మెడికోల సస్పెన్షన్లపై ఫైమా ఫైర్ – ఎన్‌ఎంసీకి ఫిర్యాదు

  • చల్మడ కాలేజీపై ఎన్‌ఎంసీకి ఫిర్యాదు
  • ఆ కాలేజీపై చర్యకు డిమాండ్
  • జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ల గోస

సహనం వందే, న్యూఢిల్లీ:
కరీంనగర్‌ చల్మెడ ఆనందరావు ప్రైవేటు మెడికల్ కాలేజీలో స్టైపెండ్ కోసం నిరసన తెలిపిన 64 మంది ఇంటర్న్‌లను సస్పెండ్ చేయడంపై అఖిల భారత వైద్య సంఘాల సమాఖ్య (ఫైమా) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఇంటర్న్‌లకు స్టైపెండ్‌లు చెల్లించకపోవడంపై మండిపడింది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) ఛైర్మన్‌కు ఫైమా లేఖ రాసింది. ఈ సమస్యపై తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది.

స్టైపెండ్ చెల్లింపుల్లో అక్రమాలు…
తెలంగాణలో మొత్తం 23 ప్రైవేట్ వైద్య కళాశాలలు వాటి అనుబంధ ఆసుపత్రులలో ఇంటర్న్‌లు పనిచేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసే ఇంటర్న్‌లకు చెల్లించినట్లే తమ ఇంటర్న్‌లకు కూడా స్టైపెండ్‌లు చెల్లించాలనే నిబంధనను ప్రైవేట్ మెడికల్ కాలేజీలు విస్మరిస్తున్నాయని ఫైమా పేర్కొంది. కొన్ని కళాశాలలు ఇంటర్న్‌లకు నెలకు కేవలం 2,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నాయని తెలిపింది. అనేక కళాశాలలు అసలు స్టైపెండ్‌ చెల్లించడం లేదని, ఇది ఎన్‌ఎంసీ ఆదేశాలకు విరుద్ధమని ఫైమా అభిప్రాయపడింది. తమ సమస్యల పరిష్కారానికి నిరసన తెలిపిన ఇంటర్న్‌లను స్పెండ్ చేయడం, సర్టిఫికెట్లు ఇవ్వకుండా బెదిరించుతున్నారని, ఇది వారి భవిష్యత్తుతో ఆటాడుకోవడమేనని ఫైమా ఆవేదన వ్యక్తం చేసింది.

చల్మడ కాలేజీ అణచివేత ధోరణి…
కరీంనగర్‌లోని చల్మడ ఆనందరావు మెడికల్ కాలేజీలో జరిగిన సంఘటన అత్యంత ఆందోళనకరమైందని ఫైమా లేఖలో పేర్కొంది. ఇంటర్న్‌లు తమ స్టైపెండ్ కోసం నిరసన తెలుపుతుండగా, యాజమాన్యం పోలీసులను పిలిపించిందని, వారు విద్యార్థుల పట్ల దురుసుగా, దూకుడుగా ప్రవర్తించారని తెలిపింది. ఇంటర్న్‌లను బెదిరించి, అసభ్యకరంగా మాట్లాడి, క్షమాపణ లేఖలు రాయమని, స్వీయ-ప్రకటన వీడియోలను రికార్డ్ చేయమని బలవంతం చేశారని ఫైమా ఆరోపించింది.

చల్మడపై చర్య తీసుకోవాలి…
ఈ పరిణామాలపై తక్షణమే జోక్యం చేసుకుని నిబంధనల ప్రకారం స్టైపెండ్‌ చెల్లింపు జరిగేలా తెలంగాణలోని ప్రైవేట్ వైద్య కళాశాలలను ఆదేశించాలని కోరింది. చల్మడ మెడికల్ కాలేజీలో జరిగిన సంఘటనలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. స్టైపెండ్ చెల్లింపులపై పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఫైమా డిమాండ్ చేసింది. వందలాది మంది యువ వైద్యుల భవిష్యత్తు, గౌరవం ప్రమాదంలో ఉన్నాయని ఫైమా జాతీయ ఛైర్మన్ డాక్టర్ మనీష్ జాంగ్రా ఆందోళన వ్యక్తం చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *