సిగిరెట్టు ఎంతో సమోసా అంతే – కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆదేశాలు

  • జిలేబీ… సమోసా… పకోడీలకూ హెచ్చరికలు
  • నాగపూర్ ఎయిమ్స్ లో పైలెట్ ప్రాజెక్టు షురూ
  • ఊబకాయం పెరుగుతున్నందునే ఈ నిర్ణయం
  • బర్గర్, పిజ్జా, కేకులపై ఆంక్షలు పెట్టలేదేంటి?
  • పలువురు ఆహార నిపుణుల నిలదీత

సహనం వందే, హైదరాబాద్:
భారతదేశంలో స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి జీవనశైలి వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సమోసా , జిలేబీ, పకోడా, వడపావ్, ఛాయ్ బిస్కెట్లు వంటి అధిక కొవ్వు, చక్కెర కలిగిన ఆహార పదార్థాలపై సిగరెట్ల తరహా ఆరోగ్య హెచ్చరికలు ప్రదర్శించనుంది. ప్రజల్లో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి అవగాహన కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం. ఈ వినూత్న ప్రచార కార్యక్రమం నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైంది. అక్కడి క్యాంపస్‌లోని క్యాంటీన్లు, బహిరంగ భోజన ప్రదేశాలలో ఆహార కౌంటర్ల పక్కన స్పష్టమైన హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బోర్డులు సమోసా, జిలేబీ వంటి ఆహార పదార్థాలలో ఉండే అధిక నూనె, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్‌ల స్థాయిలను ప్రదర్శిస్తాయి. ఇవి జీవనశైలి వ్యాధులతో ఎలా సంబంధం కలిగి ఉన్నాయో వివరిస్తాయి.

2050 నాటికి 40 కోట్ల మంది ఊబకాయులే…
2050 నాటికి సుమారు 44 కోట్ల మంది భారతీయులు అధిక బరువుతో బాధపడే అవకాశం ఉందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన గ్లోబల్ అనాలిసిస్ అంచనా వేసింది. తరచుగా డీప్-ఫ్రైడ్, చక్కెర పానీయాలను తీసుకోవడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. కేంద్ర నిర్ణయంతో ఎయిమ్స్ నాగ్‌పూర్‌లో సందర్శకులు ఇప్పుడు ఆహార స్టాల్స్ పక్కన హెచ్చరిక పోస్టర్లను చూస్తారు. వీటిలో చక్కెర, కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ గురించి స్పష్టమైన సమాచారం ఉంటుంది. అలాగే తరచుగా వీటిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలను వివరించే సందేశాలు కూడా ఉంటాయి. ఈ హెచ్చరికలు సిగరెట్ ప్యాకేజింగ్‌పై ఉండే హెచ్చరికల మాదిరిగానే ప్రత్యక్షంగా, ప్రభావవంతంగా ఉండేలా రూపొందించబడ్డాయి.

సంప్రదాయ ఆహారాలపై నిషేధమా?
అయితే ఇది సంప్రదాయ ఆహారాలపై నిషేధం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సమోసాలు, జిలేబీలు ఇప్పటికీ అందుబాటులో ఉంటాయి. కానీ వినియోగదారులు తాము ఏమి తింటున్నారో తెలుసుకుంటారు. పరిమితిని ప్రోత్సహించడమే లక్ష్యం తప్ప, ఆంక్షలు విధించడం కాదని అంటున్నారు. నిషేధం విధించడం లాంటిదేనన్న విమర్శల నేపథ్యంలో అత్యంత ప్రమాదకరమైన బర్గర్లు, పిజ్జాలు, కేకులు, ఇతరత్రా ఐస్ క్రీములు వంటి వాటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. మన దేశ సంప్రదాయబద్ధమైనటువంటి ఆహారాల కంటే ఇవి మరింత ప్రమాదకరమని ఆహార నిపుణులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా కేఎఫ్ సీ వంటి వాటిని పరోక్షంగా ప్రోత్సహించినట్లేనని అభిప్రాయపడుతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *