పని గంటలు దాటితే హెల్త్ రిమైండర్ – ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

  • వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కు ఇన్ఫోసిస్ ప్రాధాన్యత
  • 70 గంటలకు… నారాయణమూర్తి స్వస్తి
  • తన ఆలోచనకు పూర్తి విరుద్ధమైన నిర్ణయం
  • ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నందునే…

సహనం వందే, న్యూఢిల్లీ:
వారానికి 70 గంటలు పని చేయాలని… అప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టించిన సంగతి తెలిసిందే. అంతేకాదు 1986లో మనదేశంలో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేసినప్పుడు కూడా ఆయన వ్యతిరేకించారు. ఆయన తీరు పట్ల టెకీలు, కార్మిక సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా తన ఇన్ఫోసిస్ సంస్థ ఉద్యోగులు ‘వర్క్-లైఫ్ బ్యాలెన్స్’పై దృష్టి సారించి సరికొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. రిమోట్ వర్క్ సమయంలో ఉద్యోగులు అధిక గంటలు పనిచేయకుండా నిరోధించేందుకు కంపెనీ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇకపై రోజుకు 9.15 గంటలకు మించి పనిచేసే వారికి హెచ్‌ఆర్ టీమ్ వ్యక్తిగత ఈమెయిల్‌లు పంపి, సమతుల్యతతో కూడిన జీవితం ఆరోగ్యానికి, దీర్ఘకాలిక వృత్తిపరమైన విజయానికి ఎంత కీలకమో తెలియజేస్తోంది.

పని గంటలు దాటితే హెల్త్ రిమైండర్…
ఇన్ఫోసిస్ రోజుకు 9.15 గంటలు, వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేస్తుంది. రిమోట్ వర్క్ చేస్తున్నప్పుడు ఈ పరిమితిని దాటితే, హెచ్‌ఆర్ విభాగం నుండి ‘హెల్త్ రిమైండర్’ ఈమెయిల్‌లు అందుతాయి. ఈ ఈమెయిల్‌లలో ఉద్యోగి రిమోట్‌గా ఎన్ని రోజులు పనిచేశారు, మొత్తం పని గంటలు, అలాగే రోజుకు సగటు పని గంటల వివరాలు స్పష్టంగా ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, క్రమం తప్పకుండా విరామం తీసుకోవడం, అవసరమైతే పనిని ఇతరులకు అప్పగించడం, పని గంటల తర్వాత రీఛార్జ్ అవ్వడం కోసం పని నుండి పూర్తిగా డిస్‌కనెక్ట్ అవ్వడం వంటి విలువైన సూచనలు కూడా ఈ మెయిల్స్‌లో ఉంటాయి. ఈ సరికొత్త విధానం 2023 నవంబర్ 20న అమలులోకి వచ్చిన హైబ్రిడ్ వర్క్ మోడల్‌లో భాగంగా ప్రవేశపెట్టారు. ఈ మోడల్ ప్రకారం… ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు ఆఫీసు నుండి పనిచేయాలి. అప్పటి నుండి రిమోట్ వర్క్ చేస్తున్న ఉద్యోగుల పని గంటలను హెచ్‌ఆర్ టీమ్ పర్యవేక్షిస్తోంది.

ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నందునే…
ప్రస్తుతం అనారోగ్యకరమైన జీవనశైలి, నిద్రలేమి, వేళ కాని సమయంలో భోజనం, అధిక పని కారణంగా గుండె సంబంధిత సమస్యలు సహా పలు ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఈ చర్యలు చేపట్టింది. 3.23 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్న ఇన్ఫోసిస్ వంటి పెద్ద సంస్థకు ఇది ఒక ముఖ్యమైన నిర్ణయం. ఇన్ఫోసిస్ తీసుకున్న ఈ కొత్త విధానం కంపెనీ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గత సంవత్సరం వ్యక్తం చేసిన అభిప్రాయాలకు విరుద్ధంగా ఉండటం గమనార్హం.

పరిస్థితులను బట్టి మార్పు…
‘భారతదేశం గ్లోబల్ పవర్‌హౌస్‌గా మారాలంటే యువత కఠినంగా శ్రమించాలని, 800 మిలియన్ల మంది పేదరికంలో ఉన్న దేశంలో వాళ్లు కాక ఎవరు కష్టపడతారని’ ఆయన ప్రశ్నించిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం నవంబర్‌లో సీఎన్ బీసీ గ్లోబల్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో… ‘వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్‌ నేను నమ్మను’ అని స్పష్టం చేశారు. నిజమైన పురోగతికి త్యాగం, నిరంతర కృషి అవసరమని ఆయన అన్నారు. మూర్తి వ్యాఖ్యలు అప్పట్లో దేశవ్యాప్తంగా వివాదానికి దారితీశాయి. కొందరు ఆయన విజయాలు, కష్టపడే సంస్కృతిని ప్రశంసించగా… మరికొందరు భారత ఐటీ రంగంలో అలాంటి ఆలోచనలు ఆరోగ్యకరమైనవి కావని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ తన ఉద్యోగుల శ్రేయస్సు కోసం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *