కోడిగుడ్ల కుంభకోణం? – అంగన్‌వాడీ పిల్లల ఆకలితో ఆటలు

  • కోడిగుడ్ల కాంట్రాక్టు ఆలస్యంపై తీవ్ర విమర్శలు
  • నాలుగుసార్లు పొడిగింపు… తేలని ప్రక్రియ

సహనం వందే, హైదరాబాద్: అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టు వ్యవహారం రాష్ట్ర అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది. నెలల తరబడి సాగుతున్న ఈ ప్రక్రియ ఇప్పుడు అంగన్‌వాడీ పిల్లల పోషకాహారాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. తాజాగా నాలుగోసారి దరఖాస్తు గడువు పొడిగింపుతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువును పొడిగించింది. కానీ టెండర్లు ఎప్పుడు తెరుస్తారో మాత్రం చెప్పకుండా దాగుడుమూతలు ఆడుతోంది.

అంతులేని ఆలస్యం వెనుక ఉన్న మర్మం?
రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మార్చి 30న 2025-26 సంవత్సరానికి అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా కోసం టెండర్లను పిలిచింది. రాష్ట్రంలోని ఏడు జోన్లకు ఏడుగురు కాంట్రాక్టర్లను ఎంపిక చేయడమే లక్ష్యం. కానీ మూడు నెలలు గడిచినా టెండర్ల ప్రక్రియ కొలిక్కి రావడం లేదు. మార్చి 30వ తేదీ నుండి ఇప్పటివరకు నాలుగుసార్లు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఇది పౌల్ట్రీ రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.

ప్రజారోగ్యంతో చెలగాటం!
రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు కలిపి దాదాపు 21 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి సంవత్సరం 36 కోట్లకు పైగా కోడిగుడ్లు అవసరమని ఆ శాఖ అంచనా వేసింది. కానీ కాంట్రాక్టర్ల ఎంపికలో ఈ నిర్లక్ష్యం చూస్తుంటే, లబ్ధిదారులకు సకాలంలో గుడ్లు అందుతాయా లేదా అన్నది సందేహంగా మారింది. ఇది ప్రజారోగ్యంతో చెలగాటమా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

నిబంధనల పేరుతో అంతులేని ఆటలు!
మార్చి 30న ప్రారంభమైన టెండర్ ప్రక్రియ ఏప్రిల్ 10 నాటికి పూర్తి కావాల్సి ఉంది. అయితే కఠిన నిబంధనలు కొందరికే అనుకూలంగా ఉన్నాయంటూ పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనలకు దిగారు. వారి ఫిర్యాదులతో స్పందించిన ప్రభుత్వం గడువును ఏప్రిల్ 16కు పొడిగించినా నిబంధనలు మార్చలేదు. దీంతో ఆగ్రహించిన రైతులు ఏకంగా ముఖ్యమంత్రిని కలవడంతో, ఆయన ఆదేశాలతో మే 15 వరకు గడువు పొడిగించారు. అయినా నిబంధనలు మారకపోవడంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఫలితంగా గడువును జూన్ 16 వరకు మూడోసారి పొడిగించారు. జూన్ 17న టెండర్లు తెరవాల్సి ఉన్నా అదీ జరగలేదు. ఇప్పుడు తాజాగా జూన్ 30 వరకు నాలుగోసారి గడువు పొడిగించి, టెండర్లు తెరిచే తేదీని మాత్రం ప్రకటించకుండా గుట్టుగా ఉంచింది. ఇది మళ్లీ గడువు పొడిగింపుకే సంకేతమా అని పౌల్ట్రీ వర్గాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

ప్రశ్నార్థకంగా యంత్రాంగం నిబద్ధత…
కేవలం ఏడాది గుడ్ల కాంట్రాక్టు కోసం మూడు నెలలుగా ఈ ప్రక్రియను సాగదీయడం, నాలుగుసార్లు గడువు పొడిగించడం యంత్రాంగం పనితీరుకు నిదర్శనం. ప్రజల సొమ్ముతో, ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న ఈ కీలక కాంట్రాక్టుపై యంత్రాంగం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తోంది? టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లోపించిందా? లేక ఎవరికో లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ ఆలస్యం జరుగుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లేకపోతే అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా ఒక కుంభకోణంగా మారే ప్రమాదం ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *