థితి నెలకొంది. మరి ఇలాంటి సంఘటనలపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఎవరికీ అంతుబట్టడం లేదు.

ఆస్పత్రులన్నీ ఆర్ఎంపీల మయం…
రాష్ట్రంలో వేలాది ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ఆయా ఆస్పత్రులు రోగులను తీసుకొచ్చే బాధ్యతను ఆర్ఎంపీలకు అప్పగిస్తుంటాయి. జిల్లా స్థాయిలో ఉండే ఆసుపత్రులన్నీ ఆర్ఎంపీల నీడన బతుకుతున్నాయి. ఒకప్పుడు ఆసుపత్రి, డాక్టర్లను చూసి తమకు నమ్మకమైన చోటికి రోగులు వెళ్లేవారు. ఇప్పుడు అలా లేదు. ప్రతి గ్రామంలో సరాసరి ముగ్గురు నలుగురు ఆర్ఎంపీలు ఉంటున్నారు. ఆ గ్రామాల్లో ప్రతి కుటుంబంపై వారికి పట్టు ఉంటుంది.

ఆర్ఎంపీ అంటే గ్రామాల్లోని ప్రజలకు కూడా ఎంతో కొంత నమ్మకం ఉంటుంది. అలాంటి సంబంధాలను వాళ్లు కొనసాగిస్తారు. ఇక ఆసుపత్రి వర్గాలు పీఆర్వో వ్యవస్థలను ఏర్పాటు చేస్తాయి. ఆ పీఆర్వోలు ఆర్ఎంపీలతో మాట్లాడుకుని రోగులను తెస్తారు. రిఫర్ చేసినందుకు రోగికి వేసిన బిల్లులో 30 నుంచి 40 శాతం వరకు ఆర్ఎంపీకి కమీషన్ ఇస్తుంటారు. ఇలా డాక్టర్, ఆర్ఎంపీల మధ్య డబ్బు సంబంధాలు కొనసాగుతాయి. రోగికి అవసరం లేకపోయినప్పటికీ పరీక్షలు చేయించడం, అనవసర శస్త్ర చికిత్సలు చేయడం ద్వారా డాక్టర్లు అనైతిక చర్యలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా వెలుగు చూశాయి. డబ్బు కోసం గడ్డి తినే డాక్టర్లు చాలామంది ఉన్నారు.

ఆర్ఎంపీలను ప్రోత్సహిస్తున్నది ఎవరు?
ఆర్ఎంపీ వ్యవస్థ వల్ల గ్రామాల్లో వైద్యం వికటిస్తున్న సంఘటనలు జరుగుతున్నాయని మెడికల్ కౌన్సిల్ గగ్గోలు పెడుతుంది. ఆర్ఎంపీ వ్యవస్థను ధ్వంసం చేయాలని కంకణం కట్టుకుంది. అయితే జిల్లాల్లో ఉన్న పరిస్థితులను చూస్తే ఆర్ఎంపీల వ్యవస్థ ఎవరి వల్ల బతుకుతుంది? ఆర్ఎంపీలను ప్రోత్సహిస్తున్నది ఎవరు? ప్రజలా? డాక్టర్లా? ఆర్ఎంపీలపై ఆధారపడే ఆసుపత్రులు అనర్హులైనవారిని ప్రోత్సహించడమే అవుతుంది కదా.

ఆర్ఎంపీ వ్యవస్థను ప్రోత్సహించేది వాళ్లే… దాని ధ్వంసం చేయాలని చెప్పేది కూడా వాళ్లే కావడం విడ్డూరం. ఒక పెద్ద డాక్టర్ వద్దకు రోగిని రిఫర్ చేసేటువంటి పరిస్థితి ఉందంటే… సహజంగా అటువంటి ఆర్ఎంపీపై ప్రజల్లో అభిమానమే ఉంటుంది. అంతేకాదు పల్లె దవఖానాల్లోని డాక్టర్ల కంటే ఆర్ఎంపీలే ఉన్నత స్థాయి డాక్టర్ల వద్ద పరపతి కలిగి ఉండటం విశేషం. అందువల్ల ఆర్ఎంపీ వ్యవస్థ వర్ధిల్లుతున్నదంటే దానికి ప్రధాన కారణం డాక్టర్లే. అంతేకాదు గ్రామాలు మండలాల్లో ఆర్ఎంపీలే రాజకీయ పలుకుబడి కలిగి ఉంటున్నారు. ఇలా ఆర్ఎంపీ వ్యవస్థ పాతుకుపోయి ఉంది. జిల్లాల్లో ఆసుపత్రులు, రాజకీయ నాయకులు ఆర్ఎంపీల మీద ఆధారపడి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎంపీలను ప్రోత్సహిస్తున్న… తప్పుడు వైద్యం చేస్తున్న ఆసుపత్రులు, డాక్టర్లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చర్యలు తీసుకున్నప్పుడే పరిస్థితి చక్కదిద్దినట్లు అవుతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *