- ఈ పంటను పక్కనపెట్టిన విత్తన చట్టం కమిటీ
- రైతులకు పరిహారం అందకుండా కుట్రలు
- కంపెనీలతో కొందరు అధికారుల కుమ్మక్కు
- ఆయిల్ పామ్ పంటకు నష్టపరిహారం ఎక్కడ?
- లక్షల రూపాయలు నష్టపోతున్న అన్నదాతలు
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో ఆయిల్ పామ్ రైతులకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పంటను ప్రోత్సహించాలని ప్రయత్నాలు చేస్తున్నా… ఆ మేరకు రైతులకు భరోసా కల్పించే విషయంలో ఆయిల్ ఫెడ్ అధికారులు విఫలం అవుతున్నారు. ఇతర పంటలకు బదులు లక్షలాది ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయించాలని చెబుతూనే… మరోవైపు ఆ పంటకు అవసరమైన రక్షణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం అవుతున్నారు. ఈ పంటకు నష్టం జరిగితే పరిహారం ఉంటుందా? అన్న రైతుల సందేహాలను అధికారులు నివృత్తి చేయలేకపోతున్నారు. అంతేకాదు కొత్తగా తెలంగాణలో తీసుకురాబోతున్న విత్తన చట్టంలో ఆయిల్ పామ్ పంట ఊసే లేదని కమిటీ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. ఇలాగైతే నష్టపరిహారం వచ్చే అవకాశం ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, సోయాబీన్ తదితర పంటలను వదిలి రైతులు ఆయిల్ పామ్ పంట వైపు రావాల్సిన అవసరం ఏముంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.



ఆయిల్ పామ్‌ను చేర్చకుండా కుట్రలు…
తెలంగాణలో విత్తన చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకోసం ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీలో వ్యవసాయ నిపుణులు ఉన్నారు. ఏ పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి? విత్తనం వల్ల జరిగిన నష్టానికి కంపెనీల నుంచి పరిహారం ఇప్పించడం దీని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. అయితే ఈ కమిటీ అన్ని పంటల గురించి, వాటికి రావాల్సిన పరిహారం గురించి చర్చించింది. కానీ ఆయిల్ పామ్ పంటపై ఇంతవరకు ఎలాంటి చర్చ జరగలేదని ఆ కమిటీ సభ్యులు ఒకరు తెలిపారు. అంతేకాదు ఆ కమిటీలో అత్యంత కీలకమైన ఆయిల్ పామ్ సంబంధిత వ్యవహారాలు చూసే ఆయిల్ ఫెడ్ అధికారులు ఎవరూ లేకపోవడం విడ్డూరంగా ఉంది. కొత్తగా తీసుకురాబోతున్న విత్తన చట్టంలో ఆయిల్ పామ్‌ను చేర్చకుండా అధికారులు, కొన్ని ప్రైవేటు కంపెనీలు కుట్రపూరితంగా అడ్డుపడుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆయిల్ ఫెడ్ అధికారులు కొందరు ఆ కంపెనీల్లో బినామీలుగా ఉండటమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఆయిల్ పామ్ కంపెనీలతో రాసుకుని పూసుకుని తిరిగే కీలక స్థానంలోకి రాబోయే అధికారి ఒకరు… ఏడెనిమిది నెలల్లో రిటైర్డ్ కాబోతున్న అధికారుల్లో ఒకరు… ఆయిల్ పామ్ మొక్కలను తీసుకువచ్చి విమర్శలకు గురైన ఒక అధికారి… వీళ్లంతా అందుకు అడ్డుపడుతున్నట్టు తెలుస్తుంది. అక్రమాలకు పాల్పడిన వారు ఇప్పుడు ఈ కార్పొరేషన్ లో కీలక స్థానాల్లో ఉండటంతో విత్తన చట్టంలో ఆయిల్ పామ్ పంటను చేర్చకుండా కుట్రలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
జన్యుపర లోపాలతో ఆయిల్ పామ్ ఢమాల్…
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నాసిరకం మొలకలతో రైతులు ఆరేడేళ్లు కష్టపడి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా చివరకు నష్టమే మిగులుతుంది. తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 90,000 ఎకరాల్లో విస్తరించిన ఆయిల్ పామ్ తోటలు రైతులకు శాపంగా పరిణమిస్తోంది. 1993 నుంచి 2015 వరకు తెలంగాణ ఆయిల్ ఫెడ్ నాణ్యమైన మొలకలను సరఫరా చేసినప్పటికీ, 2016 తర్వాత పరిస్థితి దిగజారింది. ఆయిల్ ఫెడ్ నర్సరీల నుంచి సరఫరా చేసిన మొలకల్లో 20 నుంచి 50 శాతం జన్యులోపాలతో ఉన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత గెలలు రాకపోవడంతో రైతులు నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఈ పంటను లక్షలాది ఎకరాల్లో సాగు చేసే కార్యక్రమం జరుగుతుంది. మున్ముందు ఆయా జిల్లాలకు చెందిన రైతులు కూడా ఇటువంటి సమస్యను ఎదుర్కొనే ప్రమాదం నెలకొందని రైతు నేతలు అంటున్నారు.
ఆయిల్ ఫామ్ రైతుల గోడు వినేదెవరు?
తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఢిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిశారు. నష్టపోయిన తోటలను శాస్త్రవేత్తలతో పరిశీలించి, నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి 12 మంది రైతుల తోటలను పరిశీలించి జన్యుపర లోపాలను గుర్తించారు. ఆయిల్ ఫెడ్ కోఆపరేటివ్ చట్టం, తెలంగాణ ఆయిల్ పామ్ చట్టం లేదా కన్స్యూమర్ చట్టాల్లో నష్టపరిహారం ఇచ్చే నిబంధనలు లేవని ఆయన తేల్చి చెప్పినట్లు అశ్వారావుపేట ఆయిల్ పామ్ గ్రోయర్స్ అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. కాయని మొక్కలను పీకి, కొత్తవి నాటాలన్న సలహా ఆచరణ సాధ్యం కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద చెట్ల నీడలో కొత్త మొలకలు పెరగడం కష్టమని, మళ్లీ వేసిన తర్వాత కొత్త మొక్కలు కూడా కాయకపోతే రైతుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మొక్కజొన్న, వరి, పత్తి వంటి స్వల్పకాలిక పంటల్లో నకిలీ విత్తనాలకు నష్టపరిహారం ఇప్పిస్తుంటే, ఆయిల్ పామ్ విషయంలో రైతులను రోడ్డున పడేసే విధానం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
విత్తన చట్టంలో ఆయిల్ పామ్ ను చేర్చాలి…
కొత్త విత్తన చట్టంలో ఆయిల్ పామ్ పంటను తప్పనిసరిగా చేర్చాలని, నాసిరకం మొలకల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించే నిబంధనలను రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు.