- 12వ తేదీన ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, హరీష్ రావు రాక
- బీసీ నాయకులు ఆర్.కృష్ణయ్య, జాజుల
- సమాన పనికి సమాన వేతనానికి డిమాండ్
సహనం వందే, హైదరాబాద్:
తమ సమస్యల పరిష్కారం కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గళం విప్పుతున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సకాలంలో వేతనాలు ఇవ్వాలని, ఏజెన్సీలు కాకుండా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పోరాట బాట పట్టారు. ఈ మేరకు శనివారం (12వ తేదీన) హైదరాబాదులోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల నుంచి వందలాదిమంది ఈ ధర్నాకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ నెల రోజులుగా కృషి చేస్తుంది. అనేకమంది ప్రముఖుల దృష్టికి తమ సమస్యలను విన్నవించారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఇప్పుడు ధర్నాకు ఏర్పాట్లు చేసుకున్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల డిమాండ్లు…
తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వరంగ శాఖలు, సంస్థలలో పనిచేస్తున్న సుమారు లక్షన్నర మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించి న్యాయం చేయాలని రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మొదటి తేదీన జీతాలు ఇస్తున్నారు. అక్కడ అందరికీ

ఉద్యోగ భద్రత కల్పించాలని, కానీ తెలంగాణలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని జేఏసీ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. ఎందరో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను బలి తీసుకుంటున్న ఏజెన్సీ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వాలు, ఏజెన్సీలు నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా పీఎఫ్, ఈఎస్‌ఐ వంటివి కూడా ఉద్యోగుల ఖాతాలో జమ చేయకుండా వేధిస్తున్నాయని విమర్శించింది. ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు అందించాలని తెలంగాణ స్టేట్ ఔట్ సోర్సింగ్ జేఏసీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య, కోశాధికారి మునిగంటి జగదీష్ డిమాండ్ చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం జరిగే ధర్నాను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.