- ఎన్‌ఎంసీ అవినీతి కుంభకోణంతో సంబంధం
- ప్రైవేట్ మెడికల్ కాలేజీలతో బేరసారాలు
- సీక్రెట్ నెట్ వర్క్ తో తనిఖీ సమాచారం లీక్
- సీబీఐ తనను సాక్షిగా పిలువవచ్చన్న రజినీ
సహనం వందే, హైదరాబాద్:
నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) నిబంధనలను ఉల్లంఘించి పలు వైద్య కళాశాలలకు అనుమతులు మంజూరు చేయడంలో జరిగిన భారీ అవినీతి కుంభకోణంలో మరో కీలక పేరు వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లోని మోడరన్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్, పేట్లబుర్జ్ మాజీ సూపరింటెండెంట్ రజినీరెడ్డి ఈ ఆరోపణల జాబితాలో చేర్చారు.
తనిఖీ బృందంలో పాత్ర…
ఎన్‌ఎంసీ తనిఖీ బృందంలో మాజీ సూపరింటెండెంట్ సభ్యులుగా ఉన్నారు. గత నెల 30న ఛత్తీస్‌గఢ్‌లోని శ్రీ రావత్‌పురా సర్కార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఎస్‌ఆర్‌ఎస్‌ఐఎంఎస్‌ఆర్)ను సందర్శించిన బృందంలో రజినీరెడ్డి ఒకరు. అదే రోజు సీబీఐ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, తనిఖీ ప్రక్రియలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాన్ని బయటపెట్టింది. ఈ ఘటనల నేపథ్యంలో ఆమెను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో 13వ నిందితురాలిగా చేర్చారు.
ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో పిటిషన్
ఈ ఆరోపణల పరంపరలో ఆమె ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తనను సాక్షిగా పిలిచే అవకాశం ఉందని ‘న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ పేపర్ కు తెలిపారు. ‘తనిఖీ సమయంలో లంచాలకు సంబంధించి సీబీఐ ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసింది. దర్యాప్తులో భాగంగా ప్రశ్నించారు. రాయపూర్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. నన్ను సాక్షిగా పిలవవచ్చని సీబీఐ తెలిపింద’న్నారు. సీబీఐ సమాచారం ప్రకారం… కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఎనిమిది మంది అధికారులు, ఒక నేషనల్ హెల్త్ అథారిటీ అధికారి, ఎన్‌ఎంసీ తనిఖీ బృందంలోని ఐదుగురు వైద్యులు సహా మొత్తం 34 మందిపై ఆరోపణలు నమోదయ్యాయి. ప్రైవేట్ వైద్య కళాశాలలతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అవినీతి వలయం… రహస్య నెట్‌వర్క్
ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఎనిమిది మంది అధికారులు ఒక రహస్య నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వీరు తనిఖీ షెడ్యూల్స్, బృందం సభ్యుల వివరాలను కళాశాలల మధ్యవర్తులకు లీక్ చేశారు. ఈ సమాచారంతో కళాశాలలు తనిఖీలకు సిద్ధమయ్యాయి. నకిలీ ఫ్యాకల్టీని నియమించడం, డమ్మీ రోగులను తీసుకుని రావడం, బయోమెట్రిక్ రికార్డులను తారుమారు చేయడం వంటి మోసపూరిత పద్ధతులు అనుసరించినట్లు సీబీఐ గుర్తించింది. ఈ కుంభకోణం దేశ వైద్య విద్యా వ్యవస్థలోని లోపాలను, అవినీతిని స్పష్టంగా బహిర్గతం చేస్తోంది.