ఆంధ్రప్రదేశ్ ను అడ్డుకోండి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  • బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు
  • రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతాం
  • రైతులకు ప్రభుత్వం అండ ఉంటుందని వెల్లడి
  • 9 రోజుల్లోగా రూ. 9 వేల కోట్ల భరోసా
  • వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ‘రైతు నేస్తం’
  • వ్యవసాయ మంత్రి తుమ్మలకు ప్రశంసలు

సహనం వందే, హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్రానికి ఫిర్యాదు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఒకవేళ కేంద్రం ప్రాజెక్టుకు అనుమతిస్తే న్యాయస్థానాల్లో పోరాడుతామని తేల్చిచెప్పారు. బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం ముందు రాష్ట్రం తెలిపిన అభ్యంతరాల విషయంలో అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వివరించారు.‌గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం అన్ని రకాలుగా పోరాడుతామని స్పష్టం చేశారు.

తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయం దండుగ కాదని, పండుగ అని పునరుద్ఘాటించిన ఆయన, రైతులను రాజులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. రైతు భరోసా కింద ఈ నెల 16వ తేదీ నుంచి తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

రైతు సంబరాల్లో సీఎం భాగస్వామ్యం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా 1600 రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లక్షలాది మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి… ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఎకరాకు 12 వేల రూపాయల చొప్పున 1 కోటి 40 లక్షల ఎకరాలకు, 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసినట్లు వివరించారు.

వ్యవసాయానికి అంకితమైన ప్రజాప్రభుత్వం…
రైతాంగానికి అండగా నిలబడాలన్న లక్ష్యంతోనే రుణ మాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్, ఉచిత కరెంట్, స్ప్రింక్లర్లు, డ్రిప్, సోలార్ గిరి వికాసంలో పంపుసెట్లు, సివిల్ సప్లయ్ విభాగం ద్వారా ధాన్యం కొనుగోలు వంటి పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. కేవలం 18 నెలల కాలంలో వ్యవసాయరంగంపై 1.04 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ప్రజా ప్రభుత్వం తమదని వెల్లడించారు.

ఉద్యోగాలు… యువత వికాసం
అధికారం చేపట్టిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇటీవల ప్రకటించిన రాజీవ్ యువ వికాసం ద్వారా యువకులను ఆదుకునే ప్రణాళికలతో ముందుకు వస్తామని, తదుపరి కార్యక్రమంగా రాజీవ్ యువ వికాసం చేపడుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

మంత్రి తుమ్మలకు ప్రశంసలు…
రైతు భరోసా కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పలువురు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశంసించారు. రైతు ప్రభుత్వంలో కీలకమైన రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేశారని పలువురు తుమ్మలను అభినందించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *