- నాగ్, ధనుష్‌ల అద్భుత నటన
- ‘కుబేర’ సమీక్ష… రేటింగ్: 8.2/10
సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్: కొందరు దర్శకులు తమ చిత్రాలతో ప్రేక్షకుల్లో పూర్తిస్థాయి నమ్మకాన్ని కలగజేస్తారు. వారి సినిమా విడుదలవుతోందంటే గుండె ధైర్యంతో థియేటర్లకు వెళ్ళిపోవచ్చు. సుదీర్ఘమైన పాతికేళ్ల సినీ ప్రస్థానంలో ఆయన కేవలం పట్టుమని పది చిత్రాలు మాత్రమే రూపొందించినప్పటికీ, తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. నాలుగేళ్ళ విరామం తర్వాత, శేఖర్ కమ్ముల కుబేర చిత్రంతో వెండితెరపై తిరిగి మెరిశారు. మరి కుబేర ఎలాంటి అనుభవాన్ని అందించింది? నాగ్, ధనుష్ లాంటి స్టార్ నటులు శేఖర్ కమ్ములలోని కథకుడికి ఎలా సహకరించారు? వంటి అంశాలపై ‘సహనం వందే’ ప్రతినిధి వందసన విశ్లేషణ.
చమురు కుంభకోణం చుట్టూ కథ…
కుబేర కథ లక్ష కోట్ల రూపాయల చమురు కుంభకోణం చుట్టూ తిరుగుతుంది. ఈ భారీ మొత్తాన్ని మంత్రులకు, అధికారులకు బినామీల ద్వారా బదిలీ చేయాలి. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నలుగురు బిచ్చగాళ్లను ఎంపిక చేసుకుంటారు. వారిలో ఒకరు దేవా (ధనుష్). ఈ నలుగురికీ కనీసం అక్షర జ్ఞానం కూడా ఉండదు. తమ వెనుక జరుగుతున్న పెద్ద కుట్ర గురించి వారికి ఎలాంటి అవగాహన ఉండదు. ఈ బినామీ లావాదేవీలన్నీ ఒక మాజీ సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున) పర్యవేక్షణలో సాగుతాయి. దీపక్ స్వతహాగా మంచివాడే అయినప్పటికీ, కార్పొరేట్ వ్యవస్థలో తానూ ఒక పావుగా మారిపోతాడు. మరి ఈ కుంభకోణంలో లక్ష కోట్లు చేతులు మారాయా లేదా? ఈ క్రమంలో ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? తిరుపతిలో బిచ్చగాడిలా జీవనం సాగిస్తున్న దేవా, ఈ మహా కుట్రలో ఎలా చిక్కుకున్నాడు? చివరికి అందులోంచి బయటపడగలిగాడా లేదా? అన్నది మిగిలిన కథా భాగం.
శేఖర్ కమ్ముల డిఫరెంట్ స్టైల్…
శేఖర్ కమ్ముల చిత్రాలు సాధారణంగా కళాశాల నేపథ్యంలో సాగే ప్రేమకథలు లేదా భావోద్వేగ కుటుంబ డ్రామాలుగా ఉంటాయి. అయితే కుబేరతో ఆయన తన సంప్రదాయ శైలిని పూర్తిగా విడిచిపెట్టి, ఓ సరికొత్త ప్రయోగానికి పూనుకున్నారు. అవినీతి సొమ్ము ఎలా చేతులు మారుతుంది? బినామీ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి? వంటి అంశాలపై శేఖర్ కమ్ముల పరిశోధన చేసి ఈ కథను సిద్ధం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. చిత్రం మొదటి సన్నివేశం నుంచే దర్శకుడు కథాంశంలోకి దూసుకువెళ్తాడు. చమురు కుంభకోణం ఎలా ప్రారంభమైంది? అందులోకి మాజీ సీబీఐ అధికారి నాగార్జునను ఎలా లాగారు? బినామీల ప్రణాళిక… ఇవన్నీ వేగంగా, ఆసక్తికరంగా సాగిపోతాయి. చిత్రం ప్రారంభమైన దాదాపు అరగంట వరకు ధనుష్ తెరపై కనిపించడు. బిచ్చగాళ్ళ జీవితంలోని దయనీయ పరిస్థితులను దర్శకుడు అత్యంత ఆర్ద్రతతో తెరపై చూపించాడు. చనిపోతే కట్టెలు కూడా దొరకని అనామక బతుకులుగా వారిని చిత్రీకరించాడు. ఆ క్రమంలో వచ్చే ‘పోయిరా మామా’ గీతం భావోద్వేగాలను పతాక స్థాయికి చేర్చుతుంది. నలుగురు బిచ్చగాళ్ళ బతుకులు, వారి జీవితాల్లో వచ్చిన ఆకస్మిక మార్పులు, అందులోని ఆనందం, వెంటనే చోటుచేసుకునే విషాదం… కార్పొరేట్ కుట్రలో తాను బలిపశువు అయ్యానని దీపక్‌కు తెలియడం, దేవా తప్పించుకుని పారిపోవడం దగ్గరి నుంచి కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. రష్మిక పాత్రను కూడా రొటీన్ హీరోయిన్‌గా చూపించలేదు.