- సహజ బ్యాక్టీరియాతో మెరుగైన జీర్ణక్రియ
- భారత సంప్రదాయం… శాస్త్రీయత, సంస్కృతి
- ప్రతి వేలికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
- అమెరికన్ల అవహేళనలు, విమర్శలకు చెక్
సహనం వందే, హైదరాబాద్:
అమెరికాలో సభ్య సమాజం చేతి భోజనం చేయదు. పాశ్చాత్య సంప్రదాయాలను అనుసరించకపోతే, మీ దేశాలకు వెళ్లిపోండి’ అని అమెరికా రిపబ్లికన్ కాంగ్రెస్ మెన్ బ్రాండన్ గిల్ చేసిన వ్యాఖ్యలు భారతదేశాన్ని అవహేళన చేశాయి. న్యూయార్క్ నగర మేయర్ అభ్యర్థి, భారత సంతతికి చెందిన జోహ్రాన్ మామ్దానీ చేతులతో భోజనం చేస్తున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై బ్రాండన్ ఈ విధంగా కామెంట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈ వివాదం చేతులతో భోజనం చేయడం వెనుక ఉన్న శాస్త్రీయ, సాంస్కృతిక అంశాలపై విస్తృత చర్చకు దారితీసింది.

శాస్త్రీయ… ఆయుర్వేద ఆధారాలు
గుల్షన్ పర్వీన్ రాసిన ఒక కథనం ప్రకారం… చేతులతో భోజనం చేయడం వెనుక బలమైన శాస్త్రీయ, ఆయుర్వేద ఆధారాలున్నాయి. మన చేతులలో ఉండే సహజ బ్యాక్టీరియా హానికరమైన సూక్ష్మజీవులను ఎదుర్కొని జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం… ప్రతి వేలికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. బొటనవేలు అగ్ని (ఫైర్), చూపుడు వేలు వాయువు (ఎయిర్), మధ్య వేలు ఆకాశం (స్పేస్), ఉంగరం వేలు భూమి (ఎర్త్), చిటికెన వేలు జలం (వాటర్) ను సూచిస్తాయి. చేతులతో భోజనం చేయడం వల్ల ఈ ఐదు మూలకాలు సమతుల్యం అవుతాయని, తద్వారా శరీర అంతర్గత భాగాలు సమర్థవంతంగా పనిచేస్తాయని నమ్ముతారు.
సాంస్కృతిక సంప్రదాయం కూడా…
చేతులతో భోజనం చేయడం భారతదేశంలోనే కాకుండా దక్షిణాసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లో కూడా ఒక సాధారణ సంప్రదాయం. భారతదేశంలో అన్నం, పప్పు, కూరలను చేతులతో తినడం తరతరాలుగా వస్తున్న ఆచారం. ఫిలిప్పీన్స్‌లో కమయన్ ఫీస్ట్‌లు, ఇథియోపియాలో ఇంజెరా వంటి వంటకాలు, పశ్చిమ ఆఫ్రికాలో ఫుఫు, జోల్లోఫ్ రైస్ వంటివి చేతులతోనే తింటారు. ఈ సంప్రదాయం కేవలం ఆహారం తినడమే కాకుండా సామాజిక, సాంస్కృతిక ఆత్మీయతను కూడా ప్రతిబింబిస్తుంది.
ఇది రేసిజం కాదా?
అమెరికాలో పిజ్జా, టాకోస్, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి అనేక ఆహారాలను చేతులతోనే తింటారు. అయినా మామ్దానీ చేతులతో అన్నం తినడంపై విమర్శలు రావడం విడ్డూరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక ఎక్స్ యూజర్ చిప్స్, టాకోస్, పిజ్జాను ఫోర్క్‌తో తింటారా? ఇది రేసిజం కాదా? అని ప్రశ్నించారు.
కమ్యూనిస్ట్ లునాటిక్ అంటూ ట్రంప్ వ్యాఖ్య
33 ఏళ్ల భారత సంతతి అమెరికన్ జోహ్రాన్ మామ్దానీ న్యూయార్క్ మేయర్ రేసులో డెమోక్రాటిక్ నామినీగా విజయం సాధించారు. ఆయన ముస్లిం, సోషలిస్ట్ అభ్యర్థిగా పాలస్తీనాకు మద్దతుదారుగా ఉండటం రిపబ్లికన్లకు కంటగింపుగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనను కమ్యూనిస్ట్ లునాటిక్ అని విమర్శించారు. మామ్దానీ సామాజిక మాధ్యమాలలో బాలీవుడ్ థీమ్‌తో ప్రచారం చేయడం, యువతను ఆకర్షించే విధానాలు కూడా విమర్శలకు గురయ్యాయి.