- ఆయిల్ ఫెడ్ లో సీనియర్లకు వేధింపులు
- జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి పవర్ లెస్
- బాలకృష్ణ సస్పెన్షన్ ఎత్తివేసేందుకు నిరాకరణ
- మంత్రి తుమ్మల చెప్పినప్పటికీ ఫైల్ పక్కన
- వ్యవసాయశాఖ మంత్రి మాటకే విలువ లేదా?
- కొందరి చేతుల్లోకి వెళ్లిన కార్పొరేషన్
- ముగ్గురు వ్యక్తుల గుప్పిట్లో ఆయిల్ ఫెడ్
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ ఆయిల్ ఫెడ్ ప్రధాన కార్యాలయంలో కీలక స్థాయిలో ఉన్న జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి అధికారాలకు కత్తెర వేశారు. కొన్ని నెలల్లో ఉద్యోగ విరమణ ఉండటంతో ఆయనను డమ్మీ చేయడం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అంతేకాదు ఆయన హోదాకు తగిన పోస్ట్ లేనటువంటి నర్మెట్ట ఫ్యాక్టరీకి బదిలీ చేయడం… దీనిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆదేశాలను నిలిపివేయడం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనను పక్కన పెట్టినట్లు సమాచారం. దీనిపై సుధాకర్ రెడ్డి తన సన్నిహితుల వద్ద గోడు వెళ్ళబోసుకున్నారు. ఆయన వచ్చే ఏడాది ప్రారంభంలోనే రిటైర్ కానున్నారు. ఇప్పటి నుంచే ఆయన తర్వాత వచ్చే ఒక అధికారి సుధాకర్ రెడ్డిని చులకన చేసి చూస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
సుధాకర్ రెడ్డి మాట ఎవరూ వినకుండా ఆ అధికారి చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇలా ఆయిల్ ఫెడ్ లో సుధాకర్ రెడ్డిని టార్గెట్ చేశారన్న విమర్శలు ఉన్నాయి. రిటైర్మెంట్ టైంలో టార్గెట్ చేయడంపై ఆయన మనోవేదనకు గురవుతున్నారు. కాబోయే జనరల్ మేనేజర్ అంటూ చెప్పుకుంటున్న అధికారి సంగతి తేల్చాలని యోచిస్తున్నట్టు తెలిసింది. అతని అవినీతి అక్రమాలను బయట పెట్టడం… నర్మెట్ట వ్యవహారంలో జరుగుతున్న బినామీ వ్యవహారాలను మీడియాకు వెల్లడించడం… వాటన్నింటిపై ప్రభుత్వంలో చార్జిషీట్ వేయించడం… ఇలా ఎలాగైనా అతన్ని అడ్డుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్లేలా స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయిల్ ఫెడ్ లో సీనియర్ అధికారుల మధ్య అగాధం నెలకొంది.
బాలకృష్ణ పరిస్థితి ఘోరం...
సస్పెండ్ లో ఉన్న మేనేజర్ బాలకృష్ణ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మొక్కల వ్యవహారంలో తనను అకారణంగా ఇరికించారని ఆయన గగ్గోలు పెడుతున్నారు. తన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతున్నారు. కానీ ఆయన గోడును ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వద్ద కూడా తన పరిస్థితిని విన్నవించుకున్నారు. మంత్రి సానుకూలంగా స్పందించి ఫైల్ మూమెంట్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. కానీ ఆయిల్ ఫెడ్ లో ఉన్న కొందరు అధికారులు, ఇతర కీలక వ్యక్తులు ఆ ఫైల్ ను అడ్డుకుంటున్నట్లు తెలిసింది.
సాంకేతిక కారణాలు చూపించి ఆపేసినట్లు బాలకృష్ణ సన్నిహితులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాలకృష్ణ సస్పెన్షన్ ను రద్దు చేయకూడదని ఫైరవీలు కూడా జరుగుతున్నాయి. ఏకంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాటకి ఆయిల్ ఫెడ్ లో విలువ లేకుండా పోయిందన్న చర్చ జరుగుతుంది. అంతేకాదు మంత్రి మాట కాదని శంకరయ్యను ఎండీగా తీసుకురావడం పట్ల కూడా తుమ్మల అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. బాలకృష్ణ సస్పెన్షన్ ఎత్తివేయడం వల్ల కొందరి పీఠాలు కదిలే ప్రమాదం నెలకొందని అంటున్నారు. దీంతో బాలకృష్ణకు అడ్డుతగులుతున్నట్టు తెలిసింది. తమ ఆధిపత్యం కోసం తనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముగ్గురి గుప్పిట్లో కార్పొరేషన్…
చైర్మన్, ఎండీ తర్వాత స్థాయుల్లో ఉన్న ముగ్గురు అధికారులు ఆయిల్ ఫెడ్ లో చక్రం తిప్పుతున్నట్టు ఒక సీనియర్ అధికారి తెలిపారు. మేనేజర్లు తిరుమలేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, డిప్యూటీ మేనేజర్ ప్రవీణ్ రెడ్డి సంస్థను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్టు చెప్తున్నారు. వారు ఏం చెప్తే కార్పొరేషన్ లో అదే జరుగుతుంది. నర్మెట్ట ఫ్యాక్టరీ విషయంలో ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ సంబంధిత వ్యవహారాలు చూస్తున్న శ్రీకాంత్ రెడ్డిని పల్లెత్తు మాట అనడం లేదు.
ఇక తిరుమలేశ్వర్ రెడ్డి సీనియర్ కావడం… ఇప్పటివరకు ఫైనాన్స్ వ్యవహారాలు చూడడంతో ఆయన హవా నడుస్తోంది. తన చెప్పు చేతుల్లో ఉండే వ్యక్తిని ఆడిటర్ గా పెట్టుకొని మొత్తం వ్యవహారం నడిపిస్తున్నట్టు ఆయనపై విమర్శలు ఉన్నాయి. ఇక ప్రవీణ్ రెడ్డి చైర్మన్ కు సన్నిహితుడిగా ప్రచారం పొందారు. దీంతో ఆయన హవా కూడా నడుస్తుంది. ఇలా ఈ ముగ్గురు అధికారులు ఆయిల్ ఫెడ్ ను పూర్తిగా కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు. దీంతో కీలకమైన జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి డమ్మీ అయిపోయారు. కీలక పోస్టులోకి రావాల్సిన బాలకృష్ణ సస్పెండ్ లోనే ఉండిపోయారు.