- రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన వేలాదిమంది
- మద్దతు పలికిన ఆర్.కృష్ణయ్య, ఈటెల
- ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు డిమాండ్
- లేకుంటే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరిక
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో ఉద్యోగ భద్రత, సమాన వేతనం కోసం పోరాడుతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గళం శనివారం హైదరాబాదులోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మార్మోగింది. రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహా ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది ఉద్యోగులు తరలివచ్చి తమ ఐక్యతను చాటారు. ఉద్యోగుల డిమాండ్లకు మద్దతుగా పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

సమాన వేతనం రాజ్యాంగ హక్కు: కృష్ణయ్య
మహా ధర్నాలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ… ఔట్ సోర్సింగ్ విధానం ఒక అన్యాయమైన వ్యవస్థ అని, దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అనేది ఉద్యోగుల రాజ్యాంగ హక్కు అని ఆయన అన్నారు. పార్లమెంటులో కూడా ఈ పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. లోక్‌సభ సభ్యుడు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ… చరిత్రలో హక్కుల కోసం పోరాడిన ప్రతి ఉద్యమం విజయం సాధించిందని గుర్తు చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సహకరించకపోతే ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు సాగడం కష్టమని, బీజేపీ తరపున ఈ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: పులి
మహా ధర్నాలో తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య మాట్లాడుతూ… గిగ్ వర్కర్స్‌కు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విధంగానే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలోపే ఈ డిమాండ్ ను పరిష్కరించకపోతే తమ బలాన్ని ఎన్నికల్లో చూపిస్తామని హెచ్చరించారు. ఈ డిమాండ్లను జాతీయ కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.

పలువురి సంఘీభావం…
ఈ ధర్నాకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, తెలంగాణ ఉద్యమకారులు పృథ్విరాజ్, క్రాంతి, మీడియా ప్రతినిధులు శ్రీనివాస్, శివారెడ్డి సంఘీభావం తెలిపారు. సంఘం ప్రధాన కార్యదర్శులు దోయిపడి శ్రీధర్, దుర్గం శ్రీనివాస్, కోశాధికారులు సంతోష్, జగదీష్, సభ్యులు గోవర్ధన్, రాజమహమ్మద్, బాలకృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, మనోహర్ నాయక్, పద్మ, జ్యోతి, రాజేష్ పాల్గొన్నారు.