వైద్య విద్యార్థులకు బానిస సంకెళ్లు…భవిష్యత్తు అతలాకుతలం

  • మాఫియా చేతుల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు
  • సమస్యలు పరిష్కరించమంటే దాడులు
  • స్టైఫెండ్ అడిగినందుకు సస్పెండ్ చేస్తారా?
  • చల్మడ ఆనందరావు మెడికల్ కాలేజీ నిర్వాకం
  • అబ్బాయిలు, అమ్మాయిలు మాట్లాడితే వేటే
  • సీసీటీవీ కెమెరాల్లో పర్యవేక్షించి వార్నింగ్
  • మహావీర్ మెడికల్ కాలేజీలోనూ అదే పరిస్థితి
  • చదువు చెప్పని కాలేజీలు అవసరమా?
  • గుర్తింపు రద్దు కోరుతున్న వైద్య విద్యార్థులు
  • ఎన్ఎంసీని కొనేస్తున్న యాజమాన్యాలు
  • లంచాలకు మరిగిపోయిన తనిఖీ బృందాలు

సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో అనేక ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మాఫియా కేంద్రాలుగా మారిపోయాయి. వాటి యాజమాన్యాలు అనేకమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేదా రాజకీయ నాయకులు కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రియల్ ఎస్టేట్, రాజకీయం వంటి రంగాల్లో ఉన్నటువంటి ఈ పెద్దలు బ్లాక్ మనీతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. వాళ్లకు వైద్య విద్య వ్యాపారమే తప్ప… అది సేవకు అంకితమైన వృత్తిగా భావించడం లేదు. తక్కువ మౌలిక సదుపాయాలు కల్పించి… ఎక్కువ ఫీజులు వసూలు చేసి అధిక లాభాలు ఎలా గడించాలన్నదే వాళ్ళ టార్గెట్. మెడికల్ విద్యార్థులు అంటే వారికి కేవలం ఏటీఎం మిషన్ లాంటివారే. అందుకే మేనేజ్మెంట్ కోటా సీట్లు సాధించిన విద్యార్థులకు మాత్రమే యాజమాన్యాలు విలువ ఇస్తాయి. కన్వీనర్ కోటా సీట్లు పొందిన విద్యార్థులంటే వాళ్లకు చులకన. కోట్లు పెడితేనే విలువ. లేకుంటే చులకన. మొత్తంగా చూస్తే ఎవరైనా వాళ్ల కనుసనల్లోనే ఉండాలి.‌ తమ హక్కుల గురించి డిమాండ్ చేస్తే ఎవరినీ వదిలిపెట్టరు. ఇది ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాల మాఫియా పోకడ. తమ కాలేజీలో చదువుతున్నారు కాబట్టి వాళ్లను బానిసల కంటే హీనంగా చూస్తున్నారు. తాజాగా కరీంనగర్ లోని చల్మడ ఆనందరావు మెడికల్ కాలేజీలో జరిగిన సంఘటన అందుకు నిదర్శనం. ఈ విషయాన్ని ‘సహనం వందే’ https://sahanamvande.com/?p=5562 డిజిటల్ పేపర్లో ప్రచురించింది.

సీసీటీవీ కెమెరాల్లో పర్యవేక్షించి వార్నింగ్…
కరీంనగర్ లోని చల్మడ ఆనందరావు మెడికల్ కాలేజీ యాజమాన్యం తీరు అత్యంత విమర్శలకు దారితీసింది. స్టైఫెండ్ ఇవ్వాలని కోరినందుకు ఏకంగా 64 మంది ఎంబీబీఎస్ హౌసర్జన్లను సస్పెండ్ చేయడంపై మెడికోలు మండిపడుతున్నారు. సమస్యలు పరిష్కరించమంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు నిలదీస్తున్నారు. అంతేకాదు చదువు పూర్తయిన వారిలో కొందరిని టార్గెట్ చేసి సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని విద్యార్థులు విమర్శిస్తున్నారు. అంతే కాదు క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారు. అడుగడుగున సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాన్ని మనం కాదనలేం. కానీ ప్రతి చిన్న కదలికను తప్పుపడుతున్నట్టు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కాలేజీలో బాలురు, బాలికలు కలిసి నడిచినా… ఒకరినొకరు మాట్లాడినా సీసీటీవీ ద్వారా పరిశీలించి వారిని పిలిపించి వార్నింగ్ ఇస్తారు. ఆడ మగ విద్యార్థులు మాట్లాడుకోకూడదని అక్కడ నిబంధన ఉన్నట్లు ఒక విద్యార్థి పేర్కొన్నారు. క్లాస్ రూమ్ లో కూడా అటు ఇటు తలకాయ తిప్పకుండా ఉండాల్సిందేనని… బయటకు వెళ్ళేటప్పుడు తలదించుకుని వెళ్లాల్సిందేనని అంటున్నారు. తాము బానిస బతుకు అనుభవిస్తున్నామని… వేధింపులకు గురవుతున్నామని ఒక విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేశారు.

మహావీర్ మెడికల్ కాలేజీలోనూ అదే పరిస్థితి…
ఇక వికారాబాద్ లో ఉన్న మహావీర్ మెడికల్ కాలేజీలో కూడా దాదాపు అటువంటి పరిస్థితే ఉంది.‌ ఇక్కడ స్టైఫండ్ కోసం విద్యార్థులు దాదాపు పది రోజులు నిరసన తెలిపారు. అయినా ఇప్పటికీ పరిష్కారం కాలేదు. బ్యాంకు అకౌంట్స్ తెరిపిస్తామని… అందుకోసం వారం రోజులు ఆగాలని… ఆ తర్వాత ఎంతో కొంత స్టైఫెండ్ ఇస్తామని మహావీర్ మెడికల్ కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు నచ్చజెప్పింది. ఎంతోకొంత అంటే ఎంత? స్టైఫెండ్ విద్యార్థుల హక్కు కాదా? స్టైఫెండ్ అనేది యాజమాన్యాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిందా? అన్న ప్రశ్నలను మెడికోలు సంధిస్తున్నారు.

లంచాలకు మరిగిన ఎన్ఎంసీ బృందాలు…
మహావీర్ మెడికల్ కాలేజీ సీట్ల సంఖ్యకు అనుగుణంగా రోగులు వచ్చే పరిస్థితి లేదు. తనిఖీలు జరిగినప్పుడు ఇక్కడ నకిలీ రోగులు దర్శనమిస్తారు. ఇటీవల జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీలు ఉంటాయని ముందే సమాచారం వచ్చింది. దీంతో లారీల్లో నకిలీ రోగులను పట్టుకొచ్చారు. వారికి రోజుకు 2 వేల రూపాయల చొప్పున కూలి… టిఫిన్ భోజనం వసతి కల్పించారు. ఈ విషయాన్ని ‘సహనం వందే’ https://sahanamvande.com/?p=5078, ‘ ఆర్టికల్ టుడే’ https://articletoday.in/mahaveer-medical-college-inspection-halted/ డిజిటల్ పేపర్లు బట్టబయలు చేయడంతో ఎన్ఎంసీ అధికారులు వెనక్కు తగ్గారు. తర్వాత తనిఖీలు చేస్తామని ఒకరినొకరు కూడబలుక్కున్నారు. కాగా మూడేళ్ల క్రితం ఈ కాలేజీలో మౌలిక సదుపాయాలు సరిగా లేవని అడ్మిషన్లను ఎన్ఎంసీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయినా కాలేజీ మేనేజ్మెంట్ తన తీరును మార్చుకోలేదు. డబ్బులు ఇచ్చి తనిఖీలు చేయించుకుని ఎన్ఎంసీ గుర్తింపు పొందుతుంది. అందుకోసం కోట్ల రూపాయలు లంచాలుగా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎన్ఎంసీ ఆధ్వర్యంలోని తనిఖీల బృందం లంచాలకు మరిగినట్లు సీబీఐ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అనేకమంది ఎన్ఎంసీ బృందంలోని డాక్టర్లను లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అందులో తెలంగాణకు చెందిన కొందరు ఉన్నట్లు సమాచారం.

‘ఈ కాలేజీల గుర్తింపు రద్దు చేయండి’
ఇటువంటి కాలేజీలు తెలంగాణలో చాలా ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో రౌడీ రాజ్యం నడుస్తుంది. మూడేళ్ల క్రితం మూడు మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ సరిగా లేదని ఎన్ఎంసీ వాటి అడ్మిషన్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా కాలేజీలకు చెందిన ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేసిన సంగతి అప్పుడు సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ కాలేజీల ఇష్టారాజ్యంపై వైద్య ఆరోగ్యశాఖ నోరు మెదపడం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో రాజకీయ నాయకులు రాసుకుని పూసుకుని తిరుగుతూ తమ జీవితాలను నాశనం చేస్తున్నారని మెడికోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కాలేజీలపై చర్య తీసుకోవాలని… కనీస వసతులు కల్పించలేని కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ ఏమాత్రం పట్టించుకోవడంలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

బానిసల్లా బతుకుతున్నాం: మెడికో విద్యార్థిని
చల్మడ ఆనందరావు మెడికల్ కాలేజీలో వేధింపులు ఎక్కువగా ఉన్నాయని ఆ కాలేజీకి చెందిన ఒక విద్యార్థిని సుస్మిత (పేరు మార్చాం) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ‘సహనం వందే’, ‘ఆర్టికల్ టుడే’ డిజిటల్ పేపర్ల ప్రతినిధితో మాట్లాడారు.‌ కాలేజీ యాజమాన్యం దురుసుగా ప్రవర్తిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఇక్కడ సెక్యూరిటీ గార్డులు కూడా విద్యార్థులపై దుర్భాషలాడుతారని ఆమె అంటున్నారు. కేవలం మేనేజ్‌మెంట్ కోటా విద్యార్థులకు మాత్రమే గౌరవం దక్కుతుందన్నారు. సరైన టీచింగ్ స్టాఫ్, సౌకర్యాలు కూడా లేవు. అంతేకాకుండా మెరిట్ విద్యార్థులైన డాక్టర్లను యాజమాన్యం బానిసల్లా చూస్తోందని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితులు మారాలంటే వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాడాలని… అందుకు అందరూ ఐక్యంగా ఉండాలని ఆమె కోరారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *